డీఎల్‌ఎఫ్ లాభం 132 కోట్లు

డీఎల్‌ఎఫ్ లాభం 132 కోట్లు


వ్యయాలు తగ్గడంతో పెరిగిన లాభం

 

న్యూఢిల్లీ: రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 21 శాతం వృద్ధి చెంది రూ.132 కోట్లకు పెరిగింది. అమ్మకాలు తగ్గినా, తక్కువ వ్యయాల కారణంగా నికర లాభం పెరిగిందని డీఎల్‌ఎఫ్ తెలిపింది. గత క్యూ2లో రూ.109 కోట్ల నికర లాభం వచ్చిందని పేర్కొంది. అయితే గత క్యూ2లో రూ.2,013 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం మాత్రం ఈ క్యూ2లో 7 శాతం క్షీణించి రూ.1,865 కోట్లకు తగ్గిందని వివరించింది. అలాగే మొత్తం ఆదాయం రూ.2,136 కోట్ల నుంచి 6 శాతం క్షీణించి రూ.1,997 కోట్లకు తగ్గిందని కంపెనీ సీఎఫ్‌ఓ అశోక్ త్యాగి చెప్పారు. మొత్తం వ్యయాలు రూ.1,357 కోట్ల నుంచి రూ.1,071 కోట్ల కు తగ్గాయన్నారు. వడ్డీ వ్యయాలు రూ.603 కోట్ల నుంచి రూ.706 కోట్లకు పెరిగాయని, పన్ను భారంరూ.43 కోట్ల నుంచి రూ.78 కోట్లకు పెరిగిందని  పేర్కొన్నారు.



నిధులు తగినంతగా లభ్యంకాకపోవడం, దీంతో పలు ప్రాజెక్టులు సగం సగం మాత్రమే పూర్తికావడం, వినియోగదారుల్లో కొనగోళ్ల ఆసక్తి లేకపోవడం, మౌలిక రంగ సమస్యలు, వివిధ అనుమతులు పొందడంలో జాప్యం, పెట్టుబడులపై వడ్డీ భారం.. ఈ అంశాలన్నీ రియల్టీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు. డీఎల్‌ఎఫ్‌కు 30 కోట్ల చదరపుటడుగుల ల్యాండ్ బ్యాంక్ ఉంది. దీంట్లో 5 కోట్ల చదరపుటడుగుల భూమి వివిధ ప్రాజెక్టుల కింద నిర్మాణంలో ఉంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో 1.2 శాతం వృద్ధితో రూ.120 వద్ద ముగిసింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top