ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలత: సజ్జల రామకృష్ణారెడ్డి | Sakshi
Sakshi News home page

ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలత: సజ్జల రామకృష్ణారెడ్డి

Published Tue, May 14 2024 3:45 AM

tdp attacks due to fear of defeat: Sajjala Ramakrishna Reddy

తమ సంక్షేమానికి కృషి చేసిన సీఎం జగన్‌కు ప్రజలు అండగా నిలిచారు 

భారీ ఎత్తున పోలింగ్‌కు తరలిరావడమే ఇందుకు నిదర్శనం

సీఎం వైఎస్‌ జగన్‌ అజెండాను ప్రజలు ఆమోదించారు 

ఇది చూసి నిరాశా నిస్పృహలతో టీడీపీ దుశ్చర్యలకు ఒడిగట్టింది 

ఓటర్లను భయభ్రాంతులను చేసేందుకు మారణాయుధాలతో దాడులకు దిగింది 

టీడీపీ గూండాలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏపక్షంగా వ్యవహరించారు 

పోలింగ్‌కు ముందు రోజు కూడా అన్యాయంగా అధికారుల్ని బదిలీ చేశారు.. సస్పెన్షన్‌లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ ఆఫీసులో

కూర్చుని ఎస్పీలను బెదిరించారు 

కుప్పంతో సహా పలు నియోజక వర్గాల్లో టీడీపీ రిగ్గింగ్‌కు పాల్పడింది 

ఆధారాలతో సహా 80కి పైగా ఫిర్యాదులు చేశాం 

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  

సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో పోలింగ్‌ సరళిని చూస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపించిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఐదేళ్లలో సీఎం జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదలందరి అభివృద్ధి, మహిళా సాధికారత కోసం పాటుపడ్డారని తెలిపారు. అందుకే సీఎం జగన్‌కు అట్టడుగు వర్గాలు అండగా నిలిచి ఓటింగ్‌కు పెద్ద ఎత్తున వచ్చి అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. 

ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు తరలివచ్చి స్వేచ్ఛగా ఓటు వేశారన్నారు. ఆయన సోమవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘2019లోనూ ఉప్పెనలా పోలింగ్‌ జరిగింది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. ఈసారి ఓటింగ్‌ సరళి, భారీ పోలింగ్‌ ప్రభుత్వ సానుకూలతను చూపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇది అరుదు’ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మంచికి ఓటేయాలని ప్రజలు ముందుగానే నిర్ణయించుకొన్నట్టు ఇది సూచిస్తోందన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతకు, రాజకీయ చైతన్యానికి ఇదొక తార్కాణంగా అభివర్ణించారు. ఇంకా ఆయన ఎమన్నారంటే..

నైరాశ్యంలో టీడీపీ దాడులు
ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్‌ వరకు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు టీడీపీ దుష్ట పన్నాగాలు చేసింది. వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలు ఓట్లేయడం చూసి టీడీపీ రౌడీ మూకలు నిరాశ, నిస్పృహలతో దాడులకు తెగబడ్డాయి. రాష్ట్రమంతటా టీడీపీ గూండాలు విశృంఖలంగా రోడ్లపై కత్తులు, కర్రలు వంటి మారణాయుధాలతో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. చిత్తూరు, నరసరావుపేట, మాచర్ల, దాచేపల్లి, పెనమలూరు, తాడిపత్రి, పొన్నూరు, జీడీ నెల్లూరు, అద్దంకి, పీలేరు, ఆత్మకూరు, జగ్గయ్యపేట, సత్తెనపల్లిలో విధ్వంసానికి పాల్పడ్డారు.

పోలీసు అధికారులు, ఎన్నికల కమిషన్‌ అబ్జర్వర్ల అండతోనే టీడీపీ హింసాకాండకు పాల్పడింది. ఏదో రకంగా పోలింగ్‌ను అడ్డుకోవాలనే దుస్సాహసం టీడీపీలో కనిపించింది. ఎన్నికల అబ్జర్వర్లు పల్నాడు జిల్లాను బందిఖానా చేసినా.. టీడీపీ గూండాలు ఎలా రెచ్చిపోయారు? ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని వైఎస్సార్‌సీపీ ఎంతో సంయమనంతో వ్యహరించింది. టీడీపీ మాత్రం ప్రభుత్వ అనుకూల ఓటరు బయటకు రాకూడదని కుట్రలు చేసింది. కచ్చితంగా పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి కూడా పోలీసులపై ఒత్తిడి వచ్చింది.

మరోవైపు సస్పెన్షన్‌లో ఉన్న పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వర్లు టీడీపీ ఆఫీసులో కూర్చుని  అధికారంలోకి వచ్చేస్తున్నామంటూ ఎస్పీలను బెదిరించారు. చివరికి పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో దాడులకు తెగబడ్డారు. మరోవైపు పోలింగ్‌కు ఒక రోజు ముందు కూడా అన్యాయంగా పోలీసులను బదిలీ చేశారు. వారి ఆగడాలకు అడ్డుగా ఉంటారనే ఎటువంటి ఫిర్యాదులూ లేకపోయినా తప్పించేశారు. 2019 ఎన్నికల్లోనూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని చంద్రబాబు దబాయించారు. ఇప్పుడు కేంద్రంతో ఒత్తిడి చేయించి వారి కార్యాన్ని నేరవేర్చుకోవాలని చూశారు. ఎన్నికల కమిషన్‌కు వీలైనంత సపోర్టు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీ వారి ప్రతి నిర్ణయాన్ని అంగీకరించింది. మేము ఎంత సర్దుకుపోయినా దానిని లోకువగా తీసుకున్నారు.

సీఎం జగన్‌ అజెండా పోలింగ్‌లో స్పష్టమైంది
టీడీపీ అజెండా ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉంది. అధికారం, అండ కోసం టీడీపీ కేంద్రంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని, ఓట్ల కోసం ఓ పెద్ద సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కలుపుకొన్నా ఫలితం శూన్యమైంది. చెప్పుకోవడానికి గతంలో చేసిందేమీ లేకపోవడం, భవిష్యత్తులో చేసే దానిపై స్పష్టత ఇవ్వకుండా పోలింగ్‌ రోజు వరకు నాటకాలాడారు. సీఎం జగన్‌పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వారి పప్పులు ప్రజల దగ్గర ఉడకలేదని తెలిసిన తర్వాత దాడులకు తెగబడ్డారు.

సీఎం జగన్‌ పేద కుటుంబాల అభివృద్ధికి ఎప్పుడైతే యజ్ఞం ప్రారంభించారో అప్పుడే ఆయన అజెండా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అజెండా ఉండాలని ప్రజలు భావించడం పోలింగ్‌లో స్పష్టంగా తెలుస్తోంది. సీఎం జగన్‌ అజెండాతో పోటీపడే శక్తి లేకపోవడంతోనే కృత్రిమ అజెండాలతో ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టుపై దుష్ప్రచారం చేసినా టీడీపీ పాచికలు పారలేదు.

కుప్పంలో టీడీపీ రిగ్గింగ్‌
వెబ్‌ కాస్టింగ్‌ వచ్చిన తర్వాత కూడా టీడీపీ నిర్లజ్జగా రిగ్గింగ్‌కు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. కుప్పంలోనే 1, 2, 57, 92, 93, 94, 194, 195, 203 పోలింగ్‌ బూత్‌లలో రిగ్గింగ్‌ చేశారు. మాచర్ల, టెక్కలి, వేమూరు, గుంటూరు వెస్ట్, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి, పొన్నూరు, అమలాపురంలో జరిగిన రిగ్గింగ్‌ ఘటనలపై ఎన్నికల కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. టీడీపీ నేతలు ఉక్రోశంతో ఈవీఎంలను పగలగొట్టారు. ఇలా టీడీపీ దుశ్చర్యలపై 80కి పైగా ఫిర్యాదులు చేశాం.

Advertisement
 
Advertisement