విడి సిగరెట్ల అమ్మకంపై నిషేధం | Govt proposes ban on sale of loose cigarettes | Sakshi
Sakshi News home page

విడి సిగరెట్ల అమ్మకంపై నిషేధం

Jan 14 2015 3:00 AM | Updated on Apr 6 2019 9:38 PM

విడి సిగరెట్ల అమ్మకంపై నిషేధం - Sakshi

విడి సిగరెట్ల అమ్మకంపై నిషేధం

ధూమపానాన్ని నిరుత్సాహపరిచి ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది.

ప్రతిపాదించిన ప్రభుత్వం
ఇక ప్యాకెట్లే అమ్ముతారు
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానానికి జరిమానా ఐదింతలు


న్యూఢిల్లీ: ధూమపానాన్ని నిరుత్సాహపరిచి ప్రజారోగ్యాన్ని కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. విడి సిగరెట్ల అమ్మకాలను నిషేధించనుంది. పొగతాగే అలవాటున్న వారు ఇకపై దమ్ము కొట్టాలంటే ప్యాకెట్ కొనాల్సిందే. సింగిల్ టీ తాగి ఒక సిగరెట్టు అంటించి వద్దామంటే కుదరదు. 18 ఏళ్లకు పైబడిన వారికే పొగాకు ఉత్పత్తులు అమ్మాలనే నిబంధన ఉంది. ఈ పరిమితి 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీన్ని భవిష్యత్తులో 23 ఏళ్లకు, తర్వాతి దశలో 25 ఏళ్లకు పెంచుతారు.

పొగాకు ఉత్పత్తుల మూలంగా వాటిల్లే ముప్పు నుంచి భావి తరాలను రక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల (సవరణ) బిల్లు - 2015 ముసాయిదాను కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరింది.

చట్ట సవరణ కోసం వేసిన కమిటీ సిఫారసులపై గతంలో పొగాకు రైతు సంఘాలు, సిగరెట్ పరిశ్రమ లాబీల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది. దాంతో చట్ట సవరణకు కేంద్రం వెనుకాడుతోందనే వార్తలు వచ్చాయి. అయితే మోదీ సర్కారు మాత్రం ప్రజారోగ్యానికే పెద్దపీట వేసింది. బిల్లులో కీలక సవరణలు ప్రతిపాదించింది. పొగాకు ఉత్పత్తి సంస్థలు దొడ్డిదారిన తమ ఉత్పత్తులకు ప్రచారం  చేసుకుంటున్నాయని, దీనిని అరికట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.ఈ రంగంలోని కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత పేరుతో కార్యక్రమాలు చేపట్టి దొడ్డిదారిన ప్రచారం పొందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

బిల్లులోని కీలక సిఫారసులు...
# సిగరెట్లను ప్యాకెట్‌గానే అమ్మాలి. విడి అమ్మకాలపై నిషేధం
# సిగరెట్లను 18 ఏళ్ల పైబడిన వారికే అమ్మాలనేది నిబంధన. ఇప్పుడీ వయోపరిమితి 21 ఏళ్లకు పెంపు.
# బహిరంగ ప్రదేశాల్లో ధూమపానానికి జరిమానా రూ.200 నుంచి రూ. 1,000కి పెంపు
# హోటళ్లు, రెస్టారెంట్లలో స్మోకింగ్ జోన్ల ఎత్తివేత.
# పొగాకు సాగులో, శుద్ధి ప్రక్రియలో, పొగాకు ఉత్పత్తుల అమ్మకాల్లో 18 ఏళ్ల లోపు వారిని పనిలో పెట్టుకోకూడదు.
# ఉల్లంఘనలకు గరిష్ఠ జరిమానా పది వేల నుంచి లక్ష రూపాయలకు పెంపు
# ఉల్లంఘనల కేసులను విచారించడానికి ప్రత్యేక సెషన్స్ కోర్టులు ఏర్పాటు.
# చట్టం అమలును పర్యవేక్షించడానికి స్వయంప్రతిపత్తి కలిగిన ’జాతీయ పొగాకు నియంత్రణ సంస్థ’ ఏర్పాటు.
# పొగాకు ఉత్పత్తులపై, ప్రకటనలపై పలు మాధ్యమాల్లో నిషేధం ఉంది. ఈ నిషేధం పరిధిలోకి తాజాగా మొబైల్, ఇంటర్నెట్‌లను కూడా చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement