‘నారాయణ’ విద్యార్థినుల మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు | 'Narayana' inquiry committee on the lives of students | Sakshi
Sakshi News home page

‘నారాయణ’ విద్యార్థినుల మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు

Aug 19 2015 1:13 AM | Updated on Nov 9 2018 4:10 PM

‘నారాయణ’ విద్యార్థినుల మృతిపై   విచారణ కమిటీ ఏర్పాటు - Sakshi

‘నారాయణ’ విద్యార్థినుల మృతిపై విచారణ కమిటీ ఏర్పాటు

కడప సమీపంలోని సీకే దిన్నెలో నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై ...

మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టీకరణ
 
హైదరాబాద్: కడప సమీపంలోని సీకే దిన్నెలో నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటనపై ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఇంటర్మీడియెట్ బోర్డులోని పరీక్షల నియంత్రణాధికారి మాణిక్యం, పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, వైఎస్సార్ జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.సులోచనను కమిటీ సభ్యులుగా నియమించామన్నారు. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని  గడువు విధించామని చెప్పారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. సీకే దిన్నె నారాయణ కాలేజీలో చదువుతున్న నందిని(16), మనీషా(16) సోమవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.  కాలేజీ నారాయణదైనా, ఇంకెవరిదైనా  ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

డీఎస్సీ లోపాల బాధ్యులపై కఠిన చర్యలు
డీఎస్సీ-2014లో చోటుచేసుకున్న లోపాలకు బాధ్యులైనవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. డీఎస్సీ నిర్వహణలో తప్పులు దొర్లాయని, ఇప్పటికీ ‘కీ’లో మరో పది తప్పులున్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైనల్ ‘కీ’ రెండుసార్లు ఇచ్చాక కూడా ఇంకా తప్పులున్నాయంటే వారి బాధ్యతారాహిత్యం స్పష్టమవుతోందన్నారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు, కామన్ యూనివర్సిటీల చట్టంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా తెలిపారు. తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో విద్యా నగరాల కోసం స్థలాలను ఎంపిక చేయాల్సి ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement