
కల్వర్టు నిర్మించాలని అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో
తలమడుగు: మండలంలోని కోడథ్ గ్రామ సమీపంలోగల పీహెచ్‌సీ వద్ద కల్వర్టు నిర్మించాలని గ్రామస్తులు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా గురువారం అంతర్రాష్ట్ర రహదారిపై ఆరుగంటల పాటు రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్ అంతరాయమేర్పడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారీ వర్షాలకు గ్రామంలోని 30 ఇళ్లలోకి వరదనీరు చేరి నిత్యావసరాలు, ఆహార పదార్థాలు తడిచి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కల్వర్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేసేదాకా రాస్తారోకో కొనసాగిస్తామని హెచ్చరించారు. తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎస్సై రాధిక, ఎంపీడీవో శంకర్ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉన్నతాధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణానికి వెంటనే రూ.20 లక్షల నిధులు మంజూరు చేయడంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు.