దర్యాప్తు తీరుపై హైకోర్టు అసంతృప్తి
కొందరిపై వేటు పడితేగానీ మిగతావారు దారికి వచ్చేలా లేరని వ్యాఖ్య
అమికస్ క్యూరీగా ఫెర్నాండెజ్ నియామకం
సాక్షి, హైదరాబాద్: సిగాచీ పేలుడు ఘటనకు ఒకరోజులో జరిగిన లోపం కారణం కాదని.. కొంత కాలంగా అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యమే ప్రధాన కారణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కార్మిక, పరిశ్రమలు, పర్యావరణ శాఖలు ఎవరి పని వారు చేయలేదని అభిప్రాయపడింది. సరైన సమయంలో తనిఖీలు నిర్వహించి ఉంటే 54 మంది ప్రాణాలు పోయేవి కాదంది.
పరిమితికి మించి పేలుడు పదార్థాలున్నా పట్టించుకోలేదని, 90 మంది పనిచేయాల్సిన చోట సగం మందే విధులు నిర్వహిస్తున్నారని పేర్కొంది. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేస్తేగానీ మిగతా వారు దారిలోకి వచ్చేలా లేరని ఘాటు వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు అధికారి చెప్పిన వివరాలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు వారాలు సమయం ఇస్తున్నామని, పూర్తి వివరా లతో సమాధానం చెప్పేందుకు సిద్ధమై రావాలని ఆదేశించింది.
తదుపరి విచారణ డిసెంబర్ 30కి వాయిదా వేసింది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామి కవాడలోని సిగాచీ పరిశ్రమలో జూన్ 30న సంభవించిన పేలుడు ఘటనలో 54 మంది మృతి చెందగా, 8 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబురావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియు ద్దీన్ ధర్మాసనం మంగళవారం విచారించింది.
సంక్షిప్త నివేదికలు సమర్పించాం..
దర్యాప్తు అధికారులు హాజరుకావాలని గత విచారణ సందర్భంగా ఆదేశించడంతో.. డీఎస్పీ ప్రభాకర్, ఇన్‌స్పెక్టర్ విజయ్‌కృష్ణ, పరిశ్రమల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ గౌరీ శంకర్ కోర్టుకు వచ్చారు. ప్రభుత్వం తరఫున ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. దర్యాప్తు అధికారులు రికార్డులతో పాటు సంక్షిప్త నివేదికను సమర్పించినట్లు చెప్పారు.
ఈ క్రమంలో ధర్మాసనం జోక్యం చేసుకుని అధికారుల తనిఖీలపై డీఎస్పీని ప్రశ్నించింది. గత డిసెంబర్‌లో పరిశ్రమల శాఖ ఇన్‌స్పెక్టర్ తనిఖీలు నిర్వహించినట్లు బదులిచ్చారు. మరి ఇతర శాఖలు ఏం చేస్తున్నాయని ధర్మాసనం అడిగింది. ప్రమాదకర రెడ్ జోన్‌లోని పరిశ్రమల్లో పదుల సంఖ్యలో శాఖలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాల్సి ఉన్నా, అది జరగలేదని తెలు స్తోందని చెప్పింది.
పరిశ్రమ యాజమాన్యంపై చార్జిషీట్ దాఖలు చేస్తారు.. మరి అధికారుల మాటేమిటని ప్రశ్నించింది. ఈ కేసు విచారణలో సహకరించడానికి అమికస్ క్యూరీగా డొమినిక్ ఫెర్నాండెజ్‌ను ధర్మాసనం నియమించింది. ఘట నకు సంబంధించిన వివరాలు, పత్రాలను ఆయ నకు సమర్పించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.


