
సాక్షి, కర్నూలు: జిల్లాలో రైతులకు ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను రైతులు దున్నేస్తున్నారు. పత్తికొండ రూరల్‌లో పులికొండ రైతు పొలాన్ని దున్నేశారు. టమోటా, ఉల్లి పంటలు తమ కొంప ముంచాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానికులు ఉల్లి దోపిడీ చేస్తున్నారు. మార్కెట్‌లోనే రైతులు ఉల్లినివదిలేసి వెళ్తున్నారు. రైతులు వదిలేసి వెళ్లిన ఉల్లిని స్థానికులు ఫ్రీగా తీసుకెళ్తున్నారు. బైకులపై ఆటోలలో ఉల్లిగడ్డ మూటలను స్థానికులు ఎత్తుకెళ్తున్నారు.
పత్తికొండ టమోటా మార్కెట్‌ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించారు టమోటాకు ధర లేక రైతులు బాధలు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేదని శ్రీదేవి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విత్తనం నుండి విక్రయం దాకా రైతాంగానికి అండగా జగనన్న ఉండేవారని.. రైతులు టమోటాలను రోడ్డుపై పారవేస్తున్నా కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గాని స్పందించిన దాఖలాలు లేవంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా టమోటాకు గిట్టు బాటుధర కల్పించాలని శ్రీదేవి డిమాండ్ చేశారు.

రైతుల ఆవేదనను పట్టించుకోకుండా గిట్టుబాటు ధర ప్రకటించడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మితే కోత ఖర్చులు కూడా రావంటూ పొలాన్ని రైతులు దున్నేస్తున్నారు. 1200 గిట్టుబాటు ధర సరిపోదంటూ మరింత నష్టాల్లో కూరుకుపోకుండా పత్తికొండ రైతులు.. పంటను దున్నేస్తున్నారు. కనీసం 2500 రూపాయల గిట్టుబాటు ధర కల్పించి ఉల్లిని కొనుగోలు చేయాలని రైతలు డిమాండ్ చేస్తున్నారు. పొలంలో ఉల్లి పంటలు దున్నివేస్తున్న రైతులను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరామర్శించారు. కంగాటి శ్రీదేవితో రైతులు తమ బాధలు వెళ్లబోసుకున్నారు.
