ట్రేడ్‌ వార్‌ ఎటు పోతోంది?

Sakshi Special Story On American Trade War

యుద్ధం మొదలైంది...  
తుపాకీ మోతల్లేవు.. క్షిపణులు అంతకంటే లేవు.. 
కానీ పోరు జరుగుతున్నది మాత్రం నిజం. ఎందుకంటే ఇది వాణిజ్య యుద్ధం!  
అగ్రరాజ్యాధిపతి కవ్విస్తున్నాడు.. ఇతర దేశాలు ఆ ఉచ్చులో పడిపోతున్నాయి! 
పన్నుకు పన్ను పడుతోంది. మార్కెట్లు వేడెక్కుతున్నాయి! 
ఈ పోటీ ఇంకొంచెం ముదిరిందా? 
ఏ దేశాన్నీ వదలదు.. ప్రపంచాన్ని కబళిస్తుంది... 

‘పోరు నష్టం... పొందు లాభం..’ అని మనం చిన్నప్పుడెప్పుడో ఓ సామెత చదువుకున్నాం. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ఈ సామెత  అర్థం పెద్దగా తెలిసినట్టుగా లేదు. అమెరికా ఫస్ట్‌ అంటున్నాడు.. అందుకోసం ఎంతకైనా తెగిస్తానని బీరాలు పోతున్నాడు కూడా. అమెరికన్ల ప్రయోజనాలు కాపాడటంపై ఎవరికీ అభ్యంతరాల్లేవు గానీ.. ఈ క్రమంలో ప్రపంచాన్ని ముంచేసే ఎత్తులకు సిద్ధమవుతూండటం మాత్రం ఆందోళన కలిగించేదే! నియంత పోకడలతో చాలా దేశాల దిగుమతులపై ఎడాపెడా సుంకాలు వేసేస్తూండటంతో ప్రపంచ వాణిజ్య రంగం అతలాకుతలమయ్యే స్థితికి చేరుకుంది. వ్యాపారం లేకపోతే ఉత్పత్తి మందగిస్తుంది.. దీనివల్ల ఉద్యోగాలు పోతాయి.. అది కాస్తా సమాజంలో అసంతృప్తికి దారితీస్తుంది. 

మొదటి శత్రువు చైనా.. 
ఎన్నికైన నాటి నుంచి చైనాకు ముకుతాడు వేస్తామనే ధోరణితోనే ట్రంప్‌ వ్యవహారాలు నడిచాయి. వాణి జ్య యుద్ధంలోనూ తొలి వేటు పడింది ఈ దేశంపైనే. ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో ట్రంప్‌ ముందుగా 3,400 కోట్ల డాలర్ల చైనా ఉత్పత్తులపై సుంకాలు వేసేశారు. ఇది చాలదన్నట్లు ఇంకో 20,000 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై 10% పన్ను అధికంగా విధించాలని నిర్ణయించారు. మూడో విడతగా ఇంకో 1,600 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై సుంకాలకు అమెరికా రంగం సిద్ధం చేస్తోంది. అమెరికా పన్నుల కారణంగా చైనాలో ఉత్పత్తి అవుతున్న ఫ్లాట్‌స్క్రీన్‌ టీవీలు, విమానాల విడిభాగాలు, వైద్య పరికరాల ధరలు పాతికశాతం పెరిగిపోయాయి. పండ్లు, కూరగాయలు, చేతిసంచులు, రిఫ్రిజిరేటర్లు, రెయిన్‌కోట్ల వంటి నిత్యావసర వస్తువులపై కూడా పన్నుపోటు పడింది.  

దీటుగా స్పందించిన చైనా 
ఈ పన్నుల దాడిపై చైనా కూడా దీటుగానే స్పందించింది. తొలిదఫా అమెరికా విధించిన స్థాయిలోనే 3,400 కోట్ల డాలర్ల ఉత్పత్తులపై పన్నులు పెంచేసింది. ఫలితంగా అమెరికా నుంచి చైనాకు చేరే సోయాబీన్, ఆటోమొబైల్స్, సముద్ర ఉత్పత్తుల ధరలు కొండెక్కాయి. చైనా ఇంకో అడుగు ముందుకేసి అమెరికా తీరేం బాగా లేదంటూ ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు కూడా చేసేసింది.  

ఇరుగు పొరుగులపై కూడా...  
పన్నుల కొరడా ఝళిపించే విషయంలో ట్రంప్‌ ఇరుగు పొరుగును కూడా వదల్లేదు. ఉత్తరాన ఉండే కెనడా, దక్షిణాన ఉండే మెక్సికోతోనూ కాలు దువ్వాడు. ఈ రెండు దేశాల నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పుత్తులపై సుంకాలు వి«ధించాడు. జపాన్‌పై కూడా ఇదే తీరుతో వ్యవహరించడంతో ఆ దేశం కూడా అమెరికాపై పన్నుల దాడికి సిద్ధమవుతోంది. అమెరికాలో తయారయ్యే కార్ల కంటే జపాన్‌ నుంచి దిగుమతి అయ్యే కార్ల సంఖ్య, వాటి విలువ చాలా ఎక్కువ అన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఫలితంగా అమెరికన్లు ఇకపై కొనే కార్ల ఖర్చు బోలెడంత ఎక్కువ కానుంది. దీంతో వారు జపాన్‌ కార్లపై ఆశలు వదిలేసుకోవాలి. లేదంటే.. రాజీపడి తమ దేశంలోనే తయారైన కార్లను కొనుక్కోవాల్సి వస్తుంది. 

‘యూరోపియన్‌’ దేశాలపై..
స్టీలు, అల్యూమినియం విషయంలో కెనెడా, మెక్సికో, జపాన్‌లపై పన్నులు విధించిన అమెరికా యూరోపియన్‌ యూనియన్‌ దేశాలకూ దీన్ని వర్తింపజేసింది. ప్రతిగా యూరోపియన్‌ యూనియన్‌.. అమెరికన్లు అతిగా ఇష్టపడే బ్లూజీన్స్‌తోపాటు మోటార్‌ బైకులు, మద్యం ఉత్పత్తులపై పన్నులు పడ్డాయి. నాణ్యమైన ఇంజనీరింగ్‌ ఉత్పత్తులకు, కార్లకు పెట్టింది పేరైన జర్మనీ యూరోపియన్‌ యూనియన్‌లో భాగమన్నది తెలిసిందే! 

మన పరిస్థితి ఏమిటి? 
ట్రంప్‌ పన్నుల యుద్ధం భారత్‌నూ వదల్లేదు. దాదాపు 29 వస్తువులపై పన్నులు విధిస్తూ గత నెలలో ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ప్రతిగా అంతేస్థాయిలో భారత్‌ కూడా పన్నుల కొరడా ఝళిపించింది. ఉక్కు, అల్యూమినియంలపై విధించిన సుంకాలకు ప్రతిగా భారత్‌ 23.5 కోట్ల డాలర్ల విలువైన 30 ఉత్పత్తులపై పన్నులు వేసింది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. కాలిఫోర్నియా నుంచి దిగుమతయ్యే బాదంపప్పు మొదలుకొని వాషింగ్టన్‌ ఆపిల్స్, కొన్ని ఇతర వస్తువులపై సుంకం విధించిన కారణంగా ఇకపై వాటి ధరలు మరింత ఎక్కువ కానున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యమే కాకుండా బ్యాంకులు, వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణంపైనా ఆ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 ఇక కొన్ని ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ ఏడాది మార్చిలో అమెరికా, దక్షిణ కొరియాల మధ్య వాణిజ్య సంబంధాలను సులభతరం చేసుకునేందుకు ఒక ఒప్పందం కుదిరింది. అమెరికన్‌ కార్లకు దక్షిణ కొరియాలో భారీ మార్కెట్‌ కల్పించేందుకే ఈ ఒప్పందం. అయితే ట్రంప్‌ తీరు కారణంగా ఇప్పుడు ఈ ఒప్పందం ప్రశ్నార్థకమవుతోంది. ఉత్తర కొరియాను మంచి చేసుకునే క్రమంలో చాలాకాలంగా వ్యాపారం చేస్తున్న దక్షిణ కొరియాతో ట్రంప్‌ పన్నుల తగువుకు సిద్ధమవుతున్నాడు.  

ఫలితాలేమిటి..? 
ట్రంప్‌ మొదలుపెట్టిన పన్నుల యుద్ధం ప్రపంచానికి మంచిది కాదని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌ మార్క్‌ కార్నే ఈ యుద్ధం అమెరికాకే చేటు చేస్తుందని, ఆర్థిక వ్యవస్థ 5 శాతం వరకూ నష్టపోవచ్చని హెచ్చరించారు. మూడేళ్లలో జీడీపీ వృద్ధి కూడా 2.5 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. అమెరికా తాను వ్యాపారం చేసే అన్ని దేశాలపై కనీసం పది శాతం పన్నులు వేసినా మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థూల ఉత్పత్తి ఒకశాతం వర కూ తగ్గుతుందని అంచనా. యూరోపియన్‌ యూని యన్, యూకేల నష్టం కూడా ఇదే స్థాయిలో ఉండవచ్చని అంచనా. ట్రంప్‌ పన్నులు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తే.. యూరప్‌లో తయారైన ఒక కారు ధర అమెరికాలో సగటున రూ.8 లక్షల వరకూ ఎక్కువవుతుంది. పన్నుల కారణంగా వాహనాల అమ్మకాలు తగ్గిపోతే అమెరికాలోని కార్ల ఫ్యాక్టరీల్లో తగ్గి పోయే ఉద్యోగాలు 2 లక్షలుంటాయి. ఇతర దేశాలు అమెరికా ఉత్పత్తులపై పన్నులు పెంచేస్తే ఈ సంఖ్య 6.25 లక్షలు అవుతుందని పీటర్‌సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్స్‌ చెబుతోంది.

టెక్‌ కంపెనీలపై దుష్ప్రభావం
చైనా నుంచి దిగుమతయ్యే నెట్‌వర్క్‌ పరికరాలపై భారీగా సుంకాలు విధించాలని ట్రంప్‌ ఆలోచిస్తున్నారు. ఇదే జరిగితే సిలికాన్‌ వ్యాలీ టెక్‌ కంపెనీలపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంది. వచ్చే నెలాఖరు నుంచి మోడెమ్స్, రౌటర్స్‌ వంటి 20 వేల కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై 10 శాతం సుంకం అమలు కానున్న నేపథ్యంలో ఈ తాజా నిర్ణయంపై ఐటీ దిగ్గజాలు గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్‌లు విశ్లేషిస్తున్నాయి. ఇక కంప్యూటర్‌ చిప్స్‌ తయారు చేసే ఇంటెల్‌ వంటి సంస్థలపైనా సుంకాల ప్రభావం పడబోతోంది. 300 కోట్ల డాలర్ల విలువైన సెమీ కండక్టర్లపై 25 శాతం సుంకాలు విధించడం చిప్‌ల తయారీ కంపెనీలైన ఇంటెల్, క్వాల్కామ్‌ (క్యూసీవోఎం)ల గుండెల్లో గుబులు పెంచుతోంది. కొన్ని అమెరికా కంపెనీలు తాము తయారు చేసిన కంప్యూటర్‌ చిప్స్‌ను  అసెంబుల్, టెస్టింగ్, ప్యాకేజింగ్‌ కోసం చైనాకి పంపిస్తూ ఉంటాయి. తిరిగి అవి చైనా నుంచి అమెరికాకి వచ్చినప్పుడు భారీగా సుంకాలు చెల్లించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడబోతోంది. ఇప్పటికే వలస విధానాలు, పర్యావరణ సమస్యలతో సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్న సిలికాన్‌ వ్యాలీ ఈ వాణిజ్య యుద్ధంతో మరింత కుదేలైపోతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

అమెరికన్లకూ దెబ్బే..!  
ట్రంప్‌ వాణిజ్య యుద్ధం ప్రభావం అమెరికన్లకూ తప్పదు. చైనా నుంచి చేసుకునే 20 వేల కోట్ల డాలర్ల దిగుమతులపై వేయనున్న పదిశాతం సుంకం వంటింటి దినుసులు మొదలుకొని చిన్నాచితకా యంత్రాలు, సైకిళ్లు ఇతర గాడ్జెట్ల ధరలను పెంచేయనున్నాయి. కత్తులు, ఫోర్కులు, ‘తిలాపియా’ చేపలు, ఆపిల్‌ జ్యూస్, వైన్‌ ధరలు పదిశాతం పెరగనుండగా, రిఫ్రిజిరేటర్లు, ఫ్రీజర్లు, ఇతర గాడ్జెట్లూ ఖరీదు కానున్నాయి! వెల్లుల్లి మొదలుకుని వెదురు ఉత్పత్తులు, పుట్టగొడుగుల ధరలకూ రెక్కలు వస్తాయి. వాహనాల విడిభాగాలు స్పార్క్‌ ప్లగ్‌లు, పిస్టన్‌ ఇంజన్లు, వాహనాల మిర్రర్లు, సైకిళ్లు, గోల్ఫ్‌ బ్యాటింగ్‌ గ్లవ్స్‌ తదితర వస్తువులపై పన్ను పెరుగుతుంది. బాత్‌రూంలో తలస్నానం చేశాక తుడుచుకునే ఫ్లఫీ టవల్స్, తదితరాల ధరలు, హెయిర్‌ క్లిప్పర్స్, ఎలక్ట్రిక్‌ షేవర్స్, షేవింగ్‌ బ్రష్షులు, చైనాలో తయారైన లిప్‌స్టిక్, మేకప్‌ సామగ్రి కూడా పెరిగే జాబితాలోనే ఉన్నాయి. క్రిస్మస్‌ సందర్భంగా ఇళ్లలో ఏర్పాటు చేసే క్రిస్మస్‌ చెట్లతో పాటు ఇళ్లలో అలంకారానికి ఉపయోగించే లైటింగ్‌ సెట్లపైనా పన్నులు పెరుగుతాయి. చివరకు రోజంతా ఒళ్లు హూనమయ్యేలా పనిచేశాక సుఖంగా పడుకునేందుకు ఉపయోగించే చైనా మేడ్‌ పరుపుల ధరలూ వేడెక్కనున్నాయి.

చమురు ధరలు పెరుగుతాయా? 
ట్రేడ్‌ వార్‌తో చమురు ధరలు బ్యారెల్‌కు 250 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదని వాణిజ్య నిపుణుడు ఆర్టెమ్‌ అవినోవ్‌ అంచనా వేస్తున్నారు. అయితే చాలా వరకు ఇది సత్యదూరమని ఇతర నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు సరఫరాదారుల్లో ముఖ్యమైన ఇరాన్‌పై ఇప్పటికే అనేక ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ దేశం ప్రతీకార చర్యలకు దిగితే చమురు ధరలు కొండెక్కడం ఖాయమన్నది ఇందుకు కారణం. తమను ఒంటరిని చేసి  ఆంక్షలు పెట్టడమే కాకుండా ఇతర దేశాల నుంచి అందుతున్న మద్దతునూ అడ్డుకుంటున్న అమెరికాపై ఇరాన్‌కు పీకల్దాకా కోపం ఉందన్నది సుస్పష్టం. దీంతో దేశం గుండా ఇతర దేశాలకు తరలిపోతున్న చమురు పైపులపై దాడి చేయవచ్చు లేదా అనేక చమురు దేశాల సరఫరాకు మార్గమైన హర్ముజ్‌ జలసంధి గుండా రవాణా వ్యవస్థకు ఆటంకాలు ఏర్పరచవచ్చు. 

అలాంటిది జరిగితే 80 –90 డాలర్ల మధ్య ఊగిసలాడుతున్న చమురు ధర ఎకాఎకి కొంతకాలం పాటు 160 డాలర్ల స్థాయికి చేరుకుంటుంది. అయితే ఇప్పటికే ఒపెక్‌ దేశాలు చమురు ఉత్పత్తిని బాగా పెంచిన నేపథ్యంలో ఇరాన్‌ కలిగించే నష్టాన్ని భర్తీ చేసేందుకు అవి ముందుకు రావచ్చు. భారత్‌ చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇరాన్‌ కూడా ఒకటి. అయితే ఈ దేశం నుంచి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా హుకుం విధించడం అందుకు తగ్గట్టుగానే భారత్‌ దిగుమతులను కొంతవరకూ తగ్గించుకోవడం మనకు తెలిసిన విషయమే. 

Read latest World News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top