తెలంగాణ పర్యాటకానికి కొత్త శోభ | New grand fame to Telangana tourism department | Sakshi
Sakshi News home page

తెలంగాణ పర్యాటకానికి కొత్త శోభ

Sep 28 2015 9:20 AM | Updated on Aug 11 2018 7:56 PM

తెలంగాణ పర్యాటకానికి కొత్త శోభ - Sakshi

తెలంగాణ పర్యాటకానికి కొత్త శోభ

తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి కొత్త శోభ తీసుకొస్తుందని సమాచార, సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

‘టూరిజం’లో మెండుగా ఉపాధి అవకాశాలు
ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి కొత్త శోభ తీసుకొస్తుందని సమాచార, సాంకేతిక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ టూరిజం సలహాదారు కేవీ రమణాచారి ఈ వేడుకలను ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో టూరిజం పెరుగుదలకు ఉన్న న్ని అవకాశాలు మరే ప్రాంతంలోనూ లేవని, ప్రతి 100 కి.మీ.ల్లో గొప్ప గొప్ప పర్యాటక స్థలాలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రాంతాలు తెలంగాణ సొంతమని చెప్పారు.
 
 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం లాంటివి అభివృద్ధిలోకి వస్తున్నాయని, ఇప్పుడు ప్రపంచ ప్రజలు ప్యాలెస్ టూరిజానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. నగరంలో ఉన్న చారిత్రక ప్యాలెస్‌లను ప్రపంచ టూరిస్టులు దర్శించేలా మన ప్రణాళికలు ఉండాలన్నారు. టూరిజం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆర్థికాభివృద్ధి పెరుగుతుందని వివరించారు. పురాతన సంపదకు ఆధునిక సాంకేతికతను జోడించి అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు. ప్రపంచంలో నంబర్ వన్ టూరిజం స్టేట్‌గా తెలంగాణను తీర్చిదిద్ది మన సత్తా చాటుదామన్నారు. పర్యాటకులు ప్రధాన ప్రాంతాల్లోని కేంద్రాల్లోకి వెళ్లి టచ్ స్క్రీన్ కియోస్క్ నొక్కితే పర్యాటకానికి సంబంధించిన కీలక సమాచారం, చరిత్ర లభ్యమవుతుందని చెప్పారు.
 
 కేవీ రమణాచారి మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో మనకున్న పురాతన చరిత్ర, కట్టడాలకు విస్తృత ప్రచారం తీసుకువచ్చి పర్యాటకులను ఆకర్షిద్దామని చెప్పారు. ఈ సందర్భంగా పర్యాటక సమాచారం తెలిపే టచ్ స్క్రీన్ కియోస్క్‌ను ప్రారంభించారు. మ్యూజియం వివరాలు తెలిపే మొబైల్ ఆప్లికేషన్, పర్యాటక సమాచారం, టూరిజం ప్యాకేజీలకు సంబంధించిన బ్రోచర్లను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం టూరిజం అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్‌టీడీసీ ఎండీ క్రిస్టీనా జడ్ ఛోంగ్తు, టూరిజం శాఖ డెరైక్టర్ సునీత ఎం భగవత్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement