రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి
గంజాయికి వ్యతిరేకంగా ఈ నెల 12 వరకు సంతకాల సేకరణ
12న ర్యాలీ.. 14న భోగి మంటల్లో గంజాయి దహనం
ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం
సాక్షి, అమరావతి: గంజాయి నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని పలువురు వక్తలు ధ్వజమెత్తారు. ‘గంజాయిని అరికట్టాలి–యువత భవితను కాపాడాలి’ అనే అంశంపై విజయవాడ బాలోత్సవ భవన్‌లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. వంద రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా, వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని మండిపడ్డారు.
రాజకీయ అండతో గంజాయి గ్యాంగులు చెలరేగిపోతున్నాయని, ఇటీవల నెల్లూరు జిల్లాలో పెంచలయ్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గంజాయి నిరోధానికి విద్యాసంస్థల పరిసరాల్లో నిఘా కమిటీలు, గంజాయికి బానిసలైన యువతకు డి–అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని కోరారు. యువజన, మహిళా సంఘాలు గంజాయిపై సమరభేరికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 7 నుంచి 12 తేదీ వరకు గంజాయికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 12న గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాలని, అలాగే, 14న భోగి మంటల్లో గంజాయి దహనం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీదేవి, వి.సావిత్రి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్ తదితర ప్రజాసంఘాల మహిళా నేతలు మాట్లాడారు.


