ద్రవ్య పరపతి విధాన సమీక్షకు సంబంధించి ద్రవ్యోల్బణ కట్టడే కాకుండా వృద్ధి, ఉపాధి కల్పనపైనా దృష్టి సారించాలని రిజర్వ్ బ్యాంక్‌కు ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచించారు.
న్యూఢిల్లీ: ద్రవ్య పరపతి విధాన సమీక్షకు సంబంధించి ద్రవ్యోల్బణ కట్టడే కాకుండా వృద్ధి, ఉపాధి కల్పనపైనా దృష్టి సారించాలని రిజర్వ్ బ్యాంక్‌కు ఆర్థిక మంత్రి పి. చిదంబరం సూచించారు. ఆర్‌బీఐకి ఉన్న వివిధ బాధ్యతల్లో ధరల స్థిరీకరణ ఒకానొక భాగం మాత్రమేనని ఆయన చెప్పారు. అన్నింటికన్నా పెద్ద బాధ్యత వృద్ధి, ఉపాధి కల్పనకు తోడ్పడటమేనని చిదంబరం వివరించారు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితులపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా ఫెడరల్ రిజర్వ్‌కి రాబోయే కొత్త చైర్మన్ బాధ్యతల గురించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పిన మాటలను చిదంబరం ప్రస్తావించారు.
కొత్త ఫెడ్ చైర్మన్ ఇటు ధరల స్థిరీకరణ, అటు ఉపాధికల్పన లక్ష్యంగా పనిచే యాలని ఒబామా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ కట్టడితో పాటు ఉపాధి కల్పన, వృద్ధిపైనా బాధ్యత ఉందన్న సంగతి ఆర్‌బీఐ గుర్తెరిగేలా స్పష్టమైన సంకేతం పంపాలని, దీనిపై పార్లమెంటు ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉంద న్నారు. రూపాయి స్థిరపడే దిశగా కరెంటు అకౌంటు లోటు(క్యాడ్) తగ్గించేందుకు, ద్రవ్య స్థిరీకరణకు చర్యలు చేపడుతున్నట్లు చిదంబరం చెప్పారు.


