ఫిన్లాండ్‌ చెబుతున్న పాఠం

ఫిన్లాండ్‌ చెబుతున్న పాఠం - Sakshi


విశ్లేషణ

ఈనాడు అన్ని వృత్తులకన్నా ఉపాధ్యాయ వృత్తి పట్ల ప్రజలు ఎక్కువ ఆకర్షితులు కావడం అక్కడ కనిపిస్తున్నది. ఫిన్లాండ్‌లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం తమ దేశభక్తికి నిదర్శనమనుకుంటారు.



నేను ప్రతిరోజు ఏదో ఒక స్కూలును సందర్శిస్తూ ఉంటాను. మీరు మాట్లాడే విషయాలు సమంజసంగానే ఉన్నాయి, కానీ పాఠశాలల్లో మీరనుకునే పరిస్థితి లేదు. అధికారులు స్కూలుకు రాగానే రిజల్టు ఎంత? స్కూలుకు ఎన్ని ఎ+ ర్యాంకులు వచ్చాయి? 100% రిజల్టు ఉందా?’ అని అడుగుతున్నారని అక్కడివారు చెబుతూ ఉంటారు. తల్లిదండ్రులు కనపడగానే ‘మా పిల్లలకు మంచి కాలేజీలో సీటురావాలి సార్‌. నేను డొనేషన్‌ కట్టలేను. ఏ కాలేజీకి వెళ్లినా డొనేషన్‌ అడుగుతారు. ఎ+ లేనిది ఫ్రీసీటు రాదు.



ఎట్లనన్నా చేసి మా పిల్లలకు ఎ+ వచ్చేటట్లు చూడ’మని అడుగుతున్నారు. ఎ+ ర్యాంక్‌ పైన అధికారుల వైపునుంచి ఒక రకమైన దృష్టి ఉంటే, తల్లిదండ్రుల వైపునుంచి మరొరకమైన ఆశ కనిపిస్తుంటుంది. ‘మీరేమో కనిపిస్తే ప్రవచనాలు చెబుతారు. పిల్ల లకు విషయ పరిజ్ఞానం కావాలంటారు? ఆలోచనలు రేకెత్తించాలంటారు? సృజనాత్మకమైన ఆలోచనలు ఉండాలని రాస్తారు. కానీ ఆచరణలో మీలాంటి వాళ్లకూ మార్కులు, ర్యాంకులు ప్రధానమనే వారికీ మధ్య మేం నలిగిపోతున్నా’మని ఉపాధ్యాయులంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్పండని ఉపాధ్యాయులు నన్ను ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులు చెప్పేది నిజమే. మనదేశంలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా మార్కెట్, కార్పొరేట్‌ శక్తులు విద్యారంగాల్ని ఈ దశకు తీసుకువచ్చాయి.



ఒకటి వాస్తవం– 21వ శతాబ్దంలో అద్భుత ప్రయోగాలు జరిగాయి. చిన్న చిన్న దేశాలు ఏర్పడ్డాయి. మలేసియా నుంచి సింగపూర్‌ విడిపోయింది. వనరులన్నీ మలేషియాలో ఉండేవి కానీ, ఈనాడు ప్రపంచంలో అమెరికాతో సమానంగా సింగపూర్‌ జీడీపీ ఉంది. అదే మాదిరిగా ఉత్తర కొరియాలో వనరులన్నీ ఉన్నాయి. కానీ కొరియా విడిపోయాక దక్షిణ కొరియా అభివృద్ధి చెందింది. స్వీడన్‌ ఒకనాడు ప్రపంచానికి గడియారాలిచ్చింది. కానీ, ఫిన్లాండ్‌ ప్రపంచంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నది. వనరులు లేవని నిరుత్సాహపడలేదు. స్వీడన్‌తో ఫిన్లాండ్‌ పోటీ పడలేదు. ఇది పోటీల కాలం కాదని, ఇది సహకార యుగమని ఫిన్లాండ్‌ విద్యా శాఖ మంత్రి స్వీడన్‌కు వెళ్లి అక్కడి విద్యారంగాన్ని పరిశీలించారు. అందరికీ విద్య, విద్యావకాశాలను సమకూర్చటమే స్వీడన్‌ అభివృద్ధి రహస్యమని కనుక్కున్నారు. కానీ, విద్యా ప్రమాణాలు పెరగటానికి అధిక గంటలు పనిచేసేవారు. పిల్లలకు ఎక్కువగా పరీక్షలు నిర్వహించేవారు. హోంవర్క్‌లు ఎక్కువగా ఇచ్చేవారు.



కానీ, ఫిన్లాండ్‌ దేశం మాత్రం స్వీడన్‌లోని మంచి సంస్కరణలు తీసుకున్నది. పిల్లలపై భారం మాత్రం వేయలేదు. కొత్త ప్రక్రియను అవలంబించారు. వయోజన విద్యపైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరించారు. పెద్దలు చదివితే చిన్నపిల్లలపై ఆ ప్రభావం పడి రెట్టింపు శ్రద్ధతో చదువుతారని వయోజన విద్యను పటిష్టంగా అమలు జరిపారు. దాని వలన ఉన్నత ప్రమాణాలు గల టీచర్లు దొరికారు. ఈనాడు అన్ని వృత్తులకన్నా ఉపాధ్యాయ వృత్తి పట్ల ప్రజలు ఎక్కువ ఆకర్షితులు కావడం అక్కడ కనిపిస్తున్నది. ఫిన్లాండ్‌లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడం తమ దేశభక్తికి నిదర్శనమనుకుంటారు. జీతాలు పెంచటం వల్ల వారు ఉపాధ్యాయ వృత్తిలోకి రాలేదు. ముందుతరం అభివృద్ధి కావాలంటే పౌరుని మొదటి ప్రాధాన్యం ఉపాధ్యా వృత్తి కావాలని అనుకున్నారు. నేను ఫిన్లాండ్‌ వెళ్లినప్పుడు అక్కడి వారు ఎందుకు ఉపాధ్యాయ వృత్తి స్వీకరించారో అడిగి తెలుసుకున్నాను.



‘‘దేశాభివృద్ధిలో వచ్చేతరం విద్యార్ధులదే కీలకపాత్ర. కాబట్టి విద్యారంగం చేసే పని భవిష్యత్తు నిర్మాణానికి మెట్టు అవుతుంది’’అన్నారు. కేజీ స్కూల్‌లో మహిళా టీచర్లు ఉన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ చదివినవారు టీచర్లుగా పనిచేస్తున్నారు. విద్యా ప్రమాణాలు పెరగటానికి అక్కడ ఎంతో కృషి జరి గింది. వయోజనుల ఆదర్శాలు పిల్లల విద్యాప్రమాణాలు పెరగటానికి తోడ్పడినాయి. ఈ విధంగా ఈ చర్యలు అందరికీ ఉన్నత ప్రమాణాలు గల చదువును ఇవ్వగలిగాయి. పెద్దలు చూపిస్తున్న శ్రద్ధ చిన్న పిల్లలకు స్ఫూర్తిని ఇస్తుంది.



కొన్ని సంవత్సరాలకే ఉన్నతమైన ప్రమాణాలు తీసుకువచ్చి ఫిన్లాండ్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. 10 సంవత్సరాల ఎస్‌ఎస్‌సి కోర్సును 9 సంవత్సరాలలో పూర్తి చేశారు. కానీ ప్రమాణాలలో మాత్రం రాజీలేదు. దీనివల్ల వారు ఇతర దేశాలకు ఆదర్శమయ్యారు. ఈనాడు ఫిన్లాండ్‌ ప్రపంచానికే ఆదర్శమైంది. దక్షిణæకొరియా, సింగపూర్‌ దేశాలు ఫిన్లాండ్‌ పద్ధతులను అవలంబించి విద్యారంగంలో ఉన్నతమైన ప్రమాణాలు సాధించుకున్నాయి. అక్కడ ఉపాధ్యాయులు, స్కూళ్ల మధ్య పోటీలేదు. ఒక స్కూలు ఇంకో స్కూలుకు సహకరిస్తుంది. తక్కువ ప్రమాణం గల స్కూళ్లను ప్రమాణాలను సాధించిన ఇతర స్కూళ్లతో సమంగా చేయడమనేది అక్కడ బాధ్యతగా భావిస్తారు.



ఈనాడు ప్రపంచపటంలో ఫిన్లాండ్‌ స్థానం ఎంతో ఉన్నతమైనది. విద్యాప్రమాణాలు పెంచేవి ప్రజల సంకల్పం, ఉపాధ్యాయుల దీక్ష. ఈ ఆశయాలతో మనం చిన్న రాష్ట్రాలను ఏర్పరచుకున్నాం. మనం పాఠశాలల మధ్యన పోటీ కన్నా సహకారంతో విద్యా ప్రమాణాలు పెంచే అవకాశం ఉన్నదని చాలా దేశాల విద్యాయాత్రలు చెబుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా విద్యారంగ ప్రముఖులు, రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల ఫిన్లాండ్‌లో పర్యటించి వచ్చింది. ఈనాడు విద్యను ఆర్థికరంగానికి శక్తిని ప్రసాదించే స్థాయికి తీసుకురావాల్సి ఉంది. విద్యా ప్రమాణాలు పెంచేది ప్రజలు, ఉపాధ్యాయుల ఉమ్మడి బాధ్యత. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్కూళ్లు ఊపిరులు ఇస్తాయి.



వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త శాసనమండలి మాజీ సభ్యులు

చుక్కా రామయ్య

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top