పొలాస స్టుడెంట్స్‌ అదుర్స్‌.. | Sakshi
Sakshi News home page

పొలాస స్టుడెంట్స్‌ అదుర్స్‌..

Published Mon, Feb 3 2020 10:34 AM

Students Of Karimnagar Showing Talent In All Areas - Sakshi

సాక్షి, జగిత్యాల: వ్యవసాయ విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీల్లో జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరుస్తూ ‘పొలాస’ విద్యార్థులు ముందుకు సాగుతున్నారు. ఇక్కడ నాలుగేళ్ల బీఎస్సీ అగ్రికల్చర్‌ విద్యార్థులు ఏ క్రీడా పోటీల్లో పాల్గొన్నా ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌లతో పాటు వ్యక్తిగత బహుమతులు గెలుచుకుంటూ రాష్ట్రంలోని మిగతా వ్యవసాయ కళాశాలలకు సవాల్‌ విసురుతున్నారు. ఇటీవల జనవరి 19 నుంచి 24 వరకు హైద్రాబాద్‌లో నిర్వహించిన వ్యవసాయ వర్సిటీ రాష్ట్రస్థాయి క్రీడా సాంస్కృతిక పోటీల్లో 20 విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకొని, ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ సాధించారు.

కళాశాల ప్రాంగణంలోనే ఆటస్థలం
సాధారణంగా ప్రొఫెషనల్‌ కోర్సు విద్యార్థులు ఆటలంటే పెద్దగా ఆసక్తి చూపరు. కానీ వీరిని ఆటల వైపు తీసుకువచ్చి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున జరిగే అన్ని ఆటల పోటీల్లో బహుమతులు గెలుచుకోవడంలో కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఉదయం, సాయంత్రం విద్యార్థులు హాస్టళ్లలో సమయాన్ని వృథా చేయకుండా ఉండేందుకు వారిని గ్రౌండ్‌కు తీసుకొస్తున్నారు.

కళాశాల ప్రాంగణంలోనే ఆట స్థలం ఏర్పాటు చేసి, పలు క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఇప్పటివరకు బాల్‌ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, షటిల్, టేబుల్‌ టెన్నిస్, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో రన్నింగ్, లాంగ్‌జంప్, డిస్కస్‌ త్రో, హై జంప్, షాట్‌పుట్‌ తదితర ఆటల్లో విద్యార్థినీ, విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ కూడా సాధించారు. అశోక్‌కుమార్‌ అనే విద్యార్థి అథ్లెటిక్స్‌లో వ్యక్తిగతంగా ఓవరాల్‌ చాంపియన్‌ షిప్‌ సాధించాడు.

సాంస్కృతిక పోటీల్లోనూ సత్తా
ఒక్క క్రీడా పోటీల్లోనే కాకుండా, సాంస్కృతిక కార్యక్రమాల్లో సైతం తమ సత్తా చాటుతూ బహుమతులు సాధిస్తున్నారు. రంగోళి, కార్టూన్‌ మేకింగ్, స్పాట్‌ పెయింటింగ్, పోస్టర్‌ మేకింగ్‌ విభాగాల్లో శ్రావణి అనే విద్యార్థిని అనేక బహుమతులు గెలుచుకుంది. పలువరు విద్యార్థులు సోలో క్లాసికల్‌ డ్యాన్స్, క్విజ్, తెలుగు ఉపన్యాసం, ఇంగ్లిష్‌ ఉపన్యాసం విభాగాల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. విద్యార్థిని మానస రెడ్డి మార్షల్‌ ఆర్ట్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది.

జాతీయస్థాయిలో విజయాలు
జాతీయ స్థాయి పోటీల్లో సైతం ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2011లో మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీల్లో రాజశేఖర్‌ ప్రథమ, అథ్లెటిక్స్‌లో మహేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. 2009లో మహారాష్ట్రలోని పర్భనిలో నిర్వహించిన జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీల్లో రాజు, రవీందర్‌లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. నీలకంఠ రాజరుషి 10 క్రీడా విభాగాల్లో సత్తా చాటి, రాష్ట్రస్థాయిలో అథ్లెటిక్స్‌ చాంపియన్‌గా నిలిచి, జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి క్విజ్‌లో ఏఎస్‌.అభిరామ్‌ సిల్వర్‌ మెడల్‌ గెలుచుకున్నాడు.

ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించారు
ఇటీవల హైద్రాబాద్‌లో జరిగిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో బాలికల విభాగంలో మా విద్యార్థినులు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించారు. అథ్లెటిక్స్‌లో, సాంస్కృతిక పోటీల్లో చాలామంది సత్తా చాటారు. వారు జాతీయ స్థాయిలోనూ రాణిస్తారన్న నమ్మకం ఉంది.
– డాక్టర్‌ కేబీ.సునీతాదేవి, అసోసియేట్‌ డీన్, పొలాస 

Advertisement
 
Advertisement