'ఆప్' కు ఒక్క చాన్స్ ఇద్దామా!

'ఆప్' కు ఒక్క చాన్స్ ఇద్దామా! - Sakshi

  •  ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలన్న ఆలోచనలో యువత

  •     బాసటగా నిలుస్తామంటున్న పేదలు

  •     గెలుపు కష్టమేనని మధ్యతరగతి వర్గాల అభిప్రాయం

  •     ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడి

  • సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వైపు యువత కాస్త మొగ్గుచూపుతున్నట్లు ఆదివారం ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడైంది. ధరల పెరుగుదలపై తమ పక్షాన నిలబడి పోరాడిన ఆ పార్టీకి బాసటగా నిలుస్తామని పేదలు పేర్కొనగా మధ్యతరగతి ప్రజలు మాత్రం ‘ఆప్’ గెలుపు కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని విభిన్న ప్రాంతాలకు చెందిన స్థానికులు, ఢిల్లీలో స్థిరపడిన తెలుగువారి నుంచి ‘సాక్షి’ సేకరించిన అభిప్రాయాల ప్రకారం ఢిల్లీలో పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలతో విసుగు చెందిన ఢిల్లీవాసులు ఈసారి మార్పు కోరుకుంటున్నారు.

     

     ముఖ్యంగా విద్యుత్, నిత్యావసరాల ధరల పెరుగుదల, ‘నిర్భయ’ ఘటన నేపథ్యంలో మహిళా భద్రత, కాంగ్రెస్ నేతల అవినీతి ఆ పార్టీకి ప్రతికూలాంశాలుగా మారనున్నాయి. అయితే ఇన్నేళ్లూ ప్రజలకు ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీయే ఉండగా తాజాగా ‘ఆప్’ విధానాలు సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారిలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. సరికొత్త విధానాలతో దూసుకె ళుతున్న ఈ పార్టీ ప్రతి అడుగును అంతా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆటోవాలాలు, పేద లు కొంతమేర ఆ పార్టీవైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. సామాన్యుల కోసం పోరాడే పార్టీనే గెలిపించాలన్న వాణి వారిలో వినిపిస్తోంది. కానీ మధ్యతరగతి ప్రజల్లో మాత్రం ఆ పార్టీ గెలుపుపై అనుమానాలున్నాయి. గత 15 ఏళ్లుగా ఎంతో కొంత అభివృద్ధి పనులు చేసిన కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి రావచ్చని అభిప్రాయపడుతున్నారు.

     

     ఓట్లుగా మార్చుకోగలరా?

     ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలను ఓట్లుగా మార్చుకోవడంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత మేరకు సఫలమవుతోందన్న దానిపైనే పార్టీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కొత్త పార్టీకి మద్దతు ఇవ్వడంతో లాభం ఉండదనే అభిప్రాయం ఎగువ మధ్యతరగతితోపాటు కొన్నివర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలే ప్రత్యర్థులన్నది ఓటర్ల మనసుల్లో బలంగా నాటుకోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో రెండు పార్టీలకు ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం కార్యకర్తలు ‘ఆప్’కు లేకపోవడం ఆ పార్టీని కలవరపెట్టే అంశంగా పరిగణించవచ్చు.

     

     మా ఓటు ‘ఆప్’కే

     ఈసారి జాడూ(ఆప్ ఎన్నికల గుర్తు చీపురుకట్ట)కే ఓటు వేస్తాం. మేమంతా మీటింగ్ పెట్టుకుని మరీ ఆ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాం.

         - చిరాగ్‌గుప్తా, వ్యాపారి

     

     కాంగ్రెస్‌కు ఓటు వెయ్యం

     గత ఎన్నికల హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు. ముస్లింల్లో కాంగ్రెస్ అంటే చాలా వ్యతిరేకత వచ్చింది. మేం ఈసారి ‘ఆప్’కు ఓటు వెయ్యాలనుకుంటున్నాం.     

     - మహ్మద్ షంషేర్‌ఖాన్

     

     ‘ఆప్’కు అవకాశం ఇవ్వాలి

     కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు చూశాం. ‘ఆప్’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే వారి పనితీరు తెలుస్తుంది.

     - భాగ్యశ్రీ (తెలుగు విద్యార్థిని)

     

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top