
పసిడి ధరకు ‘డాలర్’ దిక్సూచి..!
అమెరికా ఆర్థిక అనిశ్చితి, డాలర్ కదలికల ఆధారంగా పసిడి ధర సమీప భవిష్యత్తులో ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా ఆర్థిక అనిశ్చితి, డాలర్ కదలికల ఆధారంగా పసిడి ధర సమీప భవిష్యత్తులో ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సానుకూల, ప్రతికూల వార్తలు డాలర్ లాభ, నష్టాలపై ప్రభావం చూపుతున్నాయి. డాలర్ కదలికలు పసిడి ధరపై కనబడుతున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలోనే గడచిన వారంలో గత గురువారం న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర ఏడు వారాల గరిష్ట స్థాయికి 1204.3 డాలర్లకు చేరింది. అయితే అటు తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగుందనీ, స్వల్పకాలంలో ఎటువంటి ఇబ్బందులూ లేవని, ఉపాధి అవకాశాల మార్కెట్ పటిష్టంగా కనబడుతోందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జానెట్ యెలెన్ చేసిన ప్రకటన డాలర్ బలోపేతానికి– పసిడి వెనక్కు తగ్గడానికీ దారితీసింది. మొత్తంమీద పసిడి గడచిన వారం 23 డాలర్ల లాభంతో 1,196 డాలర్ల వద్ద ముగిసింది. ఈ నెల ఆరవతేదీతో ముగిసిన వారం లో పసిడి 1,173 డాలర్ల వద్ద ముగిసింది. ఇక మొత్తంగా అమెరికా ఆర్థిక అనిశ్చితి పరిస్థితు లు, అస్పష్ట ప్రకటనల నేపథ్యంలో పెట్టుబడులకు సురక్షితమైన మెటల్‌గా పసిడి కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారానికి 1,170 డాలర్ల వద్ద మద్దతు ఉందని, 1,241 డాలర్ల వద్ద తొలి నిరోధం ఉండవచ్చని విశ్లేషణలు ఉన్నాయి.
భారత్‌లో రూ.500కుపైగా లాభం
అంతర్జాతీయ ధోరణి అనుగుణంగానే దేశీయంగా గడచిన రెండు వారాల్లో పసిడి రూ.1,000కుపైగా పెరిగింది. గడచిన వారం చూస్తే... ముంబై ప్రధాన స్పాట్ మార్కెట్‌లో శుక్రవారంనాటికి వారం వారీగా పసిడి ధర 99.9 ప్యూరిటీ 10 గ్రాములు రూ.555 పెరిగి రూ.29,040 వద్ద ముగిసింది. 99.5 ప్యూరిటీ ధర కూడా అదే స్థాయిలో ఎగసి రూ.28,890 వద్ద ముగిసింది. ఇక వెండి విషయానికి వస్తే, కేజీ ధర రూ.635 పెరిగి రూ.41,255కి చేరింది. వెండి రెండు వారాల్లో దాదాపు రూ.1,300 ఎగసింది.