
రెండు బస్సుల్లో భారీ పేలుళ్లు
మదురైలో రెండు బస్సుల్లో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
భారీ పేలుళ్లు, మదురై, బస్సులు
టైంబాంబ్ అమర్చిన దుండగులు
తీవ్రవాదులుగా అనుమానం
మదురైలో ఘటన
చెన్నై: మదురైలో రెండు బస్సుల్లో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. మదురై ఆరప్పాలయం బస్‌స్టేషన్ మార్గంలో వైగై నది ఒడ్డున నీటి తొట్టి ఉంది. మదురై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రాత్రివేళల్లో ఈ నీటి తొట్టె పక్కనే ఉన్న సర్వీసు రోడ్డులో నిలపడం అలవాటు. యథాప్రకారం బుధవారం రాత్రి సైతం అనేక బస్సులు ఈ సర్వీసు రోడ్డులో నిలిచి ఉన్నాయి. సేలం, హోసూరుల నుంచి అదే సర్వీసు రోడ్డులో నిలిపి ఉన్న రెండు ప్రభుత్వ బస్సుల నుంచి రాత్రి 9.15, 9.20 గంటలకు భీకర శబ్దంతో వరుసగా రెండు పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల ధాటికి బస్సు ముక్కలు దూరంలో ఎగిరిపడ్డాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. పేలుళ్ల సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
గతంలో మదురైలో సంభవించిన పేలుళ్లకు ఉపయోగించిన మందుగుండు సామగ్రినే ఈ పేలుళ్లకు వినియోగించినట్లు తేలింది. పేలుడు సమయానికి సరిగ్గా 15 నిమిషాలకు ముందు హెల్మెట్ ధరించిన నలుగురు యువకులు రెండు బస్సుల్లో టైంబాంబ్‌ను అమర్చి సర్వీసు రోడ్డులోని చీకట్లో జారుకున్నట్లు గుర్తించారు. మదురైకి చెందిన ఇమాంఅలి, అతని సహచరులను పోలీసులు బెంగళూరులో ఎన్‌కౌంటర్ చేసి హతమార్చారు. ఎన్‌కౌంటర్ సంఘటన 2002 సెప్టెంబర్ 29వ తేదీన జరిగింది. ఆ ఏడాది నుంచి ఇంచుమించుగా అదే రోజుల్లో మదురైలో ఏదో ఒక పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ కోవలో 30వ తేదీన పేలుళ్లకు పాల్పడడంతో ఇది ఇమాంఅలి ముఠా పనేనని అనుమానిస్తున్నారు. అంతేగాక ముంబయి లోకల్ రైళ్లలో పేలుడు కేసులో ఐదుగురు ఉరిశిక్ష పడినందుకు నిరసనగా బాంబులు పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.