ఆంధ్రా ప్రాంతానికి 100 టీఎంసీల కోత


* పోలవరం ప్రాజెక్టు కేటాయింపుల్లో 62.32 టీఎంసీలు కట్

* గోదావరి డెల్టా ఆయకట్టు నీటిలో మరో 42 టీఎంసీలు కూడా

* మొత్తం 104 టీఎంసీలను భూగర్భం నుంచి తీసుకోవాలట

* జీవోఎంకు కిరణ్ సర్కారు అధికారిక నివేదిక

* ఈ లెక్కన లక్షలాది ఎకరాలకు బోర్లు, బావులే గతి

* అది సాధ్యమయ్యేపనికాదంటూ ఆంధ్రా ఇంజనీర్ల ఆందోళన

* దిగువ ప్రాంతం, డెల్టా ఎడారిగా మారుతుందంటూ ఆగ్రహం

 
* గోదావరి నీటి పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటుకు డిమాండ్

 * గోదావరి జలాల కోతతో కృష్ణా బేసిన్‌పైనా తీవ్ర ప్రభావం


 

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనతో నదీ జలాల సమస్య వస్తుందంటూ పటాలు చూపి మరీ పాఠాలు చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్టు, గోదావరి డెల్టా ఆయకట్టు రైతుల గొంతు నులిమే చర్యకు పూనుకుంది. ఆంధ్రా ప్రాంతానికి అధికారికంగా ఉన్న నీటి కేటాయింపుల్లో భారీగా కోత విధిస్తూ కేంద్రానికి ప్రత్యేక నివేదికల్ని పంపించింది. పోలవరం, గోదావరి డెల్టా ఆయకట్టుకు కేటాయించిన నీటిలో 100 టీఎంసీలకు పైగా నీటికి కోత పెట్టి.. ఆ మేరకు నీటిని భూగర్భం నుంచి తోడుకుని వాడుకోవాలని వింత నిబంధనను ప్రవేశపెట్టింది. ఇలా కోత పెట్టిన 100 టీఎంసీల గోదావరి నీటిని ఎగువలో ఉన్న తెలంగాణ ప్రాంతానికి కేటాయించింది.


 


ఇందుకు సంబంధించిన అధికారిక నివేదికను.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై  కేంద్రం నియమించిన మంత్రుల కమిటీ (జీవోఎం)కి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఎక్కడా లేనటువంటి ఈ విచిత్ర నిబంధనలు.. పోలవరం, గోదావరి డెల్టా రైతులపైనే కాకుండా కృష్ణా బేసిన్‌పై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. దాదాపు 100 టీఎంసీలకు పైగా నీటిని భూగర్భ జలాల నుంచి తోడుకుని వాడుకోవటమనేది అసాధ్యమైన విషయం. (ఇది మూడు, నాలుగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులతో సమానం.) అంటే ఆ మేరకు నీరందక లక్షల ఎకరాల్లో పంట భూములు బీళ్లుగా మారనున్నాయి. గోదావరి జలాల కేటాయింపులకు సర్కారు వారు వేసిన ఈ ‘కోత’ విషయం తెలిసి ఆంధ్రా ప్రాంత ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఇలా నివేదికను రూపొందించడం భావ్యం కాదంటున్నారు. దీనిని సరిదిద్దడానికి గోదావరి నీటి పంపకంపై ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 గోదారి జలాల కేటాయింపు ఇదీ...

 గోదావరి నదిలో సుమారు 3,000 టీఎంసీల నీరు ఉన్నట్టు ట్రిబ్యునల్ గుర్తించింది. ఇందులో ఎక్కువ భాగం.. అంటే 1,486 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అలాగే మహారాష్ట్రకు 890 టీఎంసీలు, చత్తీస్‌గడ్‌కు 385 టీఎంసీలు, ఒరిస్సాకు 292 టీఎంసీలు, మధ్యప్రదేశ్‌కు 240 టీఎంసీలు, కర్ణాటకకు సుమారు 20 టీఎంసీల చొప్పున కేటాయిచారు. (సుమారు 313 రీ-జనరేషన్ నీటితో కలిపి.) మన రాష్ట్రానికి కేటాయించిన 1,486 టీఎంసీల నీటిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల కోసం 691 టీఎంసీలు, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టుల అవసరాల కోసం 660 టీఎంసీలు, ప్రణాళికలో ఉన్న ప్రాజెక్టుల అవసరం కోసం మరో 70 టీఎంసీలను కేటాయించారు. సుమారు మరో 64 టీఎంసీల నీటిని ఆవిరి నష్టం కింద చూపించారు. రాష్ట్రానికి సంబంధించి నీటి కేటాయింపులను ప్రాంతాల వారిగా చేయలేదు. ఆయా ప్రాజెక్టుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ పంపకాలపై ఒక అంచనాకు వచ్చారు.

 

 అసలు చిక్కు ఇక్కడే...

 ఆంధ్రా ప్రాంతానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు 302 టీఎంసీలు, గోదావరి డెల్టా అవసరాల కోసం 266 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన నివేదికలో మాత్రం వీటికి నీటి కేటాయింపుల్లో భారీగా కోత విధించింది. పోలవరం ప్రాజెక్టు కేటాయింపుల్లో సుమారు 62.32 టీఎంసీలను భూ గర్భ నీటి నుంచి ఉపయోగించుకోవాలని పేర్కొంది. అలాగే గోదావరి డెల్టాకు అవసరమయ్యే నీటిలో 42 టీఎంసీల నీటిని భూ గర్భ నీటి నుంచి వాడుకోవాలని నివేదికలను రూపొందించింది. అంటే.. పోలవరం, గోదావరి డెల్టా కేటాయింపుల్లో 104.32 టీఎంసీల నీటికి కోతపెట్టింది. ఇలా దిగువ ప్రాంతానికి కోత పెట్టిన నేటిని ఎగువ ప్రాంతంలోని నిజాంసాగర్, ఎల్లంపల్లి, ఇచ్చంపల్లి ప్రాజెక్టులకు అదనంగా కే టాయించింది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు 28 టీఎంసీల కేటాయింపు ఉండగా దానిని 58 టీఎంసీలకు పెంచారు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మరో 30 టీఎంసీలను అదనంగా కేటాయించారు. వీటితో పాటు.. ఎగువ రాష్ట్రాల అభ్యంతరాల నేపధ్యంలో అమలు సాధ్యం కాదని చెప్తున్న ఇచ్చంపల్లి ప్రాజెక్టుకూ 35 టీఎంసీలను కేటాయించారు.


 


ఈ మేరకు అధికారులు రూపొందించిన నివేదికను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రుల బృందానికి పంపించారు. దిగువ ప్రాంతానికి తగ్గించిన 104.32 టీఎంసీల నీటికి సంబంధించిన అవసరాలను భూ గర్భ నీటి నుంచి తీర్చుకోవాలని ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది. అంటే.. పోలవరం దిగువన రైతులు, గోదావరి డెల్టా ప్రాంతంలో రైతులు తమ నీటి అవసరాల కోసం బోర్లు, బావులు ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలను తోడుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 100 టీఎంసీలకు పైగా నీటిని భూగర్భం నుంచి తోడుకోవటమనేది అసలు సాధ్యమయ్యే పని కాదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గోదావరి జలాల్లో కోత ఫలితంగా పోలవరం దిగువున, గోదావరి డెల్టా ఎడారిగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

 

 ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలి: ఆంద్రా ప్రాంత ఇంజనీర్లు


 గోదావరి జలాల కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా నివేదికను రూపొందించిందని ఆంధ్రా ప్రాంత రిటైర్ట్ ఇంజనీర్లు విమర్శిస్తున్నారు. ఆంధ్రా ప్రాంతానికి నీటి కోటాను తగ్గించి, మిగిలిన  నీటి మొత్తాన్ని తెలంగాణ ప్రాంతానికి చెందుతాయనే విధంగా నివేదికను రూపొందించిందని.. దీనిని తాము అంగీకరించేది లేదని వారు స్పష్టంచేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ వారు ప్రత్యేక నివేదికను కేంద్ర మంత్రుల బృందానికి సమర్పించారు. గోదావరి నీటి పంపకానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని అందులో కేంద్రాన్ని కోరారు. లేని పక్షంలో ఆంధ్రా ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

 

 కృష్ణా బేసిన్‌పై ప్రభావం...

 గోదావరి నీటి నుంచి ఆంధ్రా ప్రాంతానికి కోత విధించటం.. కృష్ణా బేసిన్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి నుంచి 80 టీఎంసీలను కృష్ణా బేసిన్‌లోకి తరలించటానికి వీలుంటుంది. ఇందులో 45 టీఎంసీలను మన రాష్ట్ర అవసరాలకు, కర్ణాటకకు 21 టీఎంసీలు, మహారాష్ట్రకు 14 టీఎంసీలను ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంది. మన రాష్ట్రానికి వచ్చే 45 టీఎంసీల నుంచి మహాబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలతో పాటు కరువును ఎదుర్కొంటున్న రాయలసీమ ప్రాంత ప్రాజెక్టుల అవసరాల ను తీర్చడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎంఆర్‌పీ, హంద్రీ - నీవా, గాలేరు - నగరి, తెలుగు గంగ, వెలిగొండ వంటి ప్రాజెక్టులకు నికర జల కేటాయింపు లేదు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా వరద నీటిపై ఆధారపడ్డవి. పోలవరం నుంచి కృష్ణాకు తరలించే నీటిలో మన రాష్ట్ర వాటా అయిన 45 టీఎంసీల నుంచి ఈ ప్రాజెక్టులకు కొంత మేర కేటాయింపులు చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు 62 టీఎంసీల నీటిని తగ్గించటం వల్ల.. కృష్ణాకు తరలించే నీటిలోనూ భారీగా కోతపడే అవకాశముంది. ఫలితంగా కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు మృగ్యమయ్యే దుస్థితి దాపురించే ప్రమాదముంది.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top