ముంబైలో చిక్కిన ‘ఎన్నారై అత్త’ | Harassment in Switzerland on hyderabad woman | Sakshi
Sakshi News home page

ముంబైలో చిక్కిన ‘ఎన్నారై అత్త’

Mar 18 2017 4:48 AM | Updated on Oct 19 2018 7:52 PM

ముంబైలో చిక్కిన ‘ఎన్నారై అత్త’ - Sakshi

ముంబైలో చిక్కిన ‘ఎన్నారై అత్త’

కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించి విదేశాలకు పారిపోవాలని చూసిన వరకట్న వేధింపుల నిందితురాలిని శుక్రవారం ముంబైలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నగర యువతిపై స్విట్జర్లాండ్‌లో వేధింపులు

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు ఉత్తర్వుల్ని ధిక్కరించి విదేశాలకు పారిపోవాలని చూసిన వరకట్న వేధింపుల నిందితురాలిని శుక్రవారం ముంబైలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్‌ అధీనంలోని మహిళా ఠాణా అధికారులు జారీ చేసిన ఎల్‌ఓసీ ఆధారంగా అంతర్జాతీయ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఈమెను పట్టుకుంది. నగరానికి చెందిన భవ్యకీర్తికి స్విట్జర్లాండ్‌లో నివసించే వై.ఆదిత్యతో వివాహమైంది. కాపురం చేయడానికి అక్కడకు వెళ్లిన కీర్తిని భర్త, అత్తమామలు జానకి, రవిశేఖర్‌ ఓ గదిలో నిర్భంధించి అమానుషంగా వేధించారు. దీంతో బాధితురాలి కుటుంబీకులు రాష్ట్ర పోలీసు విభాగాన్ని ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ సహకారంతో కీర్తిని భారత్‌కు రప్పించారు. అక్రమ నిర్బంధంపై స్విట్జర్లాండ్‌ పోలీసులు ఆదిత్య, జానకి, రవిశేఖర్‌పై కేసు నమోదు చేశారు.

కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి...
గత ఏడాది నగరానికి తిరిగి వచ్చిన భవ్యకీర్తి సీసీఎస్‌ అధీనంలోని ఉమెన్‌ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించడంతో వరకట్న వేధింపులు, బెదిరింపులు సహా వివిధ ఆరోపణలపై కేసు నమోదైంది. ఇటీవల నగరానికి వచ్చిన జానకికి పోలీసులు నోటీసుల జారీతో పాటు అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలకు లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్‌ఓసీ) పంపారు. నిందితురాలు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించగా... పోలీసుల దర్యాప్తునకు సహకరించాల్సిందిగా ఆదేశించింది. మరోపక్క ముందస్తు బెయిల్‌ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించగా... గురువారం మంజూరు చేసిన న్యాయస్థానం, వారంలో ఒకరోజు దర్యాప్తు అధికారి వద్ద హాజరయ్యేలా ఆదేశించింది. ఈ రెండు ఉత్తర్వుల్నీ ధిక్కరించిన జానకి శుక్రవారం ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్విట్జర్లాండ్‌ పారిపోవడానికి ప్రయత్నించారు. గుర్తించిన ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్‌ పోలీసులు ముంబై వెళ్లారు. న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు తాము జానకి పాస్‌పోర్ట్‌ మాత్రమే స్వాధీనం చేసుకుంటామని డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement