ఏపీ, తెలంగాణల మధ్య మరో రగడ | Telangana police filed case on AP Government in EODB issue | Sakshi
Sakshi News home page

ఏపీ, తెలంగాణల మధ్య మరో రగడ

Jul 5 2016 6:15 PM | Updated on Aug 30 2019 8:24 PM

ఏపీ, తెలంగాణల మధ్య మరో రగడ - Sakshi

ఏపీ, తెలంగాణల మధ్య మరో రగడ

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)కు సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్లను ఏపీ ప్రభుత్వం కాపీ చేస్తోందని తెలంగాణ ఆరోపించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ చట్టం కింద చంద్రబాబు సర్కారుపై కేసు కూడా నమోదు చేసింది.

హైదరాబాద్: కొద్ది నెలల కిందట 'పెట్టుబడులకు అనుకూలతకు మెరుగైన చర్యలు చేపడుతోన్న రాష్ట్రాలు' పేరుతో జాతీయ స్థాయి ర్యాకులు విడుదలయ్యాయి. అందులో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కు మొదటి ర్యాంకు దక్కగా, చంద్రబాబు నాయుడి ఏలుబడిలో ఉన్న ఏపీకి రెండో ర్యాంక్ లభించింది. హైదరాబాద్ రాజధానిగా గల తెలంగాణ మాత్రం ఎక్కడో 13 ర్యాంకులో నిలిచింది. ర్యాంకుల వ్యవహారంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తర్వాత ఆ అంశం కాస్త సర్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాకుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఈ కీలక తరుణంలో ర్యాకుల వ్యవహారానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)కు సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్లను ఏపీ ప్రభుత్వం కాపీ చేస్తోందని తెలంగాణ ఆరోపించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ చట్టం కింద చంద్రబాబు సర్కారుపై కేసు కూడా నమోదు చేసింది. ఇదే విషయమై తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ర్యాంకుల కోసం ఏపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) విధానంలో ప్రతి మంత్రిత్వ శాఖ తామిచ్చే అనుమతులకు ఆన్‌లైన్ దరఖాస్తు సౌకర్యం కల్పిస్తోంది. అలా వ్యాపార, వాణిజ్య అనుమతులను సులభతరం చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ర్యాకుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ర్యాకులు మరి కొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈవోడీబీ కోసం 340 కాలమ్‌ల సమాచారాన్ని జులై 7 లోగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వస్తున్న సమాచారం ఆధారంగా కేంద్రం ఈవోడీబీ స్థానాలను మదింపు చేస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అప్ లోడ్ చేసిన ఆన్ లైన్ అప్లికేషన్లను ఏపీ ప్రభుత్వం కాపీ చేస్తోందని పరిశ్రమల శాఖకు చెందిన ముఖ్య అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement