ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ఆమోదించిన తీరును ఎండగడుతూ తృణమూల్ కాంగ్రెస్ బుధవారర రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదుచేసింది. పార్లమెంట్ నిబంధనలు
టీ బిల్లుపై రాష్ట్రపతికి తృణమూల్ కాంగ్రెస్ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును లోక్‌సభలో ఆమోదించిన తీరును ఎండగడుతూ తృణమూల్ కాంగ్రెస్ బుధవారర రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదుచేసింది. పార్లమెంట్ నిబంధనలు, ప్రక్రియలను పూర్తిగా ఉల్లంఘించి బిల్లును ఆమోదించారని పేర్కొంది. ఈ దృష్ట్యా రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టకుండా చూడాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు బుధవారం తృణమూల్ ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, ముకుల్‌రాయ్‌లతో పాటు మొత్తం 16 మంది ఎంపీలు రాష్ట్రపతిని కలిశారు. ‘మొదటగా ఈ నెల 13న లోక్‌సభ బిజినెస్, సప్లిమెంటరీ బిజినెస్ లిస్ట్‌లో పెట్టకుండానే మా నిరసనల మధ్యే హోం మంత్రి బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం ఇంత ప్రాధాన్యం ఉన్న బిల్లుపై పూర్తిస్థాయి చర్చ జరగనేలేదు. మా పార్టీ ఎంపీ సౌగతారాయ్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొన్ని సవరణలు సూచించారు. అన్ని సవరణలపై డివిజన్ చేయమని కోరాం. కానీ స్పీకర్ దీన్ని తిరస్కరించారు. బిల్లు ఆమోదం సమయంలో డివిజన్‌కు అనుమతించకుండా మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు’ అని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు.
మనోభావాలను పట్టించుకోలేదు: మమత
లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. మమత బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని భూస్వామ్య పెత్తందారీ విధానంలో పాలిస్తోందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె దుయ్యబట్టారు.