జాబిల్లిపై దిగిన చైనా రోవర్ | China's first lunar rover lands on moon | Sakshi
Sakshi News home page

జాబిల్లిపై దిగిన చైనా రోవర్

Dec 15 2013 1:39 AM | Updated on Sep 2 2017 1:36 AM

జాబిల్లిపై దిగిన చైనా రోవర్

జాబిల్లిపై దిగిన చైనా రోవర్

అంతరిక్ష రంగంలో చైనా కీలక ముందడుగు వేసింది. ఇటీవల ప్రయోగించిన తొలి రోవర్‌ను శనివారం చందమామపై విజయవంతంగా దింపింది.


బీజింగ్: అంతరిక్ష రంగంలో చైనా కీలక ముందడుగు వేసింది. ఇటీవల ప్రయోగించిన తొలి రోవర్‌ను శనివారం చందమామపై విజయవంతంగా దింపింది. దీంతో అమెరికా, సోవియెట్ యూనియన్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో దేశంగా చైనా రికార్డు సృష్టించింది. చైనా డిసెంబరు 1న లాంగ్‌మార్చ్-3బీ రాకెట్ ద్వారా చాంగ్-3 వ్యోమనౌకను ప్రయోగించిన సంగతి తెలిసిందే. యుటూ (జేడ్ ర్యాబిట్) అనే రోవర్, ల్యాండర్‌తో కూడిన చాంగ్-3 శనివారం రాత్రి 9:11 గంటలకు చంద్రుడిపై సైనస్ ఇరిడమ్ (హరివిల్లుల అఖాతం) అనే చోట సురక్షితంగా దిగిందని ఈ మేరకు బీజింగ్ ఏరోస్పేస్ కంట్రోల్ సెంటర్ వెల్లడించింది. చంద్రుడిపై ఓ రోవర్ దిగడం గత నాలుగు దశాబ్దాలలో ఇదే తొలిసారి.

 

చైనీయుల విశ్వాసం ప్రకారం.. జాబిల్లిపై ఉండే దేవత పేరు ‘చాంగ్’ కాగా, ఆమె తెల్లని పెంపుడు కుందేలు పేరే ‘యుటూ’. చంద్రుడిపై పరిశోధనలో రెండో దశలో భాగంగా చైనా ఈ చాంగ్-3 ప్రయోగం చేపట్టింది. తొలిదశలో భాగంగా 2007లో చాంగ్-1, 2010లో చాంగ్-2 వ్యోమనౌకలను చైనా పంపింది. కానీ అవి చంద్రుడి చుట్టు మాత్రమే తిరిగి సమాచారాన్ని సేకరించాయి. తాజాగా.. చంద్రుడిపై దిగిన ల్యాండర్ దిగినచోటే ఉండి పరిశోధనలు కొనసాగిస్తుంది. ఖగోళ వస్తువుల మీదా దృష్టిపెడుతుంది. ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి మూడునెలలపాటు మూడు చదరపు కి.మీ. ప్రాంతంలో తిరుగుతూ చంద్రుడి అంతర్నిర్మాణాన్ని, ఉపరితలాన్ని సర్వే చేస్తుంది. సహజ వనరుల కోసం అన్వేషణ సాగిస్తుంది.
 
 ఇలా దిగిపోయింది:  చంద్రుడికి 15 కి.మీ. దూరం నుంచే వేరియెబుల్ థ్రస్ట్ ఇంజిన్ వేగం క్రమంగా తగ్గిస్తూ వ్యోమనౌక 100 మీటర్ల సమీపానికి చేరుకుంది. చంద్రుడి ఉపరితలంపై రాళ్లు, అడ్డంకులు లేని తగిన స్థలాన్ని సెన్సర్లతో గుర్తించింది. అనంతరం షాక్‌అబ్జార్బర్ల సాయంతో నెమ్మదిగా నాలుగు కాళ్లూమోపి దిగిపోయింది. అత్యంత కీలకమైన ఈ ప్రక్రియంతా 12 నిమిషాల్లో ఆటోమేటిక్‌గా జరిగిపోయింది.  వ్యోమనౌకకు, దాని పరికరాలకు ఎలాంటి నష్టం కలగకుండానే సురక్షితంగా ‘సాఫ్ట్ ల్యాండింగ్’ పూర్తయిపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement