ఆరుతడి పంటలు ఉత్తమం | Arutadi better crops | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలు ఉత్తమం

Jul 21 2014 12:15 AM | Updated on Jun 4 2019 5:16 PM

ఆరుతడి పంటలు ఉత్తమం - Sakshi

ఆరుతడి పంటలు ఉత్తమం

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బావులు, చెరువు బోరు బావుల్లో కొద్ది కొద్దిగా నీరు చేరుతున్నది. ఈ నీటిని ఉపయోగించుకొని రైతులు వరి సాగు చేయడం కంటే కూడా ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం మంచిది.పుష్కలంగా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో వరి మాత్రమే

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు బావులు, చెరువు బోరు బావుల్లో కొద్ది కొద్దిగా నీరు చేరుతున్నది. ఈ నీటిని ఉపయోగించుకొని రైతులు వరి సాగు చేయడం కంటే కూడా ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం మంచిది.పుష్కలంగా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో వరి మాత్రమే సాగు చేయాలనుకునే రైతులు.. ఊడ్పులు ఆలస్యమైన ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని మెలకువలను తప్పనిసరిగా పాటించాలి.జూలై నెల ఆఖరి వరకు వరి సాగు ప్రారంభించే రైతాంగం మధ్యకాలిక రకాలను, ఇంకా ఆలస్యమైతే స్వల్పకాలిక రకాలను మాత్రమే సాగు చేసుకోవాలి.ప్రస్తుత పరిస్థితుల్లో వరిని సాంప్రదాయ పద్ధతులకన్నా నేరుగా దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన వరి విత్తనాలను వెదజల్లే పద్ధతి ద్వారా గానీ, డ్రమ్ సీడర్‌తో విత్తుకొని సాగు చేయడం వల్ల పంట కాలాన్ని కోల్పోకుండా సకాలంలో వరి పంటను సాగు చేసుకోవచ్చు.రకాన్ని బట్టి డ్రమ్‌సీడర్‌తో అయితే 10 నుంచి 12 కిలోల విత్తనం, నేరుగా వెదజల్లడానికైతే 12 నుంచి 16 కిలోల విత్తనం అవసరం.

కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండైజిమ్ పొడి మందును ఒక లీటరు నీటితో కలిపిన మందు ద్రావణంలో 24 గంటలు నానబెట్టిన తరువాత 12 నుంచి 24 గంటల మండె కట్టాలి. విత్తనాలు ముక్క పగిలి తెల్లగా కార వచ్చిన దశలో నేరుగా వెదజల్లుకోవాలి లేదా డ్రమ్‌సీడర్‌తో విత్తుకోవాలి. మొలక ఎక్కువ పొడవు లేకుండా జాగ్రత్త పడాలి.

ఈ పద్ధతుల ద్వారా విత్తుకున్నప్పుడు నేలను బాగా దమ్ము చేసి ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకున్న మరుసటి రోజు బురద మీదనే విత్తుకోవడం గాని, వెదజల్లుకోవడంగాని చేసుకోవాలి. కలుపు సమస్య అధిగమించడం కోసం విత్తిన 5 రోజులకు ప్రెటిలాక్లోర్+సెవ్‌నర్ కలసివున్న మందును 500 మి.లీ. లేదా బ్యూటాక్లోర్+సెవ్‌నర్ 1250 మి.లీ. లేదా ఆక్సాడైయార్జిల్ 35 గ్రాముల పొడి మందును అర లీటరు నీటిలో కరిగించి 25 కిలోల పొడి ఇసుకతో కలిపి ఎకరానికి చల్లుకోవాలి.

డ్రమ్‌సీడర్ పద్ధతిలో విత్తుకున్నప్పుడు నాట్ల పద్ధతికన్నా 7 నుంచి 10 రోజులు ముందుగా పంట కోతకు రావడమే కాకుండా 10 నుంచి 15 శాతం అధిక దిగుబడి సాధించవచ్చు.రైతుకు నారు పెంపకం, నాటడం వంటి పనుల కోసం కూలీల కొరతను అధిగమించడమేకాకుండా ఖర్చు ఆదా వల్ల ఈ పద్ధతి ద్వారా అధిక నికరాదాయం వస్తుంది. డ్రమ్‌సీడర్‌తో విత్తిన మొక్కలు వరుస క్రమంలో ఉండడం వల్ల సూర్యరశ్మి, గాలి బాగా సోకి, చీడపీడల బెడద తగ్గుతుంది. సస్యరక్షణ ఖర్చు కూడా తగ్గుతుంది.

 - డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
 ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం,  హైదరాబాద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement