
తొలిరోజే టీ బిల్లు పెట్టాలి: కిషన్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం ఎన్ని మీటింగ్‌లు పెట్టినా పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే తెలంగాణ బిల్లును పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎన్ని మీటింగ్‌లు పెట్టినా పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే తెలంగాణ బిల్లును పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం ఇంకా అందలేని, అది అందాక పార్టీలో చర్చించి వెళ్లేదీ లేనిదీ నిర్ణయిస్తామని చెప్పారు. అయితే మరోసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించినా తమ వైఖరిలో ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 138వ జయంతి సందర్భంగా గురువారమిక్కడ అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నేతలు జి.కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ, నల్లు ఇంద్రసేనారెడ్డి, బద్దం బాల్‌రెడ్డి, కె.వెంకటరెడ్డి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.
దానం ‘దాదాగిరి’
పటేల్ విగ్రహానికి నివాళులర్పించే సందర్భంగా మంత్రి దానం నాగేందర్ బీజేపీ నేత బండారు దత్తాత్రేయపై దాదాగిరి చేసి.. చేతినుంచి మైకులాక్కొని వెళ్లిపోయారు. పుష్పాంజలి ఘటించాక దత్తాత్రేయ మైకులో మాట్లాడుతుండగా మంత్రి దానం నాగేందర్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు అక్కడికి వచ్చారు. దత్తాత్రేయ వారిని ఆహ్వానిస్తుండగా బీజేపీ కార్యకర్తలు ‘జై జై మాతా, భారత్ మాతా’ అంటూ నినదించారు. దీంతో దానం ఏమనుకున్నారో ఏమో.. దత్తాత్రేయ చేతిలో నుంచి మైకు లాక్కుని.. ‘జై కాంగ్రెస్, జై సోనియా, జై జై పటేల్’ అంటూ తన అనుచరులతో నినాదాలు చేయించారు. అంతటితో ఆగక మైకుకుండే కేబుల్ వైరును తీసేసి మౌత్‌పీస్‌ను తీసుకుని వెళ్లిపోయారు. కొద్దిదూరం వెళ్లాక గడ్డిలో విసిరేశారు. దాన్ని ఆయన అనుచరుడొకరు జేబులో పెట్టుకుని వెళ్లిపోవడంతో బీజేపీ నేతలు బిత్తరపోయారు.