కేసును తుదివరకు తీసుకెళ్లండి: ఈసీ | election commission writes to telangana government over cash for vote scam | Sakshi
Sakshi News home page

కేసును తుదివరకు తీసుకెళ్లండి: ఈసీ

Jun 17 2015 5:13 PM | Updated on Aug 14 2018 4:34 PM

ఓటుకు నోటు కేసును తుది వరకు అర్థవంతంగా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సూచించింది.

ఓటుకు నోటు కేసును తుది వరకు అర్థవంతంగా తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ సూచించింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి తెలంగాణ సర్కారుకు ఓ లేఖ అందింది. వాస్తవానికి ఓటుకు నోటు కుంభకోణం గత నెల 31వ తేదీ రాత్రి వెలుగుచూసింది. మర్నాడే తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ కేసు వివరాలను అప్పట్లోనే ఎన్నికల కమిషన్కు నివేదించారు.

అయితే, ఇప్పటికే తెలంగాణ ఏసీబీ ముమ్మరంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నందున దీన్నే కొనసాగించాలని ఈసీ తెలిపింది. దీన్ని 'లాజికల్ ఎండ్' వరకు తీసుకెళ్లాలని ఆ లేఖలో సూచించింది. రేవంత్ రెడ్డి, ఇతరులపై ఎల్విస్ స్టీఫెన్సన్ చేసిన ఆరోపణల కేసును ముమ్మరంగా దర్యాప్తు చేయాలని, దాన్ని తుదివరకు అర్థవంతంగా విచారించాలని తెలిపింది. ఈ విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) లేఖ ద్వారా తెలిపారు.

నిన్న మొన్నటి వరకు ఓటుకు నోటు కేసుతో తెలంగాణ ఏసీబీకి సంబంధం లేదని, వాళ్లకు నోటీసులు ఇచ్చే హక్కు, అరెస్టు చేసే అధికారం లేదని టీడీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. ఇది ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి, ఎన్నికల కమిషనే దీని గురించి చెప్పాలన్నారు. అయితే.. ఇప్పుడు నేరుగా ఎన్నికల కమిషనే కలగజేసుకుని, ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేయాలని, లాజికల్ ఎండ్ వరకు తీసుకెళ్లాలని సూచించడంతో.. తెలుగుదేశం పార్టీ నాయకులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. దీని గురించి ఇంక ఏమీ మాట్లాడే పరిస్థితి ఆ పార్టీ నాయకులకు కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement