Sakshi News home page

గడ్డితో విమాన ఇంధనం..!

Published Sun, Apr 2 2017 10:48 PM

గడ్డితో విమాన ఇంధనం..!

లండన్‌: భవిష్యత్‌ తరాల కోసం మరింత సుస్థిర ఇంధన వనరులను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో పరిశోధకులు ‘గ్రాసోలైన్‌’ అనే ఇంధనాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఇంకొన్ని రోజుల్లో ఇది వాస్తవ రూపం దాల్చనుంది. గడ్డితో తయారు చేసే ఈ ఇంధనాన్ని విమానాల్లో ఉపయోగిస్తారు. ‘ఇప్పటి వరకు మీరు గడ్డిని కేవలం పశువులకు దాణగా ఉపయోగించడమే చుశారు. కానీ ఇప్పటి నుంచి గడ్డి ఒక జీవ ఇంధనంగా మారనుంది. సమృద్ధిగా లభించే గడ్డి ఇకపై మంచి శక్తి వనరుగా మారనుంది’ అని బెల్జియంలోని గేంట్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ వేసెర్న్‌కోర్‌ తెలిపారు.

గడ్డి నుంచి ఇంధనం తయారుచేయడానికి అందులోని చక్కెరలను లాటిక్‌ యాసిడ్‌గా మార్చడానికి కొన్ని రకాల బ్యాక్టిరియాలను జోడించారు. ‘బయోడిగ్రేడేబుల్‌ ప్లాస్టిక్టస్‌ (పీఎల్‌ఏ)’ అనే రసాయన సమ్మేళనాన్ని ఉత్పత్తి చేయడంలో లాటిక్‌ యాసిడ్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది ముందుగా కార్పిక్‌ యాసిడ్‌గా మారి తర్వాత డెకెన్‌ అనే రసాయనంగా రూపొందుతుంది. డెకెన్‌ను విమాన ఇంధనాల్లో ఉపయోగిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాగే ఇంకొన్ని రోజులు ప్రయత్నిస్తే జీవన ఇంధన ధర తగ్గడంతోపాటు కొన్నేళ్లలోనే ‘గడ్డి ఇంధనం’తో ఆకాశంలో ప్రయాణిస్తామని ప్రొఫెసర్‌ కోర్‌ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement