భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ వీకే సింగ్ దాఖలు చేసిన క్షమాపణను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆయనపై చేపట్టిన కోర్టు ధిక్కార చర్యలను నిలిపివేసింది.
భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ వీకే సింగ్ దాఖలు చేసిన క్షమాపణను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆయనపై చేపట్టిన కోర్టు ధిక్కార చర్యలను నిలిపివేసింది. తన పుట్టిన తేదీ విషయంలో కోర్టు చేసిన వ్యాఖ్యల గురించి ఆయన ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంశాలను కోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకుంది. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పిన తర్వాత, తాను చేసిన వ్యాఖ్యలను వీకే సింగ్ ఉపసంహరించుకోవడంతో ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నామని, ఇక దీని గురించి ఒక్క నిమిషం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ ఆర్ఎం లోధా వ్యాఖ్యానించారు.
జనరల్ వీకే సింగ్పై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టిన ధర్మాసనానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఇతర సందర్భాల్లో జనరల్ వీకే సింగ్ ప్రస్తావించిన పలు అంశాలను లేవనెత్తేందుకు ఓ న్యాయవాది చేసిన ప్రయత్నాలను కూడా కోర్టు అనుమతించలేదు. ఇది కేవలం కోర్టుకు, జనరల్ సింగ్కు సంబంధించిన అంశం మాత్రమేనని, ఇక దీని విస్తృతిని పెంచాల్సిన అవసరం లేదని జస్టిస్ లోధా, జస్టిస్ హెచ్ఎల్ గోఖలే వ్యాఖ్యానించారు.