భారత మహిళా క్రికెటర్‌.. అతన్ని తెగ కాపీ కొట్టేది! | Sakshi
Sakshi News home page

భారత మహిళా క్రికెటర్‌.. అతన్ని తెగ కాపీ కొట్టేది!

Published Mon, Jul 3 2017 12:26 PM

భారత మహిళా క్రికెటర్‌.. అతన్ని తెగ కాపీ కొట్టేది!

సంగ్లీ: భారత మహిళా క్రికెట్‌ జట్టు ఓపెనర్‌ స్మృతి మంధన పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇటీవల వరల్డ్‌ కప్‌లో సెంచరీ బాదిన ఈ అమ్మాయిని భారత లెజండ్ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం ప్రశంసల్లో ముంచెత్తారు.. స్మృతి చిన్నప్పుడు తన ఫేవరెట్‌ క్రికెటర్‌ కుమార సంగక్కర తెగ కాపీ కొట్టేదట. అతని ప్రతి బ్యాటింగ్‌ స్టైల్‌ను నకలు చేసేందుకు ఆమె ప్రయత్నించడంతో కోచ్‌ కొన్నిసార్లు తలంటాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని ఆమె చిన్ననాటి కోచ్‌ అనంత్‌ తంబ్వేకర్‌ తెలిపారు. స్మృతికి చిన్నప్పుడే క్రికెట్‌ మీద ఇష్టం ఏర్పడింది. దీంతో తన సోదరులతో కలిసి ఆమె కూడా అనంత్‌ తంబ్వేకర్‌ కోచింగ్‌ అకాడమీలో చేరింది.

'స్మృతి చిన్నప్పటినుంచి చాలా హుషారుగా ఉండేది. అదేసమయంలో నెట్స్‌లో మాత్రం చాలా క్రమశిక్షణతో మెలిగేది. ఒక షాట్‌ ఆడటంలో కచ్చితత్వం సాధించేవరకు ఆమె నెట్స్‌ను వదిలిపెట్టేది కాదు. నెట్స్‌లో తను ఎప్పుడూ శ్రీలంక బ్యాట్స్‌మన్‌ సంగక్కరను కాపీ కొట్టడానికి ప్రయత్నించేది. దీంతో కొన్నిసార్లు నేను ఆమెను తిట్టేవాడిని. అలా కాపీ కొట్టడం సరికాదని చెప్పేవాడిని' అని అనంత్‌ తెలిపారు. 20 ఏళ్ల స్మృతి వరల్డ్‌ కప్‌లో భాగంగా గత గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement