'మద్దతు'లేని ఉల్లి రైతు | Farmers demand to buy Markfed at support price | Sakshi
Sakshi News home page

'మద్దతు'లేని ఉల్లి రైతు

Sep 9 2025 5:31 AM | Updated on Sep 9 2025 5:31 AM

Farmers demand to buy Markfed at support price

కర్నూలు మార్కెట్‌లో వ్యాపారుల సిండికేట్‌ నిర్ణయించిందే ధర  

మొదటి టెండర్‌లో కొన్నది 20 లాట్లు మాత్రమే  

ధర తేడాను రైతుకు ఇస్తామంటూ మభ్యపెడుతున్న ప్రభుత్వం  

గతంలో ఇలాగే చెప్పి రైతులకు రూ.6.50 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు  

మద్దతు ధరకు మార్క్‌ఫెడ్‌ కొనాలని రైతుల డిమాండ్‌  

కర్నూలు (అగ్రికల్చర్‌): ఉల్లికి మద్దతు ధర దక్కకపోతే ఆ తేడాను తాము రైతుకు ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ రైతుల్లో నమ్మకం కలిగించటంలేదు. ఈ రకంగానే గతంలో మాటలు చెప్పిన చంద్రబాబు రూ.6.5 కోట్లు రైతులకు ఎగ్గొట్టారని వారు గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు మార్కెట్‌లో వ్యాపారులు ఉల్లిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి వ్యయం కూడా రావడంలేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సిండికేట్‌ అయిన వ్యాపారులు చెప్పిందే ధరగా చలామణి అవుతోంది. 

మద్దతు ధర రూ.1,200 ఉండగా.. వ్యాపారులు అతి తక్కువ ధరకు మాత్రమే కొంటున్నారు. సోమవారం కర్నూలు మార్కెట్‌కు 157 లాట్ల ఉల్లి వచ్చింది. ఇందులో వ్యాపారులు 20 లాట్లకు మాత్రమే ఈ–నామ్‌లో ధరలు వేశారు. గరిష్ట ధర రూ.1,089 నమోదైంది. ఒకటి, రెండు లాట్లకు మాత్రమే రూ.వెయ్యికిపైగా ధర వేశారు. కొన్నింటికి కేవలం రూ.500 నుంచి రూ.600 మధ్య ధర వేశారు. 130 లాట్లకు రీటెండరు నిర్వహించారు. రీటెండర్‌లో కనీస ధర రూ.100గా నిర్ణయించారు. అయినా.. వ్యాపారులు కొన్ని లాట్లు మాత్రమే కొనుగోలు చేశారు.  

రూ.1,200 ధర గిట్టుబాటు కాదు
ప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 మద్దతు ధర గిట్టుబాటు కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.లక్ష అవుతోంది. ఉల్లిపాయల్ని మార్కెట్‌కు తరలించే ఖర్చు దీనికి అదనం. అధిక వర్షాల వల్ల కుళ్లిపోవడంతో చాలవరకు ఉల్లిని పారబోశారు. ఎకరాకు మిగిలింది 30 క్వింటాళ్ల నుంచి 75 క్వింటాళ్ల వరకు మాత్రమే. వ్యాపారులు రూ.300 నుంచి రూ.600 ధరతో కొంటుండటంతో పెట్టుబడిలో 20–30 శాతం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. మద్దతు ధర రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఉంటేనే కనీసం పెట్టుబడి చేతికొస్తుందని రైతులు చెబుతున్నారు.  

నాటి మోసం ఎలా మర్చిపోగలం?
2016, 2017 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి మాదిరిగానే ఉల్లి ధరలు పడిపోయాయి. అప్పట్లో క్వింటాకు కనీస మద్దతు ధర రూ.700గా  నిర్ణయించారు. ఈ మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు గరిష్టంగా రూ.300 బోనస్‌ చెల్లిస్తామని చెప్పిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. వేలాదిమంది రైతులకు ఈ బోనస్‌ను ఎగవేసింది. 

ఉల్లి రైతులకు ఎగ్గొట్టిన మొత్తం రూ.6.50 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ తేడాను బోనస్‌ రూపంలో ఇస్తామని చెబుతుంటే రైతులు నమ్మలేకపోతున్నారు. గతంలో ఎగవేసిన చంద్రబాబు ఇప్పుడు ఇవ్వడం అనుమానమేనని పేర్కొంటున్నారు. వ్యాపారులతో సంబంధం లేకుండా మార్క్‌ఫెడ్‌ ద్వారా నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే న్యాయం జరుగుతుందని ఉల్లి రైతులు చెబుతున్నారు.  

160 ప్యాకెట్ల ఉల్లి పారబోశాం  
నాలుగెకరాల్లో ఉల్లి సాగుచేశాం. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వర­కు పెట్టుబడి ఖర్చయింది. అధిక వర్షాల వల్ల కుళ్లిపోవడంతో పొలంలోనే 160 ప్యా­కెట్లు పారబోశాం. 136 క్వింటాళ్లు మార్కెట్‌కు తెచ్చి అమ్మకానికి పెట్టాం. ఉల్లిలో నాణ్యత బాగా ఉంది. అయితే వ్యాపారులు ఉల్లిగడ్డలను కొనుగోలు చేయనేలేదు. ఈ ప్రభుత్వం ఉల్లి రైతులను పూర్తిగా విస్మరించింది. రూ.1,200 ధర ఏమాత్రం గిట్టుబాటు కాదు.  – కె.లక్ష్మన్న, కున్నూరు గ్రామం, గోనెగండ్ల మండలం  

కొనేవారి కోసం ఎదురుచూపులు 
రెండెకరాల్లో ఉల్లి సాగుచేశాం. ఎకరాకు కోయడానికి రూ.14,500, నాట్లు వేయడానికి రూ.25 వేలు, విత్తనాలకు రూ.10 వేలు­.. రసాయన ఎరువులు, పురుగుమందులు, కూలీ, రవాణా చార్జీలు కలిపి ఎకరాకు రూ.లక్షకుపైనే పెట్టుబడి అయింది. మార్కెట్‌కు 255 ప్యాకెట్ల ఉల్లిగడ్డలు తెచ్చి అమ్మకానికి పెట్టగా వ్యాపారులు కొనలేదు. రూ.1,200 ధర గిట్టుబాటు కాదు. మద్దతు ధర కనీసం రూ.2 వేలు ప్రకటించాలి.   – రామలింగడు, దైవందిన్నె గ్రామం, ఎమ్మిగనూరు మండలం

ఉల్లి రైతు కంట కన్నీరు 
దేవనకొండ: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో 1,100 నుంచి 1200 ఎకరాల్లో ఉల్లి సాగయింది. మార్కెట్‌లో ఉల్లి రేటు కనీసం క్వింటా రూ.500–600 కూడా లేకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొద్ది మంది రైతులు ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేస్తుండగా మరికొందరు  వేరే పంట వే­సేందుకు ఉల్లిని తీసి గట్లపై వేస్తున్నారు. 

మండలంలోని తెర్నెకల్‌ గ్రామానికి చెందిన రాముడు అనే రైతు ఉల్లి ధర అమాంతం పడిపోవడంతో దాన్ని గ్రేడింగ్‌ చేసి మార్కెట్‌కి తరలించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదని, వేరే పంట వేసేందుకు ఉల్లి పీకి గట్లపై వేస్తున్నాడు. ఉల్లి పంట ఎకరాకు తనకు రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టినా ఒక్క రూపాయి కూడా రాలేదని, అప్పులు మిగిలాయని వాపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement