గుడి వెనుక గూడు పుఠాణీ | Chandrababu TDP Coalition govt Scam in Temple Lands | Sakshi
Sakshi News home page

గుడి వెనుక గూడు పుఠాణీ

Sep 12 2025 5:31 AM | Updated on Sep 12 2025 5:31 AM

Chandrababu TDP Coalition govt Scam in Temple Lands

28.35 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోర్టు ఇచ్చిన తీర్పులోని భాగం

‘ముఖ్య’ నేత సహకారంతో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు, కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత పన్నాగం

ఎన్టీఆర్‌ జిల్లా నారికంపాడులో 1,036 ఎకరాల దేవుడి భూమి నిషేధిత జాబితా నుంచి తొలగింపు

హైకోర్టు తీర్పు పేరు చెప్పి 22 ఏ(1)(సీ) జాబితా నుంచి తప్పించేందుకు ఆదేశాలు 

కానీ, న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది 28.35 ఎకరాలకు మాత్రమే!.. మొత్తం 1,036 ఎకరాలనూ తొలగించాలంటూ జిల్లా రిజిస్ట్రార్‌కు ప్రభుత్వం లేఖ 

ఆలయ ఆస్తుల రిజిస్టర్‌లో ఇనాం.. ఎస్టేట్‌ భూముల పేరిట స్వాహాకు యత్నం.. ఈ భూముల మార్కెట్‌ విలువ దాదాపు రూ.1,000 కోట్లు! 

నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే భూములపై ఆలయానికి అధికారం ఉండదు!.. అనుభవదారులుగా పేర్కొంటున్నవారు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు 

దేవుడి భూములకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే... వాటిని ధారాదత్తం చేసేలా ఆదేశాలిచ్చింది! వారసత్వంగా వస్తున్న మాన్యాన్ని కాపాడాల్సిన సర్కారే... దగ్గరుండి దోచుకునే అవకాశం కల్పిస్తోంది!

విలువైన ఆస్తులు కబ్జాకు గురవుతుంటే అడ్డుకోవాల్సిన అధికారులనే అడ్డుపెట్టుకుని... అడ్డగోలు వ్యవహారానికి తెరతీసింది..! 

కళ్లుమూసుకుని... కోర్టు ఆదేశాలను పక్కదారి పట్టిస్తూ.. ఒకటీ, రెండు కాదు ఏకంగా వెయ్యి ఎకరాల ఆక్రమణను ప్రోత్సహిస్తోంది..!  

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో భూము­లకు రక్షణ లేకుండా పోతోంది. అత్యంత విలువైన­వాటిని రూపాయి అర్ధరూపాయికి కట్టబెట్టడమే కాదు... వేల ఎకరాలను అమాంతం మింగేసే కుతంత్రాలూ జరుగు­తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం వినగడప గ్రామంలోని శ్రీ జగన్మోహన వేణుగోపాలస్వామి ఆలయానికి సంబంధించిన రూ. వెయ్యి కోట్ల విలువైన భూముల వ్యవహా­రమే ఇందుకు నిదర్శనం. 

ప్రభుత్వంలో పైస్థాయి పెద్దల సహకారంతో స్థానిక నేతలు చక్రం తిప్పి ఈ  బాగోతం నడిపించారు. ఈ గుడికి చెందిన 1036.37 ఎకరాలను ‘‘రిజిస్ట్రేషన్‌ నిషేధించిన దేవదాయ భూములు’’ జాబితా నుంచి తొలగిస్తూ  ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ ఆగస్టు 1వ తేదీన ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ద్వారా రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. 

‘‘రిజిస్ట్రేషన్లు నిషే«­దించిన దేవదాయ భూముల జాబితా నుంచి తొల­గింపు’’ అంటే ఈ వెయ్యి ఎకరాలకు పైగా భూముల స్వాహాకు తెరతీసినట్లే..! ఇకమీద ఎవరైనా అమ్ము­కునే, కొనుక్కునేందుకు వీలు కల్పించినట్లే! తద్వారా వేణుగోపాలస్వామి భూము­లపై ఆలయం అన్ని అధికారాలు కోల్పోయినట్టే...! ఈ విషయాన్ని దేవ­దాయ శాఖ వర్గాలే నేరుగా అంగీకరిస్తున్నాయి...! ప్రభుత్వ ఆదేశాల వెనుక  ‘ముఖ్య’నేత సహకారం, ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులతో పాటు కృష్ణా జిల్లా టీడీపీ నేత పాత్ర ఉందని తీవ్ర చర్చ జరుగుతోంది. అధికార పార్టీ నేతల పైరవీలు, పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారడంతోనే ఇలా జరిగిందని ఉద్యోగులు చెప్పుకొంటున్నారు.

6 దశాబ్దాలుగా దేవుడి పేరిట...
గంపలగూడెం మండలం నారికంపాడు గ్రామంలో సర్వే నంబర్‌ 1 నుంచి 74–2 మధ్య ఉన్న 1036.37 ఎకరాలను పలువురు దాతలు వినపగడప జగన్మో­హన వేణుగోపాలస్వామి ఆలయానికి రాసిచ్చారు. దీనిపై దేవదాయ శాఖ వద్ద 60 ఏళ్ల నాటి రికార్డులు కూడా ఉన్నాయి. 1966 దేవదాయ శాఖ చట్టం ప్రకారం నిర్వహించే ఆలయ రికార్డులో, 1987 దేవ­దాయ శాఖ చట్టం మేరకు ఆలయాల వారీ ఆస్తుల రిజిస్టర్డ్‌ నంబరు 43లోనూ 1036.37 ఎకరాలు వేణుగోపాల స్వామి గుడికి సంబంధించిన ఇనాం భూమిగా రికార్డుల్లో స్పష్టంగా ఉంది. 

అంతేగాక దేవదాయ శాఖ భూమిగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ల నిషేధ 22(ఏ)(1)(సి) జాబితాలోనూ ఉంచారు. అయితే, ఈ 1036.37 ఎకరాలలో 28.35 ఎకరాలు తమవిగా పేర్కొంటూ మేకా తనూజ్‌ రంగయ్య అప్పారావు, మరో వ్యక్తి హైకోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో వారి భూములను రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గత ఏడాది అక్టోబరు 18వ తేదీన హైకోర్టు ఆదేశాలిచ్చింది. వీటిప్రకారం చర్యలు తీసుకోవాలంటూ మేకా తనూజ్‌ రంగయ్య అప్పారావు... ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు. 

ఈ ఏడాది జనవరి 7వ తేదీన 28.35 ఎకరాలపై ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. తర్వాత దేవదాయ శాఖ, ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్, ప్రభుత్వం మధ్య ఈ ఏడాది మార్చి 6, 8న, ఏప్రిల్‌ 8, జూలై 4న ఉత్తర ప్రత్యు­త్తరాలు సాగాయి. అనంతరం ఏకంగా మొత్తం 1,036.37 ఎకరాలను రిజిస్ట్రేషన్ల నిషేధ జాబితా నుంచి తొలగించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్‌ ఆగస్టు 13న ఆదేశాలిచ్చేశారు.

అర్చకుడికి జీతాలూ ఇవ్వలేని స్థితి
వినగడప శ్రీజగన్మోహన వేణుగోపాలస్వామి ఆల­యా­నికి రూ.లక్ష ఆదాయం కూడా లేదు. రూ.12 లక్షలు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు ఉండగా... వడ్డీ, ఇతర రాబడులు అన్నీ కలిపి ఏటా రూ.70–రూ.80 వేల మధ్య వస్తున్నాయి. ఈ డబ్బు అర్చకుడి జీతాల చెల్లింపులకే సరిపోతున్నాయని, చిన్న ఉత్సవం జరగాలన్నా గ్రామస్తులు చందాలు వేసుకోవాల్సి వస్తున్నదని ఆల­య సిబ్బంది వాపోతున్నారు.

ధర్మకర్తే అధర్మంగా వ్యవహరిస్తే...
దేవుడి భూముల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయా­ల్సిన బాధ్యత ప్రభుత్వం, దేవదాయ శాఖలది. ఈ క్రమంలో కొన్నిసార్లు కింది కోర్టుల తీర్పులు వ్యతి­రేకంగా వచ్చినా... గుడి ఆస్తులను కాపాడేందుకు అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఉదాహరణలున్నాయి. ఒక్క గజం కూడా కోల్పోకుండా అధికా­రులు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, శ్రీజగన్మోహన వేణుగోపాల­స్వామి ఆలయ భూము­లపై హైకోర్టు కేవలం 28.35 ఎకరాల విషయంలో తీర్పు చెబితే... ప్రభుత్వం ఏకంగా 1,036 ఎకరా­లను రిజిస్ట్రేషన్ల నిషేధ దేవదాయ శాఖ భూముల జాబితా నుంచి తొలగిస్తూ  ఆదేశాలిచ్చింది. ఇంతకంటే విడ్డూరం ఏమీ ఉండదని దేవదాయ శాఖ అధికారుల్లో  చర్చ నడుస్తోంది.

హైకోర్టు తీర్పునే తప్పుదారి పట్టించేశారు...
నిరుడు అక్టోబరు 18న హైకోర్టు ఇచ్చిన ఆదే­శాల మేరకు... ఆ భూముల సాగుదా­రులుగా పేర్కొంటున్న రైతులు దేవదాయ శాఖను సంప్రదించారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొంది... 1,036.37 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు దేవదాయ శాఖ ఉన్న­తాధికారి పేర్కొంటున్నారు. కానీ, హైకోర్టు తీర్పు వెలువరించిన పిటిషన్‌లో... తమ 28.35 ఎకరాలకు సంబంధించి మాత్రమే పిటిషన్‌­దారులు కేసు వేశారు. కోర్టు కూడా ఆ భూములపైనే తీర్పు ఇచ్చింది.

ఇక గతంలో... జగన్మోహన వేణుగోపాల­స్వామి ఆలయానికి దాతలు ఇచ్చిన 1036.37 ఎకరాలకు ఏటా రూ.1,080 (ఎక­రాకు రూ.1.04) చొప్పున భత్యం చెల్లించే ఒప్పందంతో జిల్లా కలెక్టర్‌ ఆ భూములను స్వాధీనం చేసుకున్నారని దేవదాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

సుప్రీం తీర్పును పక్కన పెట్టిమరీ..
దేవదాయ శాఖ పరిధిలో ఉండే ఇనాం భూము­లపై గతం నుంచి వర్తించే విధంగా... సుప్రీంకోర్టు 2013లో కీలక తీర్పు వెలువరించింది. దీనిప్రకా­రం 2013కి ముందు, ఆ తర్వాత సంబంధిత ఇనాం భూముల అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లవు. 2013కు ముందు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగి వాటిని రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసినప్పటికీ అది చెల్లుబాటు కాదు. వినగడప వేణుగోపాల­స్వామి ఆలయ ఆస్తుల రికార్డులో ఇనాంగా పేర్కొన్నందున సుప్రీంతీర్పు ఈ భూములకూ వర్తిస్తుంది. 

కానీ, అధికార పార్టీ నేతల పైరవీలు, పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారడంతో సుప్రీంకోర్టు తీర్పును పక్కనపెట్టి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, వేణుగోపాలస్వామి ఆలయ భూములు దేవదాయ శాఖవి కాబట్టే కలెక్టరు ఏటా భత్యం చెల్లిస్తున్నారని, రిజిస్ట్రేషన్ల నిషేధ జాబితా నుంచి తొలగిస్తే ఆ భూములపై హక్కు కోల్పోయినట్టేనని అధికారులు పేర్కొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement