
నాణ్యత సాకుతో క్వింటా రూ.800కు కుదించే యత్నం
ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు
పైగా.. 500 కి.మీ. దూరంలోని తాడేపల్లిగూడేనికి ఉల్లిగడ్డలు తీసుకెళ్లాలంటున్న అధికారులు
ఇది పూర్తిగా ప్రైవేట్ మార్కెట్..
ఇక్కడ అన్యాయం జరిగినా రైతులను పట్టించుకునే దిక్కుండదు
సర్కారు తీరుతో ఉల్లి రైతుల్లో తీవ్ర కలవరం
కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లి రైతులను నిలువునా ముంచేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరకొరగా ఉన్న మద్దతు ధరకూ కోత పెడుతూ వారికి తీరని అన్యాయం చేస్తోంది. క్వింటా రూ.1,200 మద్దతు ధరతో నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తామని ప్రకటించిన మూడు రోజులకే చేతులెత్తేస్తోంది. ఈ నెల 1 నుంచి 3 వరకు మార్క్‌ఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేసింది. ఆ తర్వాత.. ప్రతి లాట్‌ను వ్యాపారులు కొనాల్సిందేనని, వ్యాపారులు కొన్న ధరను మినహాయించి వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, ఇంతవరకు ఒక్క రైతు బ్యాంకు ఖాతాకు కూడా ఆ వ్యత్యాసం మొత్తం జమ అయిన దాఖలాల్లేవు. పైగా.. ఇప్పుడు మద్దతు ధరను తగ్గించే కుట్రకు శ్రీకారం చుట్టింది. నాణ్యత తక్కువుందన్న సాకుతో మద్దతు ధరను క్వింటాకు రూ.800కు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాణ్యత బాగున్న ఉల్లిని రూ.1,200, నాణ్యతలేని ఉల్లిని రూ.800 ధరతో కొనుగోలు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది.
తాడేపల్లిగూడెం తీసుకెళ్లండి..
మరోవైపు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకురావడానికే రవాణా చార్జీల భారంతో రైతులు అల్లాడుతుంటే అధికారుల పిడుగులాంటి వార్త ఉల్లి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడేనికి ఉల్లిగడ్డలు తీసుకెళ్లాలని అధికారులు సూచించడం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. నిజానికి.. తాడేపల్లిగూడెం మార్కెట్ పూర్తిగా ప్రైవేటుది. రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి.
అన్నీ భరించి తీసుకెళ్లినా అక్కడ రైతులకు అన్యాయం జరిగినా పట్టించుకునే దిక్కుండదు. అదే కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నిత్యం కలెక్టర్, జేసీ, జిల్లా ఎస్పీలతో పాటు విజిలెన్స్, మార్కెటింగ్ శాఖాధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉల్లిగడ్డలు తీసుకెళ్లాలని అధికారులే సూచించడం ఉల్లి రైతుల్లో కలకలం రేపుతోంది.
భారీగా కుళ్లిపోతున్న ఉల్లి..
ఇక మద్దతు ధరతో ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ 4,500 టన్నుల ఉల్లి మాత్రమే కొనుగోలు చేసింది. ఇందులో రెండువేల టన్నుల వరకు వివిధ జిల్లాలకు తరలించారు. ఇంకా 2,500 టన్నుల ఉల్లి మార్కెట్ యార్డు, వివిధ గోదాముల్లో నిల్వ ఉంది. ముందస్తు ప్లానింగ్ లేకపోవడంవల్ల ఉల్లి భారీగా కుళ్లిపోతోంది. వివిధ జిల్లాలకు తరలించిన రెండువేల టన్నుల ఉల్లిలో నాణ్యతలేదనే కారణంతో దాదాపు 500 టన్నులు పారబోసినట్లు తెలుస్తోంది.