అంతా అమ్ముకున్న తర్వాత కొనుగోళ్లా?
పప్పుదినుసులు కొనుగోలు చేస్తామన్న అచ్చెన్న
తమ కృషి ఫలితంగానే కేంద్రం అంగీకరించిందని వెల్లడి
ఇప్పటికే 90 శాతానికి పైగా రైతులు పంటలు అమ్మేసుకున్నారు
అంతా అయిపోయిన తర్వాత కేంద్రాలు తెరిచి లాభమేమిటంటున్న కర్షకులు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ముగిసి దాదాపు రెండున్నర నెలలు గడిచింది. రైతులు తాము పండించిన పంటలో దాదాపు 90 శాతానికిపైగా పప్పు దినుసుల పంటలను మార్కెట్‌లో మద్దతు ధరలేకపోవడంతో ఇప్పటికే తెగనమ్ముకున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అంతా అయిపోయేక కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపిందంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రకటనలు చేయడం పట్ల రైతులు మండిపడుతున్నారు. పంట కోతకు వచ్చే వేళ..మార్కెట్‌లో ధరలు పతనమైన వేళ...కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.
అలాంటిది అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు తెరిచి ప్రయోజనం ఏమిటని ప్రశి్నస్తున్నారు. తాము రాసిన లేఖకు స్పందిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ స్పందిస్తూ రాష్ట్రంలో మద్దతు ధర దక్కని కందులు, మినుములు, పెసలు కొనుగోలు సంసిద్ధత వ్యక్తం చేశారని మంత్రి అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటన జారీ చేశారు.
మద్దతు ధరకు 1,16,900 టన్నుల కందులు, 903 టన్నుల పెసలు, 28,440 టన్నుల మినుములను ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్)కింద మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. వాస్తవానికి రాష్ట్రంలో పెసలు పంట దాదాపు 90 శాతం రైతులు తెగనమ్ముకున్నారు. చేతులు కాల్చుకున్నారు. మినుము, కందులు కూడా దాదాపు 60–70 శాతం అమ్మకాలు పూర్తయ్యాయి. ఈ సమయంలో కొనుగోలుకు కేంద్రం ఏర్పాటుకు సర్కారు ముందుకొచి్చందని ప్రకటించడం వలన రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని మండిపడుతున్నారు.
మద్దతు ధర దక్కక రైతులు విలవిల
వాస్తవానికి ఈ మూడు పంటలే కాదు.. ఈ సీజన్‌లో దాదాపు అపరాలు, మొక్కజొన్న, చిరుధాన్యాలకు మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. శనగకు మద్దతు ధర రూ.5875 కాగా, మార్కెట్‌లో ఎర్ర శనగకు రూ.5వేలు కాబూలీ శనగకు రూ.5400కు మించి పలకడం లేదు. సజ్జకు మద్దతు ధర క్వింటాకు రూ.2775 కాగా, మార్కెట్‌లో 1600 నుంచి రూ.1800కు కొనుగోలు చేస్తున్నారు.
మొక్కజొన్న మద్దతు ధర రూ.2400 కాగా, మార్కెట్‌లో రూ.1800కు మించి దక్కడం లేదు. పెసలు మద్దతు ధర రూ.8558 కాగా, మార్కెట్‌లో రూ.5వేల నుంచి రూ.5200కు మించి కొనడం లేదు. కందులకు కనీస మద్దతు ధర రూ.8వేలు కాగా, మార్కెట్‌లో రూ.6500కు మించి కొనడం లేదు. మినుము పంటకు మద్దతు ధర రూ.7550 కాగా, మార్కెట్‌లో రూ.6400కు మించి లభించడం లేదు.
పొరుగునున్న తెలంగాణ రాష్ట్రం దాదాపు 50 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలు తెరిచి మొక్కజొన్నతో పాటు అపరాలు కొనుగోలు చేస్తుంటే.. ఏపీలో మాత్రం కొనుగోలు కేంద్రాల ఊసెత్తలేదు. రైతులు, రైతు సంఘాలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, కేంద్రానికి లేఖలు రాసామంటూ తప్పించుకోవడం తప్ప ధరల స్థిరీకరణ నిధి ద్వారా కొనుగోలు దిశగా అడుగులు వేసిన దాఖలాలు లేవు.
పప్పుదినుసుల కొనుగోలుకు కేంద్రం ఆమోదం: మంత్రి అచ్చెన్న
ఖరీఫ్ 2025–26 సీజన్‌కు సంబంధించి పప్పుదినుసుల కొనుగోలుకు కేంద్రం అంగీకరించిందని వ్యవసాయ శాఖమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. తాము రాసిన లేఖకు స్పందించి కేంద్ర వ్యవసాయ – రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ మేరకు తమ అంగీకారం తెలిపారన్నారు.
ధరల మద్దతు పథకం (పీఎస్‌ఎస్) కింద కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కందులు, మినుము, పెసలు కొనుగోలు చేస్తుందన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో పప్పు దినుసులు పండించిన రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని పేర్కొన్నారు.


