సన్నబియ్యం.. ‘మద్దతు’ ఇయ్యం! | Kharif paddy harvesting begins in Nellore | Sakshi
Sakshi News home page

సన్నబియ్యం.. ‘మద్దతు’ ఇయ్యం!

Sep 21 2025 5:35 AM | Updated on Sep 21 2025 5:35 AM

Kharif paddy harvesting begins in Nellore

నెల్లూరులో ఖరీఫ్‌ ధాన్యం మాసూళ్లు ప్రారంభం

ఎంటీయూ 1010, కేఎన్‌ఎం రకాలకు దక్కని మద్దతు.. కొనేవారు లేక గగ్గోలు పెడుతున్న అన్నదాతలు 

ఆదిలోనే ధాన్యం రైతులకు కష్టాలు మొదలు.. పుట్టికి రూ.4,720 నుంచి రూ.5,720 వరకు నష్టం 

ఎకరాకు రూ.15 వేల చొప్పున నష్టపోతున్న పరిస్థితి

ఒక్క పంటలోనే రూ.250 కోట్లకు పైగా నష్టం 

మద్దతు ధరకు కొనుగోలులో విఫలమైన ప్రభుత్వం 

ఉల్లి, టమాట, చీని, సజ్జ పంటలకు దక్కని మద్దతు  

సాక్షి, అమరావతి: ధాన్యం రైతు కష్టం దళారుల పాలవుతోంది. కనీస మద్దతు ధర దక్కక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంటిల్లపాదీ ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటను కొనేవారు లేక దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికే వరుసగా ఉల్లి, టమాట, చీని, అరటి, సజ్జ వంటి పంటలకు మద్దతు ధర లేక రైతులు గగ్గోలు పెడుతుంటే తాజాగా ఈ జాబితాలో ధాన్యం రైతు కూడా చేరాడు.  

ఖరీఫ్‌ సీజన్‌లో ముందుగా కోతకు వచ్చే నెల్లూరులోని సన్నరకాలకు కనీస మద్దతు ధర కాదు కదా.. కనీసం కొనేవారు కూడా కరువయ్యారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో 50 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని గొప్పలు చెబుతున్న కూటమి ప్రభుత్వం... ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతు సంఘాలు మండిపడుతున్నారు. 

నాడు మద్దతుకు మించి పలికిన ధర 
ఖరీఫ్‌లో వరి సాధారణ విస్తీర్ణం 37.17 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 35.87 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సీజన్‌లో ముందస్తుగా వరి సాగయ్యే ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది 1.99 లక్షల ఎకరాల్లో వేశారు. ఎంటీయూ1010, కేఎన్‌ఎం(1638) వంటి సన్నరకాలు ఇక్కడ ఎక్కువగా సాగవుతాయి. ఎకరాకు సగటున రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి అవుతుంది. మే–జూన్‌ నెలల్లో నాట్లు వేయగా ఆగస్టు–సెపె్టంబరులో పంట కోతకొస్తుంది. 

గ్రేడ్‌–ఎ రకంగా పిలిచే దీనికి మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువ. ఏటా మద్దతుకు మించి ధర పలుకుతుంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య సాధారణ రకాలను మద్దతు ధరకు కొనుగోలు చేయగా, ఫైన్‌ వెరైటీస్‌కు మద్దతుకు మించి మార్కెట్‌లో ధర లభించింది. 2023–24 సీజన్‌లో కనీస మద్దతు ధర ప్రకారం పుట్టి రూ.18,725 ఉండగా, మార్కెట్‌లో రూ.25 వేల వరకు దక్కడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. ప్రస్తుతం ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎకరానికి సగటున 3 పుట్లు దిగుబడులొస్తాయని అంచనా. ఆ లెక్కన ఈ జిల్లాలో దాదాపు 5.97 లక్షల పుట్లు (5.03 లక్షల టన్నులు) ఉత్పత్తి వస్తుంది. 

పుట్టికి రూ.5,720 వరకు నష్టపోతున్న రైతులు 
2024–25 సీజన్‌కు సంబంధించి సాధారణ వరి రకాలకు క్వింటా రూ.2,300, గ్రేడ్‌ ఏకు రూ.­2,320­గా కేంద్రం మద్దతు ధర నిర్ణయించింది. ఈ లెక్కన పుట్టికి రూ.19,720 చొప్పున దక్కాల్సి ఉండగా, ఎంటీయూ 1010కు రూ.14 వేలు, కేఎన్‌ఎం రకానికి రూ.15వేలకు మించి లభించడం లేదు. అయినా కొనే­వారు కరువయ్యారు. అంటే, ఎంటీయూ 1010­కు పుట్టికి రూ.5,720, కేఎన్‌ఎంకు పుట్టికి రూ.4,720 చొప్పున మద్దతు ధరలోనే రైతులు నష్టపోతున్నారు. 

ధరల పతనం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కోసం నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట ఇటీవల రైతన్నలు పెద్దఎత్తున ధర్నా చేశారు. దళారులకు కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల గురించి ఆలోచన చేసిన పాపాన పోలేదు. ఫలితంగా ఎకరానికి 3 పుట్టీల దిగుబడి చూ­సుకున్నా సరే, పుట్టికి సగటున రూ.5,200 చొప్పున సగటున చొప్పున రూ.15వేలకు పైగా నష్టపోతున్నారు. అంటే∙దాదాపు రూ.240–250 కోట్ల ఆదాయాన్ని నెల్లూరు జిల్లా రైతులు కోల్పోయే పరి­స్థితి ఏర్పడింది. సీజన్‌ ఆరంభంలో ఫైన్‌ వెరైటీలకే మద్దతు ధర దిక్కు లేకపోతే కామన్‌ వరి రకాలకు ఎలా లభిస్తుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.

గత ఏడాది కూడా కనీస మద్దతు ధర ప్రకారం 75 కేజీల బస్తాకు రూ.1,725 దక్కాల్సి ఉండగా, రూ.­1,350 నుంచి రూ.1,500కు మించి దక్కలేదు. ఫలితంగా క్వింటాకు రూ.300 నుంచి రూ.500 దాక రైతులు నష్టపోయారు. ఏదైనా సీజన్‌లో మద్దతు ధర లభించని పరిస్థితి నెలకొంటే వెంటనే మార్కె­ట్‌లో జోక్యం చేసుకుని మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలి. మద్దతు ధర దక్కని ఉల్లి, టమాట, అరటి, చీని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదు.

పంట కోసి... 8 రోజులైనా కొనేవారు లేరు 
ఎకరన్నరలో కేఎన్‌ఎం రకం సాగు చేశా. ఎకరాకు రూ.35 వేల ఖర్చయింది. 5.5 పుట్ల వరకు దిగుబడి వచి్చంది. పంట కోసి ఎనిమిది రోజులైంది. రోజూ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నా ఇదిగో అదిగో అంటూ కాలం గడుపుతున్నారు. శుక్రవారం కురిసిన వర్షంతో ధాన్యం తడవకుండా ఒబ్బిడి చేసుకునేందుకు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయినా కొంత మేర తడిసి పో­యింది. 

తీసుకెళ్లమని కాళ్ల వేళ్లా పడితే పుట్టికి రూ.15 వేలు ఇస్తామంటున్నారు. అదీ కూడా బస్తాలకెక్కించి మిల్లుకు చేరవేస్తేనే ఆ ధర ఇస్తామంటున్నారు. పుట్టికి లోడింగ్, రవాణాకు రూ.700 నుంచి రూ.1,000 వరకు ఖర్చవుతుంది.ఇలా అయితే కనీసం పెట్టుబడి కూడా మిగిలే పరిస్థితి లేదు.ఇక మాకేమి మిగులుతుంది? గత ప్రభుత్వ హయాంలో పుట్టి రూ.23 వేలకు అమ్ముకున్నా. ఇప్పుడు కొనేవారు కూడా లేరు. ఏం చేయాలో పాలు పోవడం లేదు.  – వి.శివప్రసాద్, వేల్లూరు, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా

కొనేవారు లేక ధాన్యం రైతులు గగ్గోలు 
నెల్లూరులో సన్న రకాల ధాన్యా­న్ని కొనేవారు లేకుండా పోయారు. రైతులు పుట్టికి గరిష్ఠంగా రూ.5,500కు పైగా నష్టపోతున్నారు. వరి సాగు చేసేది మెజార్టీ కౌలు రైతులే. వాణిజ్య  పంటలు వేసే కౌలు రైతు సాగుకు ముందే నగదు రూపంలో కౌలు చెల్లిస్తారు. వరి కౌలు రైతులైతే పంట పండాక ధాన్యం రూపేణ చెల్లిస్తారు. అమ్మకం ధర పడిపోవడంతో కౌలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. 

ఇప్పటికే ఉల్లి, టమాట, చీని, అరటి, సజ్జ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఉల్లి కిలో 50 పైసలకు కూడా కొనే పరిస్థితి లేదు. సన్న రకాలకు మద్దతు దక్కకపోతే సాధారణ రకాలకు మద్దతు ధర ఏ విధంగా దక్కుతుందన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మద్దతు ధరకు కొనాలి.  – ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మాజీ వైస్‌ చైర్మన్, ఏపీ వ్యవసాయ మిషన్‌ 

వ్యాపారుల చుట్టూ తిరిగినా కొనేవారు లేరు...!  
ఖరీఫ్‌లో ఐదు ఎకరాల్లో కేఎన్‌ఎం(1638) సన్న రకం వరి పంట వేశా. ఎకరాకు రూ.40 వేల చొప్పున రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టా. ఎకరాకు 2.89 టన్నుల వంతున 14 టన్నులు (17 పుట్టిలు) దిగుబడి వచ్చింది. రెండు రోజుల కిందట పంట కోశా. 

కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం పుట్టి (850 కేజీలు)కి రూ.19,720 లభించాల్సి ఉండగా, మార్కెట్‌లో రూ.15,500కు మించి దక్కడం లేదు. వ్యాపారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కొనేవారు లేరు. శుక్రవారం భారీ వర్షానికి పంటంతా తడిసిపోయింది. ఇదే రకానికి 2023–24 సీజన్‌లో పుట్టికి రూ.25 వేలకు పైగా ధర లభించింది.  – కాటాబత్తిన కృష్ణయ్య, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement