
నమాజ్‌లో ముస్లింలు (ఫైల్)
● మంగళవారం తొలి ఉపవాసం ● దర్శనమిచ్చిన నెలవంక ● నెల రోజులపాటు ఉపవాసాలు
నెన్నెల/ఉట్నూర్‌రూరల్: ఆకాశంలో సోమవారం రాత్రి నెలవంక దర్శనంతో రంజాన్ మాసం మొదలైంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా, కఠోర నియమాలతో ఆహార పానీయాలు ముట్టుకోకుండా నెల రోజులపాటు ఆచరించే రంజాన్ ఉపవాసాలు జిల్లాలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచి మొదటి ఉపవాస దీక్షకు ముస్లింలు సిద్ధమయ్యారు. సోమవారం రాత్రి నుంచే మసీదుల్లో ఖురాన్ పఠనం, తరావీ నమాజ్‌లు ప్రారంభమయ్యాయి. పవిత్ర మాసంలో నమాజ్‌ల కోసం మసీదులను జిల్లాలో ముస్తాబు చేశారు. వేకువ జామున ఉపవాస దీక్ష(సహార్) ప్రారంభించి సాయంత్రం దీక్ష విడిచే సమయం(ఇఫ్తార్) కోసం పట్టణాల్లో ప్రత్యేక వంటకాలు అందించడానికి హోటళ్లు కూడా సిద్ధమయ్యాయి. ఇలా 30 రోజులపాటు ఉపవాసాలు ఆచరించి మళ్లీ సాయంత్రం ఆకాశంలో నెల వంకను చూసి మరుసటి రోజు ఉదయాన్నే రంజాన్ పండుగను జరుపుకుంటారు.
అతి పవిత్ర మాసం
ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. దివ్య ఖురాన్ గ్రంథం దివి నుంచి భువికి ఈ మాసంలోనే వచ్చిందని విశ్వసిస్తారు. ఈ నెలలో ఉపవాసాల ద్వారా శరీరాన్ని శుష్కింపజేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుందని నమ్ముతారు.
ప్రత్యేక నమాజ్‌లు
ప్రతీ రోజు రాత్రి 8.30గంటల నుంచి 10గంటల వరకు ఈ మాసంలో ప్రత్యేకంగా తరావీ నమాజ్‌లు చేస్తారు. దివ్య ఖురాన్‌ను రోజుకు 20రకాతుల చొప్పున తరావీ నమాజ్‌లో 27 రోజులపాటు హాఫిజ్‌లు పాటిస్తారు. రంజాన్‌లో రాత్రి పూట ఇషా నమాజ్ అనంతరం తరావీ నమాజ్ జరుగుతుంది. ఇలా 25రోజుల తరావీ నమాజ్ తర్వాత 26వ రోజు సబ్ ఏ ఖదర్ రాత్రి నుంచి ఈద్ ఉల్ ఫితర్ వరకు ఉపవాస దీక్ష ఆచరిస్తారు. ఇహ లోకంలో ఆచరించే ఈ కఠోర దీక్షలు పరలోకంలో రక్షణగా ఉండి కాపాడుతాయని ముస్లింల ప్రగాఢ విశ్వాసం.
పవిత్ర మాసం
ఈ మాసంలో నాలుగు ప్రత్యేకతలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నియమ నిష్టతో ఉపవాసం ఉండడం, ఖురాన్ చదవడం, సంవత్సరంలో సంపాదించిన ఆదాయంలో ఫిత్ర, జకాత్ బీదవారికి అందించడం, బీదవారికి రంజాన్ మాసంలో సహాయం అందించడం వంటి కార్యక్రమాలు అధికంగా చేస్తుంటారు.
– హఫీజ్ మహ్మద్ మోయినొద్దీన్, ఉట్నూర్
నియమ నిష్టలతో ప్రార్థనలు
రంజాన్ మాసం చాలా దైవంతో కూడిన మాసం. ఇందులో నియమ నిష్టలతో ప్రార్థనలు, అన్ని విధాలుగా నెలపాటు కఠోర దీక్షలు చేపడితే దేవుడు తన దగ్గరి వాడిగా చేసుకుంటాడు. రంజాన్ నెలలో పని మనిషి కష్టాలను యజమాని దూరం చేసినట్లయితే దే వుడు ఆయన తప్పులను క్షమించేస్తాడు. ప్ర తీయేడు ఈ పండుగను ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి చేసుకోవడం ఆచారంగా వస్తోంది.
– రిజ్వాన్ మౌలానా, సఫాబైతుల్ మాల్ మండల అధ్యక్షుడు, ఉట్నూర్
