‘చిత్రావతి’ టెండర్‌లో విచిత్ర అర్హతలు..! | "Citravati 'peculiar requirements of the tender ..! | Sakshi
Sakshi News home page

‘చిత్రావతి’ టెండర్‌లో విచిత్ర అర్హతలు..!

May 1 2015 2:17 AM | Updated on Sep 3 2017 1:10 AM

‘చిత్రావతి’ టెండర్‌లో విచిత్ర అర్హతలు..!

‘చిత్రావతి’ టెండర్‌లో విచిత్ర అర్హతలు..!

టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చిత్రావతి ఆనకట్ట నిర్మాణ పనులు కట్టబెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

  • ఎంపీ సీఎం రమేష్ కంపెనీ కోసమే..
  • ‘షీట్‌పైల్స్’ నిబంధనతో పోటీ నివారించిన ప్రభుత్వం
  • రూ.17 కోట్ల భారం
  • సాక్షి, హైదరాబాద్: టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చిత్రావతి ఆనకట్ట నిర్మాణ పనులు కట్టబెట్టడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ. 86 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టు టీడీపీ నేతకే కట్టబెట్టడానికి చిత్రమైన అర్హతలు నిర్ణయించింది. అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం గొడ్డుమర్రి వద్ద చిత్రావతిపై రూ. 86 కోట్ల వ్యయంతో ఆనకట్ట నిర్మాణానికి ప్రభుత్వం ఏప్రిల్ 18న టెండర్లు పిలిచింది.

    మే 1 వరకు బిడ్స్ సమర్పించడానికి గడువు ఇచ్చింది. 2వ తేదీన టెండర్లు తెరవనుంది. మొత్తం రూ. 86 కోట్ల విలువైన పనుల్లో రూ. 6 కోట్ల విలువైన ‘షీట్ పైల్స్’ (నీటి ప్రవాహ ధాటికి భారీగా కోతకు గురయ్యే ప్రాంతాల్లో కోతను నివారించడానికి వీలుగా ఏర్పాటు చేసే ‘జడ్’ ఆకారంలో ఉన్న రేకులు) ఏర్పాటు చేయాల్సి ఉంది. 1,586 చదరపు మీటర్ల ‘షీట్ పైల్స్’ ఏర్పాటు చేయాలని టెండర్లలో పేర్కొన్నారు. అందులో సగం.. అంటే 793 మీటర్ల మేర షీట్ పైల్స్ ఏర్పాటు చేసిన అనుభవం ఉన్న కంపెనీలే టెండర్లు దాఖలు చేయాలని అర్హతగా నిర్ణయించారు.

    మిగతా రూ. 80 కోట్ల విలువైన పనికి నిబంధనలు సాధారణంగా ఉన్నాయి. ‘షీట్ పైల్స్’ నిబంధన వల్ల రాష్ట్రంలో పేరున్న పెద్ద కంపెనీలు టెండర్‌లో పాల్గొనకుండా ప్రభుత్వం అడ్డుకోగలిగిందని నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన కంపెనీ ‘రిత్విక్ ప్రాజెక్ట్స్’ను హంద్రీనీవాలో నాసిరకంగా పనులు చేసినందుకు ప్రభుత్వం గతంలో బ్లాక్ లిస్టులో పెట్టిన విషయాన్ని సీనియర్ అధికారి ఒకరు గుర్తుచేశారు. దాంతో బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు, అదీ టీడీపీ ఎంపీకి చెందిన కంపెనీకి కాంట్రాక్టు కట్టబెడితే వచ్చే విమర్శలను తప్పించుకోవడానికి సీఎం రమేష్ కంపెనీ తెర వెనక ఉండి, తెర మీదకు మరో కంపెనీని తీసుకొచ్చి కాంట్రాక్టు కట్టబెట్టే ప్రయత్నం జరిగినట్టు అధికారులు చెప్తున్నారు.
     
    మొదట ‘షీట్ పైల్స్’ ప్రస్తావనే లేదు..

    చిత్రావతి ఆనకట్ట నిర్మాణానికి గతంలో రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. అప్పట్లో ఈ ‘షీట్ పైల్స్’ ప్రస్తావనే లేదు. అంచనా వ్యయాన్ని రూ. 86 కోట్లకు పెంచినప్పుడు టెండర్లలో పోటీని నివారించడానికి కొత్త నిబంధన వచ్చి చేరిందని అధికారులు చెబుతున్నారు.చిత్రావతిలో షీట్‌పైల్స్ వాడాల్సిన అవసరం లేదని, ఒక వేళ వాడాలని నిర్ణయించినా, దాన్ని అర్హత నిబంధనల్లో చేర్చాల్సిన అవసరం లేదంటున్నారు. టెండర్‌లో పోటీ నివారిస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా నష్టమని, కనీసం 20 శాతం ‘లెస్’కు టెండర్ మంజూరు చేసినా.. రూ.17 కోట్లకుపైగా భారం తగ్గుతుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement