అమెరికా వైమానిక దాడులతో దక్షిణి అమెరికా దేశం వెనెజులా దద్దరిల్లింది. భారత కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం ఆ దేశ రాజధాని కరాకస్‌తో దాడులు మొదలయ్యాయి. అసలేం జరగుతుందో అర్థంకాక జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
భారీ పేలుళ్ల తర్వాత.. కరాకస్ సిటీ అంధకారంగా మారింది. కీలకమైన పోర్ట్, ఎయిర్‌పోర్టులు సహా మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కరాకస్ నుంచి మొదలైన దాడులు.. క్రమక్రమంగా ఇతర రాష్ట్రాల్లోనూ(మిరాండా, అరాగ్వా, లా గువైరా) కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ దాడులు అమెరికా పనేనని ఆరోపించిన వెనెజులా జాతీయ అత్యవసర పరిస్థితి(Emergency in Venezuela) ప్రకటించింది. సైనిక స్థావరాలతో పాటు జనావాసాలపైనా దాడులు జరుగుతున్నట్లు చెబుతోంది. పలుచోట్ల రక్షణ దళాలను మోహరింపజేసింది.
అమెరికా సైన్యం వెనిజులాపై దాడులు ప్రారంభించిందని ఫాక్స్ న్యూస్ వర్గాలు వాషింగ్టన్ అధికారులను ఉటంకిస్తూ నివేదించాయి. ఈ దాడుల లక్ష్యం దేశంలోని చమురు, ఖనిజ వనరులను స్వాధీనం చేసుకోవడం కోసమేనని, రాజకీయ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీయడం అని వెనెజులా ఆరోపించింది. అయితే, గతంలోలాగే ఈ ప్రయత్నాలు ఈ ప్రయత్నాలు కూడా విఫలమవుతాయని అంటోంది. అయితే అమెరికా ఈ దాడులపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.


ఈ వేకువజామున కరాకస్‌లో మొత్తం ఏడు చోట్ల పేలుళ్లు సంభవించినట్లు ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ కథనం ప్రచురించింది. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నట్లు శబ్దాలూ వినిపించాయని స్థానికులు చెప్పినట్లు ఆ కథనం ఉటంకించింది.
que dios bendiga a todas las personas inocentes que quedaron en medio del bombardeo en caracas - venezuela pic.twitter.com/etH1wbo1sa
— haaland erling (@gxldehaalandd) January 3, 2026
ఇదిలా ఉంటే.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో కొంతకాలంగా వెనెజువెలాను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. ట్రంప్ ఆదేశాల మేరకు డ్రగ్స్‌ను తరలిస్తున్న పడవలు, జలాంతర్గాములపై దాడుల్ని ముమ్మరం చేసింది. కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది. దీనికి కౌంటర్‌గా అమెరికన్ పౌరులను వెనెజులా అరెస్ట్ చేయడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ పరిణామాల నడుమ వైమానిక దాడులకు దిగడం గమనార్హం.

వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో.. చైనా ప్రత్యేక దౌత్యవేత్త క్వీ గ్సియాగితో భేటీ అయిన కొద్దిగంటలకే ఈ దాడులు జరిగాయి. వెనెజులా అధ్యక్ష భవనం లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ పేలుళ్ల ఆ చుట్టుపక్కల ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
ఈ పేలుళ్ల గురించి ట్రంప్‌నకు స్పష్టమైన సమాచారం ఉందని సీబీఎస్ వార్తా సంస్థ ఒక కథనం ప్రచురించింది. పేలుళ్ల నేపథ్యంతో అమెరికా తమ దేశ విమానాలు వెనెజులా గగనతలం నుంచి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. స్థానికంగా ఉండే సీఎన్‌ఎన్ జర్నలిస్ట్ ఒకరు పేలుడుకు సంబంధించిన పోస్ట్ ఒకటి చేశారు. శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయని.. ఆ ధాటికి తాను ఉంటున్న కిటికీ అద్దాలు పగిలిపోయాయని చెప్పుకొచ్చారు.
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ఈ పేలుళ్లపై స్పందించారు. వెనెజులా రాజధాని క్షిఫణుల దాడులతో మారుమోగుతోందని.. ప్రపంచం ఈ విషయం గమనించాలని అన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్(OAS), ఐక్యరాజ్య సమితి తక్షణమే సమావేశం నిర్వహించాల్సి ఉందంటూ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్‌చేశారాయన.


