
బయటకు వెళుతున్నారా! ఇల్లు జాగ్రత్త!
బయటకు వెళుతున్నారా? అయితే మీ ఇల్లు జాగ్రత్త! ఇంటికి తాళం వేశాము కదా ఏమౌతుందిలే.. అనుకోకండి..
శంకరపట్నం(కరీంనగర్): బయటకు వెళుతున్నారా? అయితే మీ ఇల్లు జాగ్రత్త! ఇంటికి తాళం వేశాము కదా ఏమౌతుందిలే.. అనుకోకండి.. అది గమనించిన దోపిడీ దొంగలు అదను చూసుకుని పట్టపగలే దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన బుర్రా సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలసి సోమవారం ఉదయం హుస్నాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగుల గొట్టి ఇంట్లో ప్రవేశించారు.
బీరువాలో దాచిన ఆరు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని చుట్టుపక్కల వారు చూసి, సత్యనారాయణకు ఫోన్‌లో సమాచారం అందించారు. దాంతో ఆయన వచ్చి ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రవికుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, కరీంనగర్ నుంచి క్లూస్‌టీంను రప్పించారు.