Lakshmi narasimha Brahmotsavam
-
‘కదిరి రథోత్సవంలో పాల్గొనేందుకు వీలులేదు’.. బీజేపీ నేతపై ఆంక్షలు
సాక్షి,అనంతపురం: కదిరిలో టీడీపీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య విభేదాలు చర్చాంశనీయంగా మారాయి. బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు విధించారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో పాల్గొనవద్దని హుకుం జారీ చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ వైఖరిని బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఖండించారు.గత 30ఏళ్లుగా రథోత్సవంలో పాల్గొంటున్నా. నాపై ఆంక్షలు విధించడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఆంక్షలు లెక్క చేయనని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, విష్ణువర్ధన్‌రెడ్డి కట్టడి చేసేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. -
యాదగిరీశుని కళ్యాణోత్సవము..!
అభయ ప్రదాతగా... భక్తులను వెన్నంటి ఉండే ఆపద్బాంధవుడిగా యాదగిరీశుని భక్తులు కొలుస్తుంటారు. పిలిచిన వెంటనే పలికే ఆప్తుడిగా... అందరి స్వామిగా భక్త జనుల గుండెల్లో కొలువై ఉన్న యాదగిరీశుడు సౌభాగ్య ప్రదాయిని లక్ష్మీదేవితో సహా కొలువైన క్షేత్రం యాదగిరి నృసింహుడి సన్నిధి. ఈ క్షేత్రంలో గత బుధవారం ఫిబ్రవరి 18న ఆరంభమైన శ్రీస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం, శ్రీస్వామి వారి తిరు కల్యాణోత్సవం బుధవారం జరగగా శ్రీస్వామి దివ్య విమాన రథోత్సవం అర్చకులు నేడు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలతో యాదగిరి క్షేత్రం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకోవడంతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తోంది. యాదగిరి లక్ష్మీనరసింహుడి రూపం ఉగ్రం. మనస్సు నవనీతం. ఘనసింహం గర్జిస్తున్నట్లు.. ముల్లోకాలను వణికించే మృగరాజు పంజా విసురుతున్నట్లు హిరణ్య కశపుడిని రక్కి, చీల్చి చండాడిన ఆ దేవుడి చేతులు ఆది మహాలక్ష్మిని మాత్రం అతి సున్నితంగా అక్కున చేర్చుకున్నాయి. సృష్టికర్త బ్రహ్మకే ఆయువు పోసిన బ్రహ్మాండ నాయకుడని పురాణాలు ఘోషిస్తున్నాయి. పురాణాల పరంగా...యాదగిరి ప్రశస్థికి సంబంధించి ఎన్నో ఇతిహాసాలు రామాయణ మహాకావ్యంలోనూ ప్రస్తావనలున్నాయి. మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు రుష్యశృంగుడు. అతడి పుత్రుడైన యాద మహర్షి తపో శక్తితోనే యాదగిరిగుట్ట వెలసిందంటారు. యాదుడు బాల్యం నుంచి మహావిష్ణుభక్తుడు. దేవదేవుడిని తిలకించాలన్న తపన నానాటికి పెరిగింది. అందులోనూ ఉగ్రరూపుడైన నృసింహావతారం పట్ల ఎనలేని మక్కువ కలిగింది. దైవసాక్షాత్కారం కోసం దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతికి చిక్కాడు. ఆటవికులు యాదుడిని క్షుద్ర దేవతలకు బలి ఇవ్వబోయారు. ఆపద సమయంలో ఆంజనేయుడు అండగా నిలిచాడు. కీకారణ్యంలో సింహాకార గుట్టలు ఉన్నాయని, అక్కడికి వెళ్లి తపస్సు చేస్తే స్వామి సాక్షాత్కరిస్తాడని యాదుడికి ఆంజనేయుడు సూచించాడు. యాదర్షి దీర్ఘకాలిక తపస్సు ఫలించి స్తంభోద్భవుడు తొలుత జ్వాల, గండబేరుండ, యోగనంద, ఉగ్రసింహ, శ్రీలక్ష్మీ సమేతుడిగా (పంచరూపాలతో) దర్శనమివ్వడంతో ఈ క్షేత్రం పంచనారసింహ నిలయంగా పురాణాలకెక్కింది. యాద రుషి కోరిక ఫలితంగా వెలసిన ఈ క్షేత్రం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది.రక్షణగా సుదర్శన చక్రం...తపోముద్రలో ఉన్న మహర్షిని మింగేయాలని ప్రయత్నించిన ఒక రాక్షసుడిని మరుక్షణమే విష్ణుమూర్తి సుదర్శన చక్రం అడ్డుకుని వధించింది. ఆటంకాలు, ఆపదలు కలగకుండా గుట్ట చుట్టూ సుదర్శనం రక్షా కవచంగా నిలిచి ఉంటుందన్నది భక్తుల అపార విశ్వాసం. ప్రస్తుతం ఈ విమాన గోపురం, సుదర్శన చక్రం స్వర్ణమై భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక స్వామి పుష్కరిణి సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదాల నుంచే పుట్టిందంటారు. ఈ పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరిస్తే శారీరక రుగ్మతలు, గ్రహబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు అంటుంటారు. ఎంతోకాలంపాటు మరుగున పడిపోయిన ఈ క్షేత్ర మహాత్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించారు. స్వామి కలలో కనిపించిన తన అవతార రహస్యాన్ని చెప్పాడట. హైదరాబాద్ వాస్తవ్యుడు రాజామోతీలాల్ 1920లో ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. ఆయన హయాంలోనే పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంతో పూజలు మొదలయ్యాయని స్థానికులు చెబుతారు. బ్రహ్మోత్సవాల్లో అలంకార, వాహన సేవలు ఇవే...శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు అలంకార ప్రియుడు కావడంతో యాదగిరీశుడి క్షేత్రం అర్చకులు వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు నుంచి అలంకార సేవలను ప్రారంభిస్తారు. 20వ తేదీన ఉదయం మత్స్యావతార అలంకార సేవ, రాత్రి శేష వాహన సేవ, 21వ తేదీ ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంసవాహన సేవ, 22వ తేదీ ఉదయంశ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి పొన్నవాహన సేవ, 23వ తేదీ ఉదయం గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ, 24వ తేదీ ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవలో శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం, 25వ తేదీ ఉదయం శ్రీరామ అలంకార (హనుమంత వాహన సేవ), రాత్రి గజ వాహన సేవలో శ్రీస్వామి వారు పెండ్లి కొడుకుగా కల్యాణ వేధికపై తిరు కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. నేటి ఉదయం అంటే గురువారం శ్రీమహావిష్ణు వాహనమైన గరుడ వాహన సేవతో అలంకార సేవలు ముగుస్తాయి. రాత్రి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది.చివరి రెండు రోజులు ఇలా.. ఉత్సవాల్లో చివరి రెండు రోజులు సైతం విశేష పర్వాలను చేపడతారు. 27వ తేదీన ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, విష్ణు పుష్కరిణిలో అవభృదస్నానం జరిపిస్తారు. అదే రోజు రాత్రి వేళ శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను జరిపిస్తారు. చివరి రోజైన 28వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం జరిపించి, రాత్రి 9 గంటలకు శృంగార డోలో త్సవాన్ని నిర్వహించి ఉత్సవాలకు పరి సమాప్తి పలుకుతారు -
ఘనంగా లక్ష్మీనరసింహ కళ్యాణం
-
నేటి నుంచి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పూర్వగిరి (పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు స్వస్తివాచనం, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 10వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో 6వ తేదీన గురువారం ఉదయం 6 గంటలకు హవనం, అలంకార సేవ, సింహవాహన సేవ నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. 7వ తేదీన ఉదయం 8 గంటలకు తిరుమంజనోత్సవం, హనుమంత వాహన సేవ నిర్వహించి, సాయంత్రం 8 గంటలకు స్వామి వారి తిరుకల్యాణోత్సవం జరిపిస్తారు. 8వ తేదీన ఉదయం హవనం, గరుడవాహన సేవ జరుగుతుంది. రాత్రి 8 గంటలకు స్వామి వారి రథోత్సవం, 9వ తేదీన ఉదయం 9.30 గంటలకు పూర్ణాహుతి, మధ్యాహ్నం 12 గంటలకు చక్రతీర్థ స్నానం నిర్వహిస్తారు. 10వ తేదీన ఉదయం 10 గంటలకు స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పండిత సన్మానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. -
కాటమ రాయుడా... కదిరి నరసింహుడా...
పుణ్యతీర్థం మార్చి 7 నుంచి ఖాద్రీ లక్ష్మీ నారసింహుని బ్రహ్మోత్సవాలు ఆ దేవుడు కాటమరాయుడు. ఆయనే కదిరి నరసింహుడు. భక్తుల చేత వసంత వల్లభుడిగా, ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడిగా పూజలు అందుకుంటున్న శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడి దివ్య క్షేత్రం అనంతపురం జిల్లా కదిరిలో ఉంది. నిత్య వైభవంతో కళకళలాడే ఈ క్షేత్రం మార్చి 7 నుంచి వారం రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలతో భక్తులతో కిటకిటలాడనుంది. జై నారసింహ ధ్వానాలతో మార్మోగనుంది. భక్త ప్రహ్లాదుని సహిత నారసింహుని క్షేత్రం భారత దేశంలో మరెక్కడా లేదు. ఒక్క కదిరిలోనే ఉంది. అది తెలుగువారికే సొంతమైన మరో విశేషం. శ్రీ మహావిష్ణువు దానవుడైన హిరణ్య కశిపుని శిక్షణకు భక్తుడైన ప్రహ్లాదుని రక్షణకు నరసింహుని అవతారంలో స్తంభం నుంచి ఉద్భవించాడు. హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆ ఉగ్రరూపంలోనే కదిరి సమీపంలోని కొండపై సంచరించసాగాడు. స్వామి అలాగే ఉండటం సరికాదని ఆయనను శాంతింప చేయాలని భావించిన మహర్షులు, దేవతలు ఆ కొండపైకి చేరి నరసింహుణ్ణి స్తోత్రిస్తూ నెమ్మదిగా శాంతింప చేశారు. అలా ఆ కొండకు ‘సోత్రాద్రి’ అని పేరు వచ్చింది. దీనికి గుర్తుగా ఆ కొండపై కదిరికొండ లక్ష్మి నరసింహ దేవస్థానం ఉంది. అదే కొండపై భక్తులకు విష్ణుపాదాలు కూడా కనిపిస్తాయి. ‘ఖ’ అంటే విష్ణుపాదమని, అద్రి అంటే కొండ అని విష్ణుపాదాలు ఉన్న కొండ కనుక ఈ ప్రాంతానికి ఖద్రి లేదా ఖాద్రి అనే పేరు వచ్చిందని అంటారు. ఖాద్రి చెట్ల నుంచి... కదిరి పక్కన ఉన్న కొండపై పూర్వం ఖదిర వృక్షాలు (చండ్ర చెట్లు లేదా మడుగు దామర లేదా ఇండియన్ మల్బరీ) ఎక్కువగా ఉండేవని ఈ చెట్ల దగ్గర ఉన్న పుట్టలో నారసింహ స్వామి స్వయంభువుగా వెలిశాడని కనుక ఈ నారసింహుణ్ణి ఖాద్రి లక్ష్మీ నరసింహుడు అన్నారని మరో కథనం. స్వామి స్వయంభువుగా వెలిశాడనేదానికి గుర్తుగా అభిషేకం చేశాక హృదయ భాగం నుంచి స్వేద బిందువులు కనిపిస్తాయని ఇది స్వామి వారి మహిమ అని భక్తులు భావిస్తారు. పాలెగాడి గోవులు... ఈ ప్రాంతాన్ని పదవ శతాబ్దంలో పాలించిన రంగనాయకులు అనే పాలెగాడి గోవులు రోజూ కదిరి కొండపైకి వెళ్లి అక్కడ ఖాద్రీ వృక్షాల కింద గల పుట్టలో ఉన్న నరసింహస్వామికి పాలు ఇచ్చి వచ్చేవనీ, దీని దరిమిలా రంగనాయకులు తనకు తెలియకుండానే రోజు రోజుకూ శ్రీమంతుడు అయ్యాడని కథనం. చివరకు ఒకరోజు స్వామి రంగనాయకుల కలలో కనిపించి తాను స్వయంభువుగా వెలిశానని, తన విగ్రహాన్ని వెల్లడించి గుడి కట్టించమని కోరాడని తత్ఫలితంగా రంగనాయకులు గుడి కట్టాడని కథనం. అయితే ఆనాటి మూలవిరాట్టు కాలగతిలో అదృశ్యమవగా బుక్కరాయల కాలంలో ఆ తర్వాత హరిహరరాయల కాలంలో చివరిగా శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో ఈ గుడి సంపూర్ణ నిర్మాణం పూర్తి చేసుకున్నట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. భృగు మహర్షి తపోస్థలం... విష్ణువు అనుగ్రహం కోసం భృగు మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశాడని, ఈ తపస్సుకు మెచ్చిన విష్ణువు తాను కోనేటిలో వెలిసి ఉన్నానని, తన విగ్రహాలను వెల్లడి చేసి పూజాదికాలు నిర్వహించమని కోరినట్టు కథనం. ఇది జరిగింది వసంత మాసంలో కనుక భృగువు కోనేరు నుంచి నారసింహుని విగ్రహాలను బయటకు వెల్లడి చేసింది వసంత మాసంలోనే కనుక ఈ స్వామిని వసంత వల్లభుడు అని కూడా అంటారు. విగ్రహాలు వెల్లడైన కోనేటిని ‘భృగు తీర్థం’ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం భృగు మహర్షి కాలం నాటి ఈ విగ్రహాలను ఉత్సవ విగ్రహాలుగా ఉపయోగిస్తున్నారు. ఇవి దివ్యతేజస్సుతో ఉండటం భక్తులు గమనిస్తారు. ఇలా ఉత్సవ విగ్రహాలు ఇంత తేజస్సుతో ఉండటం దేశంలోని వేరే ఏ గుడిలోనూ చూడలేమని భక్తులు అంటారు. కంభాల రాయుడు... కాటమ రాయడు... దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు సగంమనిషి, సగం సింహంగా నరసింహావతారంలో భీకర రౌద్ర స్వరూపంతో అవతరించాడు. హిరణ్య కశిపుడి సభామంటపం నందలి çస్తంభం (కంబం) నుంచి స్వామి ఆవిర్భవించాడు కనుక శ్రీవారిని కంబాలరాయుడని భక్తులు పిలుచుకుంటాడు. అలా ఈ స్వామికి కాటమరాయుడు, భేట్రాయస్వామి.. అనే పేర్లు కూడా ఉన్నాయి. అన్నమాచార్యులు సైతం తన కీర్తనల్లో సైతం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కాటమరాయుడా.. అని కీర్తించారు. కాటమరాయుడు అనే పేరు ఎలా వచ్చిందంటే కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండలం గొడ్డువెలగల సమీపంలోని కొండపై చండ్రవృక్షపు కొయ్య స్తంభం నుంచి నరసింహ స్వామి వెలసినట్లు భక్తుల విశ్వాసం. ఆ కొండను ఆనుకొని ‘కాటం’ అనే కుగ్రామం కూడా ఉండటంతో స్వామిని కాటమరాయుడిగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు పాలేగాళ్లు పాలించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో పాలేగాళ్ల వారసులు పాల్గొంటారు. పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఉపవాసంతో గొడ్డువెలగల నుండి నృసింహాలయానికి ఆనవాయితీగా ఇప్పటికీ జ్యోతిని తీసుకొస్తున్నారు. బేట్రాయి స్వామి దేవుడా... కదిరి శ్రీ లక్ష్మి నరసింహస్వామికి తెలుగు ప్రాంతం కంటే కూడా కర్ణాటక ప్రాంత భక్తులు ఎక్కువ. విశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో ‘పారు వేట’ ఒక ముఖ్య కార్యక్రమం. శ్రీదేవి, భూదేవిలతో వసంతవల్లభుడు క్రూరమృగాలను వేటాడటానికి కదిరి కొండకు వస్తాడనడానికి సంకేతంగా అర్చకులు ఈ ‘పారువేట’ను నిర్వహిస్తారు. ఈ పారువేట వల్ల ‘వేట రాయడు’ కాస్త కన్నడభాష వల్ల ‘బేట్రాయుడు’ అయ్యాడు. మృగాల నుంచి ప్రజలను రక్షించడం పాలకుడి ధర్మం. మనసులో సంచరించే దుష్ట ఆలోచనలనే క్రూరమృగాలను స్వామి సంహరిస్తాడన్న దానికి సంకేతంగా కూడా పారు వేటను చెప్పుకోవచ్చు. – చెరువు శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’ కదిరి, అనంతపురం కదిరికి చేరుకోవడం ఎలా?: ఖాద్రీ క్షేత్రాన్ని చేరుకోవడానికి అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. అక్కడి నుంచి ఈ క్షేత్రం 90 కి.మీ. పుట్టపర్తి నుంచి కేవలం 40 కి.మీ దూరం. అక్కడి నుండి గోరంట్ల మీదుగా లేదంటే న ల్లమాడ మీదుగా రోడ్డుమార్గం ద్వారా చేరుకోవచ్చు. తిరుపతి నుండి మదనపల్లి మీదుగా లేదంటే పీలేరు, రాయచోటి మీదుగా కూడా రావచ్చు. పరిసర ప్రాంతాల్లో చూడదగ్గ ప్రదేశాలు: కదిరి లక్ష్మీ నారసింహుని దర్శించుకున్న పిమ్మట కదిరి–రాయచోటి రోడ్డు మార్గంలో కేవలం 12 కి.మీ దూరంలో గాండ్లపెంట మండలం కటారుపల్లిలో యోగి వేమన సమాధిని చూడవచ్చు. తర్వాత అదే మార్గంలో మరో 15 కి.మీ దూరంలో ఎన్ పీ కుంట మండలం గూటిబైలు గ్రామంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ది గాంచిన తిమ్మమ్మ మర్రిమాను సందర్శించ వచ్చు. వీటిని చూసేందుకు కదిరి ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సు సౌకర్యం ఉంది. పుట్టపర్తిని కూడా దర్శించుకోవచ్చు. దేశంలోనే 3వ అతి పెద్ద తేరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఖాద్రీ లక్ష్మీనారసింహుడు బ్రహ్మరథంపై దర్శనమిస్తాడు. ఈ రథం సుమారు 540 టన్నుల బరువు, 37.5 అడుగుల ఎత్తు ఉంది. రథంలోని పీఠం వెడల్పు 16 అడుగులు ఉంది. 130 ఏళ్ల క్రితం తయారు చేసిన ఈ బ్రహ్మ రథం చక్రాలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మూడేళ్ల క్రితం మరమ్మతులు కూడా చేయించారు. రథంపై సుమారు 256 శిల్ప కళాకృతులను టేకుతో అందంగా తీర్చిదిద్దారు. తమిళనాడులోని అండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథం తర్వాత 3వ అతిపెద్దది ఈ ఖాద్రీ నృసింహుని రథం. భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీనారసింహుడు ఒక్క కదిరిలోనే ఉన్నాడు. ఈ దర్శనం ఇంకెక్కడా జరగదు. స్వామికి పక్షం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరిపేది ఇక్కడే. ప్రతి నెలలో స్వాతినక్షత్రం రోజు మాత్రమే మూలవిరాట్‌కు అభిషేకం చేస్తాం. అది భక్తులు చూసి తీరాల్సిన సేవ. – పార్థసారథి, ఆలయ ప్రధాన అర్చకులు -
భక్తులతో నిండిపోయిన కదిరి
కదిరి: అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం తుది అంకానికి చేరుకున్నాయి. అత్యంత కీలకమైన రథోత్సవం అసంఖ్యాక భక్త జనం నడుమ ఉదయం ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే చాంద్‌బాషా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు పడమర గోపురం వద్దకు స్వామివారి రథం చేరుకుంది. ఆలయ తిరువీధులలో స్వామి వారి రథం ఒక్కమారు ఊరేగనుంది. రథోత్సవాన్ని చూసేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 3 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. పట్టణ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్దన్‌రెడ్డి కూడా రథోత్సవంలో పాల్గొన్నారు.


