బడుగు రైతును ‘గట్టె’క్కించే పనస!

బడుగు రైతును  ‘గట్టె’క్కించే పనస! - Sakshi


చల్లని ప్రాంతాల్లోనే కాదు.. వేడి వాతావరణం, కరువు ప్రాంతాలూ పనస సాగుకు అనుకూలమే

పొలం గట్లపై పనస చెట్లు.. విదర్భ రైతుల మోముల్లో చిరునవ్వులు

కరువొచ్చి పంటలు ఆదుకోకపోయినా.. బడుగు రైతు బతుకు బండిని సునాయాసంగా గట్టెక్కిస్తున్న పనస పండ్లు

తమిళనాడులో వేల హెక్టార్లలో ప్రత్యేకంగా పనస తోటల సాగు

పనసతో 40 రకాల ఉత్పత్తులు తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చిన కేరళ కేవీకే


 

 

పనస పండ్ల (జాక్ ఫ్రూట్) సాగు అనగానే పుష్కలంగా వర్షం కురిసే కేరళ, తమిళనాడులోని ప్రాంతాలే గుర్తుకొస్తాయి. కేరళలో పదో పరకో పనస చెట్లు లేని పెరటి తోటలే కనపడవు. సంప్రదాయకంగా పనస సాగు, వినియోగంలోనూ కేరళ ముందంజలో ఉంది. ఇక తమిళనాడులోని కడలూరు జిల్లా పనృతి ప్రాంత రైతులైతే వేలాది ఎకరాల్లో ప్రత్యేకంగా పనస తోటలనే సాగు చేస్తున్నారు. హెక్టారుకు ఏడాదికి రూ. లక్షన్నర వరకు ఆదాయం పొందుతున్నారు. ఎరువులు, తెగుళ్లు, పురుగుల బెడద లేని పంట కాబట్టి నికరాదాయం ఉంటున్నది. అయితే, కేరళ, తమిళనాడు తీరప్రాంతాల్లో కన్నా తక్కువ వర్షపాతం, వేడి వాతావరణం పనస సాగుకు సరిపడదేమో?! బహుశా ఈ భావనతోనే కావచ్చు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పెరట్లో ఒకటీ అరా వేసుకోవడమే తప్ప పనస చెట్లను రైతుకు ఆదాయ భద్రతనిచ్చే పెద్ద భరోసాగా చూడలేదు. ఈ నేపథ్యంలో వేడి వాతావరణం, అత్యంత బెట్ట పరిస్థితుల్లోనూ ఈ చెట్లు కొండంత అండగా నిలిచి కాసులు కురిపిస్తాయని మహారాష్ట్రలోని విదర్భ ప్రాంత రైతుల అనుభవాలు చాటి చెబుతున్నాయి.



 రైతు ఆత్మహత్యలతో తరుచూ వార్తల్లో నిలిచే విదర్భ ప్రాంతంలోని యవత్‌మాల్, చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో గత పదేళ్లుగా పొలం గట్లపై పనస చెట్ల సాగు విస్తరిస్తోంది. నాగపూర్ తదితర విదర్భ పట్టణాల్లో లేత పనస కాయలకు, పండ్లకు మంచి డిమాండ్ ఉండటంతో రైతులకు చక్కని ఆదాయం వస్తోంది. యవత్‌మాల్ జిల్లా కామత్‌వాడా చుట్టుపక్కల గల నల్లరేగడి పొలాల గట్లపై పనస చెట్లను విరివిగా సాగు చేస్తున్నారు. అక్కడి వాతావరణం, ఉష్ణోగ్రత తెలంగాణను పోలి ఉంటుంది. వర్షపాతం ఇంకా తక్కువ.  అక్కడి రైతులు పత్తి, సోయాబీన్ వంటి పంటలను సాగు చేసి నష్టపోయిన సందర్భాల్లోనూ పనస చెట్లు ఫలసాయాన్నిస్తున్నాయి. పనస చెట్లున్న రైతుల కళ్లల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన మెరుపు తళుక్కుమంటుంది. కామత్‌వాడాకు చెందిన రామ్‌బా, తుకారాం సోదరులు. తమ పొలం గట్లపై పనస చెట్లు వేశారు. కూరగాయలు, పనస చెట్ల ద్వారా క్రమం తప్పకుండా వస్తున్న ఆదాయంతోనే రామ్‌బాతన ముగ్గురు కూతుళ్ల పెళ్లిళ్లు చే శాడు.



 విదర్భ ప్రాంత రైతులు నల్లరేగడి నేలల్లో విజయవంతంగా సాగు చేస్తున్నారు. తేలికపాటి ఎర్ర నేలలు, కంకర నేలలు కూడా పనస సాగుకు అనుకూలమైనవే. అయితే, మొక్కల పెరుగుదల లోతైన నల్లరేగడి నేలల్లో అంత వేగంగా, బలంగా ఉండదు. ఇతర పంటలు సాగుకు అంతగా అనుకూలించని ఖాళీ నేలల్లోనూ పనస చెట్లను సాగు చేస్తున్న వాళ్లున్నారు. నీరు నిలబడే నేలలు పనసకు సరిపడవు. మెట్ట నేలల్లో పెరిగిన పనస తొనల రుచి ఎక్కువట. తొలి రెండేళ్లలో తగు మాత్రంగా నీరందిస్తే చాలు. ఎరువులు, పురుగుమందులు, తెగుళ్ల మందుల అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు. పనస మొక్క నాటిన ఏడేళ్ల నుంచి పంట చేతికొస్తుందని, వందేళ్ల వరకు చెట్లు పండ్లనిస్తూ ఉంటాయని రైతులు చెబుతున్నారు. అంట్లు నాటుకుంటే 4-6 ఏళ్లలోనే కాపుకొస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. లేత కాయలు కొన్నిటిని తీసేస్తే (దీన్నే ‘థిన్నింగ్’ అంటున్నారు) మిగతా కాయలు బలంగా పెరుగుతాయి.

 పోషకాల గని



 పనస పండులో విటమిన్ ఏ, సీలు అధికంగా ఉన్నాయి. వీటితోపాటు పొటాషియం,  క్యాల్షియం, భాస్వరం, ఇనుము, 12 శాతం పిండి పదార్థాలు, 6-7 శాతం మాంసకృత్తులు, 2-3 శాతం పీచుపదార్థాలు ఉన్నాయి. చెక్కెర శాతం తక్కువగా ఉండి సులభంగా జీర్ణమవుతుంది. హఠాత్తుగా చెక్కెర నిల్వలు పడిపోయే ప్రమాదాన్ని ఇది నివారిస్తుందని..ఓ అధ్యయనంలో తేలింది. ‘ఆంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్స్ ఉండటంతో క్యాన్సర్ నిరోధకంగానూ పనిచేస్తుంది. అకాల వృద్ధాప్యాన్ని దరి చేరనివ్వదు’ అని బెంగళూరు వ్యవసాయ వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శ్యామలా రెడ్డి అంటున్నారు.

 

 ఎన్నెన్నో వంటకాలు

 లేత పనస కాయలతో చేసే కూరలకు మహారాష్ట్రలోని హోటళ్లలో మంచి గిరాకీ ఉంది. దీన్ని మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా తింటున్నారు.  కేరళ ప్రజల మెనూలో పనస ఉత్పత్తులు అనేకం ఉంటాయి. పచ్చళ్లు, జామ్‌లు, స్క్వాష్‌లు, జెల్లీలు, హల్వా సహా పలు రకాల ఉత్పత్తులను తయారు చేసి వాడుతున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పనస ఉత్పత్తుల తయారీ, విక్రయంపై ఇటీవల దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. బెంగళూరు సమీపంలోని టూబుగెరె ప్రాంతంలో పెరటి తోటల్లో పనస చెట్లు పెంచుతున్న వాళ్లంతా సహకార సంఘంగా ఏర్పడి తమ ఉత్పత్తులను అమ్ముతూ చెట్టుకు ఏడాదికి రూ. 3 వేల వరకు ఆదాయం పొందుతున్నారు.



 కేరళలోని పాతనంతిట్ట జిల్లా తిరువళ్ల సమీపంలోని తెల్లియార్‌లో గల కృషి విజ్ఞాన్ కేంద్రం పనసతో 40 రకాల ఉత్పత్తులను తయారు చేసే సాంకేతిక విజ్ఞానాన్ని రూపొందించింది. 6 నెలల నుంచి 12 నెలల వరకు నిల్వ చేసుకొని అమ్మేందుకు వీలుందని శాస్త్రవేత్తలు తెలిపారు. పనస సాగు, ఉత్పత్తుల తయారీపై ఈ కేవీకే శిక్షణ కూడా ఇస్తోంది. తిరువనంతపురానికి చెందిన ‘గాంధీ సెంటర్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్’ కూడా శిక్షణ ఇస్తోంది. వరి, గోధుమలకు బదులుగా పనస ఉత్పత్తులను ప్రధానాహారంగా తీసుకోవడానికీ వీలుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రోసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ప్రభుత్వం పనస తోటల సాగును ప్రోత్సహించవచ్చు.   

 - సాగుబడి డెస్క్

 

 అంట్లు 4-6 ఏళ్లలో కాపుకొస్తాయి

 పనస ఏ నేలల్లోనైనా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోకన్నా తెలంగాణలో కొంచెం ఫలసాయం తక్కువగా ఉంటుంది. మేం పదేళ్ల క్రితం పనస మొక్కలు నాటి అధ్యయనం చేస్తున్నాం. పొలం గట్ల మీద, ఖాళీ స్థలాల్లో నాటుకుంటే రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. ఇతర పండ్ల తోటల్లో కొన్ని మొక్కలు నాటుకోవచ్చు. అయితే, వాణిజ్యపరంగా తోటలుగా సాగు చేయాలంటే.. ప్రోసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాలు చూసుకోవాలి. మామిడి సీజన్‌లోనే పనస పంట వస్తుంది. సపోటాకూ ఇదే ఇబ్బంది.

 - డా. ఎం. రాజశేఖర్ (73826 33660),

 సీనియర్ శాస్త్రవేత్త, పండ్ల తోటల పరిశోధనా స్థానం,

 డా. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ, వెంకట్రామన్నగూడెం.

 

 పెట్టుబడి లేదు.. రిస్క్ తక్కువ..

 పనస మొక్కలకు ఎరువులు, తెగుళ్లు, పురుగు మందుల ఖర్చుండదు. కాబట్టి పెట్టుబడి అవసరం లేదు. మహారాష్ట్రలోని యవత్‌మాల్ వంటి జిల్లాల్లో వార్షిక పంటలు విఫలమైనప్పుడు, కరువు కాలంలోనూ పనస చెట్లు రైతులను పోషకాహారపరంగా, ఆర్థికపరంగా ఆదుకుంటున్నాయి. అక్కడి హోటళ్లలో లేత పనస కాయలతో చేసే కూర మాంసం కూరను మరిపిస్తుంది.  ప్రతి రైతూ పొలం గట్ల మీద 5-10 పనస మొక్కలు నాటుకుంటే మేలు. ఈ లక్ష్యంతోనే రైతు రామ్‌బా వద్ద నుంచి వెయ్యి మొక్కలు తీసుకొని రైతులకు పంచాం.

 - డా. బి. రాజశేఖర్ (83329 45368),

 సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్

 

 పనస చెట్టు ద్వారా రూ. 11 వేల ఆదాయం


 13 ఏళ్ల క్రితం మా పొలం గట్లపైన 15 పనస మొక్కలు నాటాను. ఏడేళ్ల నుంచి కాపు మొదలైంది. ఏడాదికి ఒక్కో చెట్టును రూ. 11 వేలకు వ్యాపారులకు గుత్తకు ఇచ్చాను. పనస మొక్కల నర్సరీ పెట్టి మొక్క రూ. 20 చొప్పున అమ్ముతున్నాను. 500 మంది వరకు రైతులు నా దగ్గర మొక్కలు కొని నాటుకొని.. మంచి ఆదాయం పొందుతున్నారు.

 - రామ్‌బా, కామత్‌వాడా గ్రామం, యవత్‌మాల్ జిల్లా, మహారాష్ట్ర

 

 

Read latest Vanta-Panta News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top