భారతీయులెవ్వర్నీ బతకనివ్వడా!

భారతీయులెవ్వర్నీ బతకనివ్వడా!


రాత్రంతా ‘లీ మస్క్‌’ మీద ఉన్నాను. ఒక సినిమాకు మ్యూజిక్‌ ఇవ్వడం కాదది. సొంతంగా ఒక సినిమాను డైరెక్ట్‌ చెయ్యడం!



‘ఎందుకు రెహమాన్‌.. పాతికేళ్లుగా ఒక్కో ఇటుకా పేర్చి కట్టుకున్న నీ కెరీర్‌ను ధ్వంసం చేసుకోడానికి నిద్రమానుకుని మరీ కొత్త ట్యూన్‌లు కనిపెడుతున్నావ్‌?’ అని వికీలో ఎవరో కామెంట్‌ పెట్టారు.



కొన్ని చెయ్యకుండా ఉండలేం. కొత్త ప్రదేశాలను చూడాలన్న ఉత్సాహం లాంటిదే, కొత్త ఫీల్డులోకి కత్తులూ కటార్లతో వెళ్లిపోవడం.



రాత్రే .. కొంచెంసేపు ‘లీ మస్క్‌’ను వదిలి ‘99 సాంగ్స్‌’ చూసుకున్నాను. రొమాంటిక్‌ మ్యూజికల్‌ ఫిల్మ్‌ ‘99 సాంగ్స్‌’. ఓ కుర్రాడు నైటంతా.. డే డ్యూటీ చేసి, డే అంతా.. నైట్‌ డ్యూటీ చేసి, రోజుకు ఇరవై నాలుగ్గంటలే అని ఎవరైనా అంటే పక్కున నవ్వేసి, మెరీనా ఒడ్డుకు వెళ్లి మ్యూజిక్‌ సముద్రంలో దూకేస్తుంటాడు. ఈత కొట్టి అలిసిపోయాక ఇసుకలోంచి కాళ్లీడ్చుకుంటూ బయటికి వచ్చి, పంచభూతాల్లోని ఇంకో సముద్రంలో కొట్టుకుపోతుంటాడు. ఆ ఇంకో సముద్రం.. గాలి సముద్రమా? గగన సముద్రమా, అగ్ని సముద్రమా అన్నది వాడికి అనవసరం. అందులో బీట్‌ ఉంటే చాలు, మెలడీ ఉంటే చాలు.. మునకేస్తాడు! వీడేంట్రా మ్యూజిక్‌ రూల్సన్నీ మార్చేశాడు.. మనిషి పడుకుని లేచే టైమింగ్స్‌ కూడా మార్చేశాడు.. భారత కాలమానం ప్రకారం భారతీయులెవ్వర్నీ వీడు బతకనివ్వడా.. అని లోకం నివ్వెరపోయేంతగా పెద్ద కంపోజర్‌ అవుతాడు. ఇదీ లైన్‌.



‘రెహమాన్‌దే ఈ స్టోరీ. బయోపిక్‌’ అని వికీలో అప్‌డేట్‌! నిజానికి అది నా స్టోరీ కాదు. నేను రాసిచ్చిన స్టోరీ.



మరి ఆ సినిమా సౌండ్‌ ట్రాక్‌ మీదే కదా? అవును. ఫిల్మ్‌ స్కోర్‌ మీదే కదా? అవును.



ఇలా.. ఇంకా నా నుంచి కొన్ని ‘అవున్లు’ కలుపుకుని, ‘కాదు’ అని నేను అన్నవాటిని కూడా అవున్లుగా మార్చేస్తోంది మీడియా!



‘నేను చెయ్యని సినిమాల్ని కూడా చేస్తున్నట్లుగా వెబ్‌సైట్‌లు ఇచ్చిన పెద్ద లిస్ట్‌ చూసి హాలీవుడ్‌ డైరెక్టర్లు వెనక్కి పోతున్నారు’ .. అని ఓ ఇంటర్వూ్యలో సెటైరికల్‌గా అంటే.. వెంటనే.. ఆ వెనక్కి పోతున్న డైరెక్టర్‌ల లిస్టు కూడా తయారైపోయింది. స్ట్రేంజ్‌!



మామ్, వైశ్రాయ్‌ హౌస్, శంకర్‌ 2.0. కొద్దికొద్దిగా అవుతున్నాయి.



‘ఒకేసారి అన్నీ మీద వేసుకోకు’ అంటోంది అమ్మ. ‘రోజా’ సినిమా అప్పట్నుంచి అమ్మ నాకు ఈ మాట చెబుతోంది.

నా ఆరోగ్యం మీద ఆమెకు బెంగ.



‘నాకేం కాదమ్మా.. డాక్టర్‌లు వచ్చేలోపు కీ బోర్డ్‌ నన్ను బతికించేస్తుంది’ అంటాను.



బ్లడ్‌కి బదులు ఒంట్లో సంగీతం ప్రవహిస్తున్నప్పుడు ఒత్తిడి కూడా ఆరోగ్యమే అవుతుంది.. కష్టపడి ట్యూన్‌లు కట్టేవాళ్లకీ, తేలిగ్గా సంగీతానికి ట్యూన్‌ అయ్యేవాళ్లకీ!



- మాధవ్‌ శింగరాజు

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top