వెల్దుర్తి: కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం 19 మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టించిన ఈ ఘటనలో కాలిబూడిదైన మృతదేహాలను ఇప్పటికే కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటన జరిగిన రోజునే పోలీసులు బస్సును క్షుణ్ణంగా పరిశీలించి అక్కడి వస్తువులను తరలించారు.
అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారు ధరించిన బంగారం, వెండి ఆభరణాలు కరిగి బూడిదలో ఉంటాయనే దురాశతో మహబూబ్‌నగర్‌కు చెందిన కొన్ని కుటుంబాలు బుధవారం బస్సు దుర్ఘటన ప్రాంతానికి చేరుకున్నారు. బూడిదను సంచుల్లో సేకరించి, ప్రమాద స్థలికి దగ్గరలోని ఓ కుంట వద్ద నీటిలో కడిగి మరీ పరీక్షిస్తున్నారు. ఈ ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపగా.. వీళ్లు మాత్రం ఆశ చంపుకోలేక ఇలా దూరప్రాంతం నుంచి రావడం అందరినీ నివ్వెరపరుస్తోంది.


