
యశవంతపుర: కలబురిగి నగరంలో దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇందులో ఇద్దరు దొంగలకి గాయాలయ్యాయి. వివరాలు... మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లా తుళజాపూర్ తాలూకా ఝళకోళ గ్రామానికి చెందిన ముఠా దేవుని విగ్రహాల బండితో తిరుగుతూ డబ్బులు సేకరించేవారు. రాత్రి సమయంలో దోపిడీలు చేసేవారు.
ఇటీవల కలబురిగి నగరంలో ఇళ్లు చోరీలు అధికంగా జరుగుతున్నాయి. ప్రజలు, పోలీసులకు తలనొప్పిగా మారింది. దుండగులు పగటిపూట దేవుని బండిని ఊరంతా తిప్పి తాళం వేసిన ఇళ్లు, ధనవంతుల నివాసాలను గుర్తుంచుకునేవారు. రాత్రి కాగానే లూటీ చేస్తుండేవారు.
అర్ధరాత్రి దోపిడీకి యత్నం...
మంగళవారం అర్ధరాత్రి బిద్దాపూర కాలనీలో దోపిడి చేయటానికీ చొరబడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటాడారు. దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించడంతో సీఐ పండిత్ సాగర్, పోలీసులు కాల్పులు జరిపారు. లవ, దేవిదాస్ అనే ఇద్దరు నిందితులకు తూటాలు తగిలి కిందపడిపోయారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఒక కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు.
(చదవండి: కి‘లేడీ’లు.. క్లోజ్‌గా మాట్లాడి హానీట్రాప్ చేసి ఆ తర్వాత..)