 
													పోలవరం ఎడమ కాలువ 5, 5ఏ ప్యాకేజీల్లో మిగిలిన పనుల అంచనా వ్యయం పెంపు
4.68 శాతం అధిక ధరతో కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు అప్పగింత
ఆ కాంట్రాక్టు సంస్థ యజమాని ఈనాడు రామోజీ కుమారుని వియ్యంకుడు
పెంచిన మొత్తంలో నీకింత–నాకింత అంటూ పచ్చ ముఠా పంపకాలని ఆరోపణలు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 5, 5ఏ ప్యాకేజీల్లో 2019 అక్టోబర్ 3 నాటికి మిగిలిన రూ.81.63 కోట్ల విలువైన పని అంచనా వ్యయాన్ని కూటమి ప్రభుత్వం రూ.293.66 కోట్లకు పెంచేసింది. వాటిని 4.68 శాతం అధిక ధరలకు అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’ కు గతేడాది అక్టోబర్ 17న కట్టబెట్టింది. అంటే.. మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్లు (277% అధికం) అంచనాలను పెంచేసినట్లు స్పష్టమవుతోంది.
ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్.. ఈనాడు రామోజీరావు కుమారుడి వియ్యంకుడు రాయల రఘుకు చెందినది కావడం గమనార్హం. పెంచిన అంచనా వ్యయాన్ని నీకింత నాకింత అంటూ పచ్చ ముఠా పంచుకు తింటోందని సాగు నీటి రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా 2019 ఏప్రిల్ 1న రాజమహేంద్రవరం బహిరంగ సభ వేదికగా కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ‘ఏటీఎం’గా మార్చుకున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలను గుర్తు చేస్తున్నారు.
నేడు రామోజీ కుమారుడి వియ్యంకుడికి నజరానా 
పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ 2019 అక్టోబరు 3 నాటికి రూ.117.05 కోట్ల విలువైన పనులు పూర్తి చేసింది. మరో రూ.64.816 కోట్ల విలువైన పనులు మిగిలాయి. పుట్టా సంస్థకు నామినేషన్ పద్ధతిలో అప్పగించిన పనులను రద్దు చేసి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ చేసిన సూచన మేరకు ఆ సంస్థ నుంచి ఆ పనులను తప్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2019 అక్టోబరు 3 నాటికి 5ఏ ప్యాకేజీ కింద రూ.64.816 కోట్లు, ఐదో ప్యాకేజీ కింద రూ.16.82 కోట్లు వెరసి ఆ రెండు ప్యాకేజీల్లో రూ.81.636 కోట్ల విలువైన పని మిగిలినట్లు స్పష్టమవుతోంది. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.293.66 కోట్లకు పెంచి.. ఏడాదిలోగా పూర్తి చేయాలనే నిబంధనతో గతేడాది అక్టోబర్ 17న ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 2019 నాటికి.. నేటికీ డీజిల్, స్టీలు, పెట్రోల్, సిమెంటు వంటి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. అయినా సరే అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసినట్లు స్పష్టమవుతోంది.
ఇక టెండర్లలో 4.68 శాతం అధిక ధరకు రూ.307.41 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్‌కు ప్రభుత్వం అప్పగించింది. అంటే మిగిలిన పని అంచనా వ్యయం కంటే రూ.225.78 కోట్ల మేర అంచనాను పెంచి ఆ సంస్థకు అప్పగించినట్లు స్పష్టమవుతోంది. తద్వారా రామోజీ కుమారుడి వియ్యంకుడికి చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా ఇచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు అంటున్నారు.. ఇక పనులు దక్కించుకుని దాదాపు ఏడాది గడిచినా ఇప్పటిదాకా ఆ సంస్థ 50 శాతం పనులు మాత్రమే పూర్తి చేయడం గమనార్హం.
నాడు పుట్టాకు నామినేషన్‌పై రూ.142.88 కోట్ల పనులు  
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ (93.7 కి.మీ నుంచి 111 కి.మీ వరకు) పనులను 2005 మార్చి 23న రూ.181.60 కోట్లతో పూర్తి చేసేలా సాబీర్ డ్యాం అండ్ వాటర్ వర్క్స్ సంస్థ దక్కించుకుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెపె్టంబరు 8న రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. 
ఆ తర్వాత రెండున్నర నెలలు తిరగక ముందే అంటే 2016 నవంబర్ 30న ఐదో ప్యాకేజీలో 5.74 కి.మీల కాలువ తవ్వకం.. 11.001 కి.మీ పొడవున లైనింగ్.. 33 కాంక్రీట్ కట్టడాల నిర్మాణాలను ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద తొలగించి.. వాటిని 5ఏ ప్యాకేజీ కింద విభజించి, అంచనా వ్యయాన్ని రూ.142.88 కోట్లుగా లెక్కగట్టి నాటి ఆర్థిక మంత్రి యనమల వియ్యకుండు, ప్రస్తుత మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన పీఎస్‌కే–హెచ్‌ఈఎస్(జేవీ) సంస్థకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టేశారు.
ఆ పనుల్లో 100.3 కి.మీ నుంచి 102.5 కి.మీ వరకు, 110.5 కి.మీ నుంచి 111.487 కి.మీ వరకు కఠిన శిల (హార్డ్ రాక్)తో కూడిన భూమిని బ్లాస్టింగ్ చేసి తవ్వాలని.. అందుకు 3,77,938 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాల్సి వస్తుందని.. క్యూబిక్ మీటర్‌కు రూ.29.21 చొప్పున రూ.1.11 కోట్లు అదనంగా చెల్లించాలని 2018 మే 22న చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంక్రీట్ నిర్మాణాల్లో మార్పుల వల్ల అదనంగా రూ.38.986 కోట్లు చెల్లించాలని 2018 జూలై 10న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు పీఎస్‌కే–హెచ్‌ఈఎస్ సంస్థతో పోలవరం అధికారులు సప్లిమెంటరీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. దీంతో.. ఆ సంస్థకు రూ.181.866 కోట్ల విలువైన పని అప్పగించినట్లైంది. అప్పటికి ఐదో ప్యాకేజీలో కాంట్రాక్టర్ సాబీర్ డ్యాం అండ్ వాటర్ వర్క్స్ సంస్థకు రూ.16.82 కోట్ల పని మిగిలింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
