రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను నిలదీసిన పీపీఏ సీఈవో అతుల్ జైన్
తక్షణమే రూ.1,077.47 కోట్ల అడ్వాన్సు నిధులు ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయాలని ఆదేశం
నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకపోవడంపై అసహనం
2027 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందేనని స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: ‘పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. ఆర్థిక సమస్యలు ఉత్పన్నం కాకుండా సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి అడ్వాన్సుగా రూ.5052.71 కోట్లు విడుదల చేసింది. కానీ.. ఆ నిధులను ఎస్‌ఎన్‌ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) ఖాతాలో జమ చేయకుండా, ఇతర అవసరాలకు మళ్లిస్తే గడువులోగా ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది?’ అంటూ రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులను పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ అతుల్ జైన్ నిలదీశారు. నేటికీ ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయని రూ.1,077.47 కోట్లను తక్షణమే జమ చేయాలని ఆదేశించారు.
నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిందేనంటూ, ఆలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సిందేనని తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లోని పీపీఏ కార్యాలయంలో శుక్రవారం సీఈవో అతుల్ జైన్ అధ్యక్షతన పీపీఏ 17వ సమావేశం జరిగింది. ప్రాజెక్టు పనుల పురోగతిపై పీపీఏ సభ్య కార్యదర్శి రఘురాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రం వాల్ (డీ వాల్) పనులు నిర్దేశించిన లక్ష్యం కంటే ఆలస్యంగా జరుగుతున్నాయన్నారు. డీ వాల్ పనులను జూన్ నాటికి పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థ చెబుతోందన్నారు. దీనిపై సీఈవో అతుల్ జైన్ స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లో డీ వాల్ పనులు మార్చి నాటికే పూర్తి చేయాలని తేల్చి చెప్పారు. విదేశీ నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రధాన డ్యాం గ్యాప్–1 నిర్మాణ పనుల్లో ప్రాథమిక పనులు చేస్తున్నామని.. గ్యాప్–2లో డీ వాల్ పూర్తయిన చోట్ల ప్రధాన డ్యాం ప్రాథమిక పనులు చేస్తున్నామని ఏపీ ఈఎన్‌సీ నరసింహమూర్తి వివరించారు.
ఎడమ కాలువ పనులు.. కుడి, ఎడమ కాలువ అనుసంధానం పనులు కొలిక్కి వస్తున్నాయన్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను పీపీఏకు వివరించారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో 14,371 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించామని.. ఇంకా 23,689 కుటుంబాలకు కల్పించాల్సి ఉందని ఆర్‌ఆర్ కమిషనర్ ప్రశాంతి వివరించారు.
ఒక్క ఇల్లు కూడా పూర్తి కాలేదా?
» 2024 నుంచి ఇప్పటి వరకు పునరావాస కాలనీల్లో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయక పోవడంపై పీపీఏ సీఈవో అతుల్ జైన్‌ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పునరావాస కాలనీల్లో ఇళ్లు, మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల టెండర్లు రద్దు చేసి.. కొత్తగా ఇటీవల టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించామని, 2027 డిసెంబర్‌లోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు పూర్తి చేస్తామని ఆర్‌ఆర్ కమిషనర్ ప్రశాంతి చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పీపీఏ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య జరగాల్సిన ఒప్పందం(ఎంవోయూ)పై తక్షణమే ఆమోదించాలని కోరారు.
» పీపీఏ కార్యాలయాన్ని ఒకే దశలో రాజమహేంద్రవరానికి తరలించాలని.. తద్వారా ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అవకాశం ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ సంయుక్త కార్యదర్శి గౌరవ్ ఆదేశించారు.
» బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల తెలంగాణలోని భూ భాగం ముంపునకు గురయ్యే విషయమై సంయుక్త సర్వే చేయాలని తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కోరారు. ప్రాజెక్టులో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేస్తున్న నేపథ్యంలో ముంపు సమస్య ఉత్పన్నం కాదని పీపీఏ సీఈవో అతుల్ జైన్ స్పష్టం చేశారు. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు గురించి ప్రస్తావించగా, అది అంతర్రాష్ట్ర వివాదమని.. దానిపై మరో వేదికలో చర్చించాలని సూచించారు.
» పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం విడుదల చేసిన నిధుల్లో 2023–24, 2024–25 వ్యయంపై ఆడిట్ చేస్తున్నారని.. పూర్తవ్వగానే నివేదిక అందజేస్తామని ఏపీ ఈఎన్‌సీ నరసింహమూర్తి చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో నావిగేషన్ టన్నెల్‌ను క్లాస్–3 ప్రమాణాలతో పూర్తి చేయడానికి నిధులు కేంద్రం ఇస్తుందా? లేక ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ) ఇస్తుందా? చెప్పాలని కోరారు. ఈ అంశంపై ఐడబ్ల్యూఏఐతో సమావేశం నిర్వహించి స్పష్టత ఇస్తామని పీపీఏ సీఈవో అతుల్ జైన్ తెలిపారు.


