రాజధాని పొలాల్లో రైతులు సాగు చేసుకోవచ్చు | Sakshi
Sakshi News home page

రాజధాని పొలాల్లో రైతులు సాగు చేసుకోవచ్చు

Published Mon, Jul 13 2015 9:09 AM

రాజధాని పొలాల్లో రైతులు సాగు చేసుకోవచ్చు - Sakshi

మంగళగిరి: పంటపొలాల్లో సాగును ఆపే హక్కు ప్రభుత్వానికి లేదని, రైతులు నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నిడమర్రు గ్రామంలో ఆదివారం ఆయన రైతులతో కలసి పొలాల్లో సాగు ప్రారంభించారు. ట్రాక్టర్‌తో దుక్కి దున్ని విత్తనాలు చల్లి, పొలానికి నీరు పెట్టారు. ఈ సందర్బంగా ఆర్కే మాట్లాడుతూ సాగు లేకపోతే రైతులు, కౌలు రైతులు, రైతుకూలీలు, చేతివృత్తిదారులు ఏవిధంగా బతుకుతారని ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరిగేవరకు పోరాడతామని చెప్పారు.

ప్రభుత్వం రైతులను మోసం చేయాలని చూస్తే సీఆర్‌డీఏ కార్యాలయంపై దాడులు తప్పవని హెచ్చరించారు. అంతకుముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో గ్రామంలోని సీఆర్‌డీఏ కార్యాలయం ముందు మెరుపు ధర్నా నిర్వహించారు. బలవంతపు భూ సేకరణపై అఖిలపక్షం నాయకులు విరుచుకుపడ్డారు. రైతులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేసి భూములను కాపాడుకుంటామని చెప్పారు. ప్రభుత్వం మొండి వైఖరితో, రైతులపట్ల ద్వేషంతో వ్యవహరిస్తోందని విమర్శించారు.

ధర్నాలో సీఆర్‌డీఏ పోరాటకమిటీ కన్వీనర్ బాబురావు, నాయకుడు రాధాకృష్ణ, ఎంపీపీ రత్నకుమారి, సర్పంచ్ మండేపూడి మణెమ్మ, ఎంపీటీసీ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొదమగొండ్ల నాగరత్నం, పంటపొలాల్లో రాజధాని నిర్మాణ వ్యతిరేక కమిటీ కో కన్వీనర్ బి.కొండారెడ్డి, వ్యవసాయ కార్మికసంఘ నాయకులు ఎం.రవి, రాధాకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement