న్యూఢిల్లీ: జయలలిత... ఇటు రాజకీయ జీవితానికి, అటు సినీ జీవితానికి సంబంధించి అందరకి తెలియని ఆసక్తికరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఆమె తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారనే విషయం అందరికి తెల్సిందేగానీ హిందీ చిత్రం హిజ్జత్‌లోనే కాకుండా చిత్ర రంగంలోకి ప్రవేశించక ముందు ఓ ఆంగ్ల లఘు చిత్రంలో నటించారన్నది ఎందరికి తెలుసు!
► మాజీ భారత రాష్ట్రపతి వీవీ గిరి కుమారుడు శ్రీ శంకర్ గిరీ 1961లో నిర్మించి, దర్శకత్వం వహించిన ‘ఎపిస్టిల్’ అనే ఆంగ్ల లఘు చిత్రంలో ఆమె నటించారు.
► వెన్నిర అదయ్ అనే తమిళ చిత్రంలో తొలిసారిగా లీడ్ రోల్‌లో ‘యువ వితంతువుగా’ నటించారు. ఆ సినిమాకు పెద్దలకు మాత్రమే అని సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల అప్పటికీ జయలలితకు 15 ఏళ్లే ఉండడం వల్ల ఆమె థియేటర్‌లో ఆ సినిమాను చూడలేకపోయారు.
► తల్లి వేదవతి (సంధ్య) బలవంతంపై చిన్న వయస్సులో సినిమా రంగంలోకి వచ్చారు. ఇజ్జత్ అనే హిందీ సినిమాలో ధర్మేంద్ర సరసన నటించారు.
► తమిళ సినిమా పాటలో స్లీవ్‌లెస్ జాకెట్ ధరించి, జలపాతంలో తడిసిన తొలితారగా రికార్డు నెలకొల్పారు.
► జయలలిత కర్ణాటకలో పుట్టినప్పటికీ కావేరీ జలాల విషయంలో కర్ణాటక ప్రజలను తీవ్రంగా విమర్శించారు. ఓ సినిమా షూటింగ్ కోసం కర్ణాటకకు వెళ్లినప్పుడు ఆమెను ప్రజలు చుట్టుముట్టి విమర్శలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించకపోవడంతో ఆమెపైకి రాళ్లు రువ్వారు. అప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
► 1981లో సినీ అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం, పెళ్లైన శోభన్ బాబును ప్రేమించడం, ఆ ప్రేమ ఫలించే అవకాశాలు లేకపోవడం వల్ల జయలలిత బాగా కంగిపోయారట. ఓసారి ఆత్మహత్య చేసుకునేందుకు కూడా ప్రయత్నించారట. ఆ సమయంలోనే ఎంజీ రామచంద్రన్ ఆమెకు ఎంతో నచ్చచెప్పి 1982లో రాజకీయాల్లోకి తీసుకొచ్చారట.
► ఆమె 85 తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించగా, వాటిలో 80 చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. తెలుగులో కేవలం 25 చిత్రాలు మాత్రమే హిట్టయ్యాయి.
► ఇంగ్లీషు నవలలు ఎక్కువ చదివేవారు. ఎక్కడికి షూటింగ్‌కు వెళ్లినా చేతిలో పుస్తకం ఉండాల్సిందే. రాజకీయాల్లోకి వచ్చాక కూడా ఆమె ఇంగ్లీషు నవలలను వదల్లేదు.
► ఆమె తమిళ భాషలో బాగా రాస్తారని పేరుంది. థాయ్ పేరుతో తమిళ పత్రికలు వ్యాసాలు రాసేవారు. ఓ నవల కూడా రాశారట.
► ఆమె తన దగ్గర తోట పనిచేసే యువకుడిని చేరదీసి ఉన్నత చదువులు చదివించారు. 2009లో వచ్చిన వార్తల ప్రకారం ఇప్పుడు పెద్దవాడైన ఆ యువకుడు ‘అమెజాన్’ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేసేవారు.
► మూడేళ్ల వయస్సులో భరత నాట్యం, ఆ తర్వాత మోహిణి హట్టం, మణిపూరి, కథక్ నత్యాల్లో శిక్షణ పొందారు.
► జయలలిత మరి పిన్న వయస్సులో మైసూర్‌లోని రెండు ఇళ్లలో ఉన్నారట. అందులో ఒకటి జయ విలాస్ కాగా, మరొకటి లలిత విలాస్ అట. ఆ రెండు కలపి జయలలితగా ఆమె తల్లి, తండ్రులు నామకరణం చేశారట.