తప్పుచేస్తే నన్ను ఉరితీయండి! | Hang Me If I Am Guilty, says Narsingh Yadav | Sakshi
Sakshi News home page

తప్పుచేస్తే నన్ను ఉరితీయండి!

Aug 20 2016 9:58 AM | Updated on Sep 4 2017 10:06 AM

తప్పుచేస్తే నన్ను ఉరితీయండి!

తప్పుచేస్తే నన్ను ఉరితీయండి!

గత 24 గంటలుగా నేను బెడ్ మీదే ఉన్నాను. నాలో శక్తి అంతా సన్నగిల్లింది. ఏమీ చేయలేకపోతున్నాను. మెదడు అంతా శూన్యంగా మారిపోయింది

'గత 24 గంటలుగా నేను బెడ్ మీదే ఉన్నాను. నాలో శక్తి అంతా సన్నగిల్లింది. ఏమీ చేయలేకపోతున్నాను. మెదడు అంతా శూన్యంగా మారిపోయింది'.. ఇది భారత్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆవేదన.

అతను వాస్తవానికి ఈ సమయంలో రియో ఒలింపిక్స్ బౌట్ లో ఉండాలి. అందుకు పూర్తిగా సిద్ధమయ్యాడు కూడా. తన ప్రత్యర్థి ఎవరో ఖరారైంది. వెయిట్ చెకింగ్ కూడా అయిపోయింది. ఇక బౌట్ లోకి దిగి అమీతుమీ తేల్చుకోవాల్సిన తరుణంలో క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) నర్సింగ్ కు షాకిచ్చింది. అతడిపై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నట్టు క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సీఏఎస్) సంచలన తీర్పు వెలువరించింది.

దీంతో ఒలింపిక్స్ క్రీడా గ్రామం నుంచి అతన్ని పంపించేశారు. ఈ పరిణామాలతో కుమిలిపోతున్న నర్సింగ్ యాదవ్ తాజాగా 'ఎన్డీటీవీ'తో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 'నేను తప్పు చేసి ఉంటే నన్ను ఉరితీయండి. కానీ నా జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. అది సత్యం. ఈరోజు నేను వెయిట్ కూడా చెక్ చేసుకున్నాను. నన్ను అనుమతించిఉంటే తప్పకుండా దేశానికి పతకాన్ని తెచ్చేవాణ్ణి. ఈరోజు నర్సింగ్ కాదు దేశం పతకాన్ని కోల్పోయింది' అని పేర్కొన్నాడు. తన ప్రత్యర్థులు తన ఆహారం, డ్రింక్స్ లో డ్రగ్స్ కలుపడం వల్ల డోపింగ్ టెస్టు తనకు వ్యతిరేకంగా ఫలితం వచ్చిందని 74 కిలోల విభాగం రెజ్లర్ అయిన నర్సింగ్ పేర్కొన్నాడు.     
 

Advertisement
 
Advertisement
Advertisement