వారికి ఆ అధికారం ఇవ్వనున్న సర్కారు
దేవాదాయ శాఖ చట్ట సవరణకు ప్రభుత్వం కసరత్తు
చట్టంలోని సెక్షన్ 83, 84 తొలగించాలని యోచన
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ!
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ భూములను ఆక్రమించి చేపట్టే నిర్మాణాలను ఇక నుంచి స్వయంగా ఆ దేవాలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఆధ్వర్యంలోనే కూల్చివేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతోంది. అందుకోసం దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు కార్యాచరణ చేపట్టనుందని సమాచారం. ఈ మార్పు వల్ల దేవుడి మాన్యాన్ని కాజేసేందుకు ప్రయత్నించే వారి ఆగడాలకు కొంతవరకు కళ్లెం వేసే వీలుంటుందని భావిస్తోంది. దీంతోపాటు ఇప్పటికే అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాదీనం చేసుకోవటం కూడా కొంత సులువు కానుంది.
వేల ఎకరాలు అన్యాక్రాంతం..: రాష్ట్రవ్యాప్తంగా 13,941 ఎకరాల దేవాదాయ భూములు ప్రస్తుతం కబ్జాదారుల అధీనంలో ఉన్నాయి. అత్యంత విలువైన ప్రాంతంగా ఉన్న మంచిరేవులలో వేణుగోపాల స్వామి దేవాలయ భూమిని కాజేసేందుకు రాజకీయ నేతలే పావులు కదుపుతున్నారు. ఇందులో ఓ కీలక నేత ముమ్మరంగా తెరవెనక పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతోపాటు ఇంకా ఎన్నో భూములు కబ్జా చెరలోకి చేరుతున్నాయి.
విషయం తెలిసినా ఆ దేవాలయ ఈఓ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకునే వీలే లేకుండా పోయింది. దేవుడి మాన్యం కబ్జాలపై ఆ ప్రాంత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి, అది దేవుడి భూమే అని రుజువులు చూపించాల్సి వస్తోంది. దేవాదాయ శాఖ చట్టంలో ఉన్న లోపాల వల్ల కళ్ల ముందే కబ్జా జరుగుతున్నా అధికారులు చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది. ట్రిబ్యునల్‌లో కేసు తేలేలోపు ఆ భూముల్లో నిర్మాణాలు వెలుస్తున్నాయి.
అధికారులకు సరైన ఆధారాలు చిక్కని పక్షంలో ఇక ఆ భూములు పరాధీనమైనట్టే. రాష్ట్రవ్యాప్తంగా 8,611.20 ఎకరాల భూమి కోర్టు కేసుల్లో చిక్కుకుంది. ఈ లొసుగులను తొలగిస్తే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని దేవాదాయ శాఖలోని ఓ డిప్యూటేషన్ అధికారి గుర్తించి ఆ శాఖ మంత్రికి ప్రతిపాదించారు. దీంతో దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 83, 84లను రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం చెరువు స్థలాలను కబ్జా చేస్తే హైడ్రా రంగంలోకి దిగి వాటిని స్వాధీనం చేసుకుంటోంది. ఇదే తరహాలో దేవుడి భూముల విషయంలోనూ యంత్రాంగానికి అధికారం ఉండేలా చట్ట సవరణలో పొందు పరచాలని ప్రభుత్వం భావిస్తోంది.


