పెసరకు డిమాండ్ ధర పలుకుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మద్ధతు ధర కన్నా...
తాండూరు: పెసరకు డిమాండ్ ధర పలుకుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మద్ధతు ధర కన్నా అధికంగా ధర లభిస్తోంది. పెసర్ల సీజన్ ఆరంభం కావడంతో తాండూరు వ్యవసాయ మార్కెట్‌యార్డులో క్రయవిక్రయాలు మొదలయ్యాయి. గత మూడు రోజులుగా వివిధ గ్రామాల నుంచి రైతులు పెసర్లను యార్డుకు తరలించి విక్రయిస్తున్నారు.
క్వింటాలు పెసర్లకు ప్రభుత్వ మద్ధతు ధర రూ.4500. మార్కెట్ యార్డులో క్వింటాలుకు గరిష్టంగా రూ.6525, కనిష్టంగా రూ.6000, సగటు(మోడల్) ధర రూ.6200 ధర పలుకుతున్నట్టు మార్కెట్ కమిటీ అధికారులు చెబుతున్నారు. మద్దతుకు మించి ధర పలుకుతుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సీజన్ ఆరంభంలో పంట నాణ్యతగా ఉండటం అధిక ధర పలకడానికి కారణమని మార్కెట్ కమిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. మద్దతు ధర కన్నా క్వింటాలు పెసర్లకు రూ.1700 అధికంగా ధర పలకడం గమనార్హం.
ఇప్పటివరకు మార్కెట్ యార్డులో వివిధ గ్రామాల రైతుల నుంచి కమీషన్ ఏజెంట్‌లు/వ్యాపారులు క్వింటాలుకు సగటు ధర రూ.6200 చొప్పున రూ.1,30,20,000 విలువ చేసే 2100 క్వింటాళ్ల పెసళ్లను కొనుగోలు చేసినట్టు తాండూరు మార్కెట్ కమిటీ సూపర్‌వైజర్ హబీబ్ అల్వీ తెలిపారు. పెసర్ల క్రయవిక్రయాలపై రూ.వందకు 1శాతం చొప్పున రూ.1.30లక్షలపైగా మార్కెట్ ఫీజు రూపంలో ఆదాయం వచ్చిందని ఆయన చెప్పారు. మరో నెలపాటు పెసర్ల్ల సీజన్ కొనసాగుతుందన్నారు.