ఒడిదుడుకుల్లో లేసు పరిశ్రమ

handi craft business loss in west godavari district - Sakshi

ఓ వైపు చైనా నుంచి పోటీ..

మరోవైపు ప్రభుత్వ సాయం కరువు

శ్రమదోపిడీలో అల్లికల మహిళలు

నరసాపురం: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేతికళల్లో లేసు అల్లికలు ప్రాముఖ్యమైనవి. లేసు అల్లికలు ఎగుమతుల్లో నరసాపురం ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. 200 ఏళ్ల క్రితం బ్రిటిష్‌ హయాంలో ఈ ప్రాంతం వారికి పరిచయమైన లేసు అల్లికలు తరువాత కాలంలో ఇక్కడ ఓ పరిశ్రమగా రూపుదిద్దుకుంది. ఇప్పుడంటే లేసు అల్లికలు ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల నుంచి సాగుతున్నాయి కానీ, గడిచిన ఐదు దశాబ్దాలుగా అమెరికాతో సహా పలు యూరప్‌ దేశాల్లో లేసు అల్లికలు అంటే నరసాపురం ప్రాంతానివే.

నరసాపురం కేంద్రంగా ఉభయగోదావరి జిల్లాల నుంచి లేసు ఉత్పత్తుల విదేశీ ఎగుమతులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇక్కడి మహిళలు గమ్మత్తుగా గాలిలో చేతులు తిప్పుతూ రూపొందించే అల్లికలకు ఇప్పటికీ విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అయితే ఇటీవల ఈ పరిశ్రమ ఒడిదుడుకుల్లో సాగుతోంది. చైనా నుంచి వస్తున్న అధిక పోటీ, ఇక దేశీయంగా ప్రభుత్వాలు తోడ్పాటు ఇవ్వకపోవడంతో లేసు ఎగుమతిదార్లు నష్టాలు చవిచూస్తున్నారు. ఏటా సుమారు రూ.200 కోట్ల వరకూ విదేశీ మారకద్రవ్యాన్ని దేశానికి తెప్పిస్తున్న ఈ పరిశ్రమలో కీలకమైన అల్లికలలో మహిళలు శ్రమదోపిడీకి గురవుతూనే ఉన్నారు. కళ్లు పొడుచుకుని రాత్రి, పగలూ తేడాలేకుండా శ్రమించినా వారికి పనికి, కష్టానికి తగ్గ సొమ్ము దక్కడంలేదు. ప్రపంచ వినువీధిని కనువిందు చేస్తున్న లేసు పరిశ్రమలోని ప్రస్తుత స్థితిపై పరిచయమే ఈ కథనం.

బ్రిటీష్‌ హయాంలో పరిచయం
లేసు అల్లికల కళ విదేశాల నుంచి మన దేశానికి వచ్చింది. కానీ ప్రస్తుతం మనదేశం నుంచి విదేశాలకు లేసు అల్లికలు ఎగుమతి అవుతుండటం విశేషం. బ్రిటీష్‌ హయంలో జల రవాణా బాగా జరిగే కాలంలో నరసాపురం వ్యాపారకేంద్రంగా ఉండేది. ఇదే సందర్భంలో మత ప్రచారం, సహాయ కార్యక్రమాల  నిమిత్తం కొన్ని మిషనరీలు ఇక్కడకు చేరుకున్నాయి. సుమారు 200 సంవత్సరాల క్రితం స్వీడన్‌ మిషనరీ సంస్థలు ఇక్కడకు వచ్చి, స్థానిక మహిళలతో పరిచయాలు పెంచుకోవడంలో భాగంగా లేసు అల్లికలను పరిచయం చేశారు. తరువాత కాలంలో పెద్ద పరిశ్రమగా మారింది. పురుషులు చాలీచాలని జీతాలతో కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో, ఇంటి నుంచి బయటకు వచ్చే సాహసం చేయని మహిళలు ఈ లేసు అల్లికపై దృష్టి సారిస్తారు. భర్తకు ఆర్థికంగా తోడుగా నిలవాలనే మహిళల త్యాగపూరిత ఆలోచన కారణంగా అబ్బుర పరిచే డిజైన్‌లలో లేసు అల్లికలు సాక్షాత్కారమవుతూ వచ్చాయి.

ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని అగ్రవర్ణ కుటుంబాల్లోని పేద, మధ్య తరగతి మహిళలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పని, ఉద్యోగం అంటూ బయటకు రారు. ఇలాంటి మహిళలు అందరూ లేసు అల్లికల్లో ఉంటారు. నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, రావులపాలెం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో 250 గ్రామాల్లో 95 వేల మంది మహిళలు లేసు అల్లికలు సాగిస్తున్నట్టు అంచనా. ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 10 వేల కుటంబాలవారు ప్రత్యక్షంగా లేసు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక అంతర్జాతీయ లేసు ఎగుమతిదార్లు నరసాపురం ప్రాంతంలో 50 మంది వరకూ ఉన్నారు. యూపీలో మరో 25 మంది ఉంటారని సమాచారం. ఇక దేశంలో లేసు ఎగుమతులు ఎక్కడి నుంచీ జరగకపోవడం విశేషం.

అబ్బుర పరిచే డిజైన్లు.. అంతర్జాతీయంగా డిమాండ్‌
విదేశీ సంపన్న కుటుంబాలవారి ఇళ్లలో దిండ్లపైనా, సోఫాసెట్, డైనింగ్‌ టేబుల్స్, డోర్‌కర్టెన్స్‌ పైనా ఈ ప్రాంతం నుంచి ఎగుమతి అయ్యే లేసు అల్లికలు దర్శనమిస్తాయి. ఇక విదేశీయులు ధరించే దుస్తులుగా కూడా లేసు అల్లికలకు ప్రాధాన్యం ఉంది. యూరప్‌ దేశాల్లో లేసు గార్మెంట్స్‌ అంటే ఓ క్రేజ్‌. దీంతో అనేక అబ్బుర పరిచే డిజైన్స్‌లో వీటిని తయారు చేస్తారు. అమెరికా, బ్రిటన్, హాలెండ్, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్వీడన్, జర్మనీ తదితర దేశాలకు లేసు అల్లికలు ఎగుమతి అవుతాయి. అక్కడ వీటికి మంచి డిమాండ్‌. కేంద్ర హస్తకళలు, జౌళిశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జనవరి, ఏప్రిల్‌ నెలల్లో దేశ రాజధాని ఢిల్లీలో ఎగ్జిబిషన్‌లు ఏర్పాటు చేస్తారు. నరసాపురం నుంచి, ఇటు యూపీ నుంచి అంతర్జాతీయ లేసు ఎగుమతిదార్లు స్టాల్స్‌ ఏర్పాటు చేస్తారు. ఈ ఎగ్జిబిషన్‌కు వచ్చిన వివిధ దేశాల వ్యాపారులు ఆర్డర్స్‌ ఇస్తారు. వారిచ్చిన ఆర్డర్‌ మేరకు ఎగుమతిదార్లు ఇక్కడ మహిళలచేత వాటిని తయారు చేయిస్తారు. విదేశాల్లో జరిగే ఎగ్జిబిషన్‌లకు ఇక్కడి ఎగుమతిదార్లు వెళ్లి స్టాల్స్‌లో ప్రదర్శనలు ఇస్తారు. ఇక్కడ సరుకు తయారు చేయడంలో మధ్యస్థంగా రెండు, మూడు వ్యవస్థలు ఉంటాయి. కమీషన్‌కు ఈ డిజైన్‌కు ఇంత అని వేరే వారికి పని అప్పగిస్తారు. మళ్లీ వారు లేసు అల్లే మహిళల ఇళ్ల వద్దకు వెళ్లి దారాలు అవీ ఇచ్చి, ఏ డిజైన్‌లో అల్లిక కావాలో చెప్పి కుట్టించుకుంటారు.

చైనా దెబ్బతో విలవిల
దేశం నుంచి ఎగుమతి అవుతున్న లేస్‌ ఉత్పత్తులకు గత దశాబ్దకాలంగా చైనా నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. దీంతో లేసు పరిశ్రమ ఓ మేరకు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చైనాలో లేసు అల్లికలకు సంబంధించిన ముడిసరుకు చాలా తక్కువ ధరకు లభిస్తుంది. అక్కడి ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ముఖ్యంగా చైనాలో యంత్రాలపై లెక్కకు మించిన డిజైన్‌లలో, నాణ్యతతో కూడిన సరుకు లభ్యమవుతుంది. దీంతో మన ఎగుమతులకు పోటీ ఎక్కువైంది. మనవద్ద కూడా యంత్రాల ద్వారా తయారీ ఉన్నప్పటికీ చైనాతో పోటీపడే స్థాయిలో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చైనా అందించినంత తక్కువ ధరకు మన ఎగుమతిదార్లు సరుకును ఇవ్వలేకపోతున్నారు. తాజాగా లేసు ఎగుమతులపై  జీఎస్‌టీ కూడా 5 శాతం విధించారు. దీంతో వ్యాపారం ఇబ్బందికరంగా మారిందనేది లేసు ఎగుమతిదార్ల ఆవేదన. పైగా మన ప్రభుత్వం నుంచి ఎగుమతులకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహం లేదు. పదేళ్ల క్రితమే ఏటా రూ.100 కోట్ల మేర లేసు ఉత్పత్తులు ఎగుమతులు సాగేవి. ప్రస్తుతం కూడా రూ.150 నుంచి రూ. 200 కోట్ల మేర వ్యాపారం సాగుతోంది.

శ్రమదోపిడీకి గురవుతున్న మహిళలు
కళా నైపుణ్యంతో విశ్వఖ్యాతిని ఆర్జించిన లేసు పరిశ్రమలో కష్టం మొత్తం మహిళలదే. వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. లేసు పరిశ్రమ బాగున్న ఆ రోజుల్లోనూ, కాస్త ఒడిదుడుకుల్లో ఉన్న ఈ రోజుల్లో కూడా ఆరుగాలం శ్రమించే మహిళలకు కష్టానికి తగ్గ ఫలితం దక్కడంలేదు. కుట్టు కుట్టే మహిళలు పొద్దు పొడవక ముందే లేచి ఇంటి పనులు ముగించుకుని, పిల్లలను స్కూళ్లకు, భర్తను బయటకు పంపంచి, వంట పూర్తిచేసి అల్లికల పనిలో పడతారు. టీవీ చూస్తున్నా కూడా చేతిలో సూది కదులుతూనే ఉంటుంది.

Read latest West Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top