దుర్గమ్మ భూములకు ‘సిద్ధార్థ’ ఎసరు!

దుర్గమ్మ భూములకు ‘సిద్ధార్థ’ ఎసరు!


రూ.వెయ్యి కోట్ల భూముల కైంకర్యం..  నేడు కేబినెట్ తీర్మానం

►  ప్రైవేట్ యాజమాన్యానికి 14.20 ఎకరాల అప్పగింత యత్నం

► రేపు మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై  చర్చ

► ప్రస్తుతం అక్కడ సిద్ధార్థ విద్యా సంస్థల నిర్వహణ

► పదేళ్లుగా దేవాదాయ శాఖ, సిద్ధార్థ మధ్య వివాదం

► హైకోర్టులో దేవాదాయశాఖకు అనుకూల నిర్ణయం

► ప్రైవేట్‌కు అనుకూలంగా సర్కారు నిర్ణయం?

► రూ.కోట్లలో చేతులు మారిన సొమ్ము
సాక్షి, అమరావతి:  విజయవాడ నడిబొడ్డున  కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి చెందిన రూ.1,000 కోట్ల విలువైన భూమికి రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టబోతోంది. బెంజి సర్కిల్ సమీపంలో ఉన్న 14.20 ఎకరాల దుర్గ గుడి భూములను ప్రైవేట్‌పరం చేయడంపై కసరత్తు జరుగుతోంది. రెండు చోట్ల ఉన్న ఆ భూముల్లో ప్రస్తుతం సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మార్కెట్ ధర ప్రకారం ఎకరం విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా.ఈ భూముల వ్యవహారంలో దేవాదాయ శాఖ, సిద్ధార్థ అకాడమీ యాజమాన్యాల మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. తాము విద్యా సంస్థలు నిర్వహిస్తున్న భూములకు బదులుగా నగరం వెలుపల అంతే విస్తీర్ణంలో భూములు కొని, దుర్గగుడి పేరిట రాసిస్తామని సిద్ధార్థ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సోమవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి, తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.అసలేం జరిగిందంటే...

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం పేరిట గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 225.74 ఎకరాల భూములున్నాయి. విజయవాడలోని పటమటలో సర్వే నంబరు 17లో ఉన్న 5.98 ఎకరాలను 50 ఏళ్లపాటు సిద్ధార్థ అకాడమీకి లీజుకిస్తూ 1973 డిసెంబర్ 6న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ భూమిలో శ్రీదుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1980లో అదే సిద్ధార్థ అకాడమీకి మొగల్రాజపురంలో సర్వే నంబరు 76లో 8.22 ఎకరాల దుర్గ గుడి భూమిని కూడా 50 ఏళ్లపాటు లీజుకిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో పీబీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అకాడమీని నెలకొల్పారు. ఎకరాకు రూ.5 వేల చొప్పున ఆయా భూములను అప్పటి ప్రభుత్వం సిద్ధార్థ అకాడమీకి లీజుకిచ్చింది. పదేళ్లకోసారి లీజు పెంచాలని నిబంధన విధించారు.ప్రభుత్వం వద్దకు రెండు ప్రతిపాదనలు

భూముల లీజును రద్దు చేస్తూ 2006లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సమయానికి సిద్ధార్థ అకాడమీ ఎకరాకు రూ.9 వేల చొప్పున దుర్గ గుడికి చెల్లిస్తూ ఉండేది. ప్రభుత్వం అధికారికంగా భూముల లీజును రద్దు చేయడంతో గత పదేళ్లుగా సిద్ధార్థ అకాడమీ నుంచి లీజు మొతాన్ని జమ చేసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ అకాడమీ ఈ ఏడాది జూలై 4న రెండు రకాల ప్రతిపాదనలు చేస్తూ ప్రభుత్వానికి ఒక దరఖాస్తు సమర్పించింది. తమ అధీనంలో ఉన్న భూములకు ఎకరాకు ఏడాదికి రూ.1.25 లక్షల చొప్పున లీజు చెల్లింపునకు అనుమతించాలని, లేదంటే ఆ భూమికి బదులుగా నగరం వెలుపల వేరే ప్రాంతంలో దుర్గగుడికి అంతే విస్తీర్ణంలో భూములు కొనుగోలు చేసి, ఇచ్చేందుకు అనుమతించాలని కోరింది.ఇదే సమయంలో దేవాదాయ శాఖ, సిద్ధార్థ అకాడమీ మధ్య ఉన్న వివాదాన్ని 8 వారాల్లో సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే లా సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. నవంబర్ 16వ తేదీ నాటికి 8 వారాల గడువు ముగియనున్న నేపథ్యంలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం సిద్ధార్థ అకాడమీకి భూములను అప్పగించడానికి సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది.

 

లీజు పెంపునకైతే మంత్రివర్గానికి అక్కరలేదు


లీజు పెంపు ప్రతిపాదనలకైతే నిబంధనల ప్రకారం అధికారుల స్థాయిలోనే నిర్ణయం తీసుకోవచ్చు. సంబంధిత శాఖ మంత్రి అనుమతితో లీజు పెంపు నిర్ణయం వెలువరించవచ్చు. కానీ, మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి, నిర్ణయం తీసుకోవాలన్న ప్రభుత్వ యోచనపై దేవాదాయ శాఖలో కొత్త చర్చ మొదలైంది. భూమికి బదులు భూమి ఇస్తామంటూ సిద్ధార్థ అకాడమీ చేసిన ప్రతిపాదనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో సిద్ధార్థ అకాడమీకి అనుకూలంగా నిర్ణయం వెలువడడానికి ఇప్పటికే రూ.కోట్లు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్గగుడి భూములపై ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ జోక్యం చేసుకుంటున్నట్లు దేవాదాయ శాఖలో చర్చ సాగుతోంది.

 

50 ఏళ్ల లీజును తప్పుపట్టిన విజిలెన్స్

దుర్గ గుడి భూములను 50 ఏళ్లపాటు లీజుకివ్వడాన్ని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగం 2000లో తీవ్రంగా తప్పుపట్టింది. దీనివల్ల దుర్గ గుడికి అప్పటి అంచనాల ప్రకారం రూ.7.42 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. లీజు నియమ నిబంధనలను పున:పరిశీలించాలంటూ డెరైక్టర్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగాధిపతి 2001లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రక్రియలో భాగంగా 2006లో అప్పటి ప్రభుత్వం పాత లీజులను రద్దు చే సి, కొత్త లీజుపై నిర్ణయానికి సిద్ధార్థ అకాడమీని చర్చలకు ఆహ్వానించిందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం తమ లీజును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సిద్ధార్థ అకాడమీ న్యాయ పోరాటానికి సిద్ధమైంది.దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కోర్టులోనూ ప్రభుత్వం లీజును రద్దు చేయడాన్ని సమర్థించగా, ఆ తర్వాత హైకోర్టు సైతం డిప్యూటీ కమిషనర్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుపై 2010లో సిద్ధార్థ అకాడమీ సుప్రీంకోర్టును అశ్రయించింది. 2010లో హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత అప్పటి దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి దుర్గగుడి భూములకు లీజు పెంపుపై  సిద్ధార్థ అకాడమీ యాజమాన్యంతో చర్చలు జరిపినా, అవి సఫలం కాలేదని దేవాదాయ శాఖ వర్గాలు తెలిపాయి.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top